కడప,సెప్టెంబర్ 26, (way2newstv.com)
ఏటా వర్షాభావ పరిస్థితులు.. సాగుకాని ప్రధాన పంటలతో ఆరుగాలం కష్టపడి పని చేసే రైతన్న నేడు పాడి పశువులు, జీవాలను పెంచుకొంటూ కాలం నెట్టుకొంటూ వస్తున్నారు. వేల సంఖ్యలో పశుసంపద ఉన్నా మండలానికి ఉన్నదే చిన్నమండెంలో ఒక్కటే ఆసుపత్రి. ఒక్కడే వైద్యుడు. అదీ కూడా పక్క మండలం నుంచి వస్తున్న ఇన్‌ఛార్జి వైద్యుడు. సంకరజాతి, జెర్సీ ఆవులకు తరచూ వ్యాధులు సోకుతుంటాయి. రైతు ఏమారితే వేలరూపాయల్లో నష్టపోవాల్సిందే. అదే వైద్యుని కోసం ప్రయత్నిస్తే సకాలంలో చేరుకోలేక పలు పశువులు మృత్యువాత పడుతుండడంతో రైతులు నష్టపోతున్నారు. 10 నెలల కిందట ఒకే పశువైద్యశాల ఉన్న మండలం నుంచి భవన వసతి, ఇతర సౌకర్యాలున్న చోట ప్రతిపాదనలు పంపాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీంతో వండాడి, చాకిబండల్లో వసతులున్నాయని, అక్కడ కొత్తగా పశువుల ఆసుపత్రులు ఏర్పాటుకు సరిపడా పశుసంపద ఉందని తేల్చి అప్పటి డీడీహెచ్ గుణశేఖరపిళ్లై ప్రతిపాదనలు పంపారు.
ఎవ్వరికి పట్టని పశువుల ఆస్పత్రులు
ఈ ప్రతిపాదనలు సంబంధిత శాఖ డైరెక్టరు దగ్గర ఉన్నాయి. ఏళ్ల తరబడి మండలంలో ఒకే ఆసుపత్రి ఉండడం, పశువులు, జీవాలు అధికంగా ఉండడంతో ఉన్న ఒకే వైద్యుడు అన్ని గ్రామాలకు వెళ్లలేక నానాపాట్లు పడుతున్నారు. గోపాలమిత్రలు అందుబాటులోకి రావడంతో కాస్త ఉపశమనం కలిగినా సమస్యలు మాత్రం తగ్గడం లేదు. గత ప్రభుత్వ హయాంలో అప్పటి పశువైద్యుడు శివారెడ్డి, ఏడీ గుణశేఖరపిళ్లైలు గ్రామీణ ఉప పశువైద్య కేంద్రాలకోసం ఐదు చోట్ల ఏర్పాటు చేయాలని తీర్మానాలు చేసి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం దగ్గర మాస్టర్ పుస్తకంలో నమోదు కూడా అయ్యాయి. తీరా అనుమతులు వచ్చే సమయంలో రాష్ట్రం విడిపోవడంతో ఆ కాగితాలుమరుగున పడిపోయింది ప్రభుత్వ హయాంలో బీఆర్‌జీఎఫ్‌కింద చాకిబండ, వండాడి గ్రామాల్లో పశువైద్యశాలల కోసం భవనాలు నిర్మించారు. రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన ఈ భవనాలు నేటి వరకు వృథాగా ఉండిపోయాయి. జిల్లాలోనే ఒకే ఆసుపత్రి, ఒకే వైద్యుడు ఉన్న మండలం చిన్నమండెం ఒక్కటే. ఈ మండలం నుంచి ప్రతిపాదనలు కావాలని ప్రభుత్వం కోరగా రెండు చోట్ల భవనాలు ఉండడంతో కొత్త ఆసుపత్రులకు ప్రతిపాదనలు పంపారు.