జాతీయ రాజకీయాలపై చంద్రబాబు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జాతీయ రాజకీయాలపై చంద్రబాబు...

విజయవాడ, సెప్టెంబర్ 21, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రాష్ట్రంతో పాటు ఇప్పుడు మళ్లీ దేశ రాజకీయాల వైపు చూస్తున్నారా? జాతీయ స్థాయి నేతగా పేరున్న చంద్రబాబు గత కొంతకాలంగా హస్తిన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు వరకూ ఆయన హస్తినకు ఎక్కువ సార్లు పర్యటించారు. ఎన్నికల కమిషన్, రాష్ట్రపతిలను కలవడంతో పాటు ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఢిల్లీ కేంద్రంగా ధర్మ పోరాట దీక్ష కూడా చేశారు. జాతీయ మీడియా సమావేశాలను పలుమార్లు పెట్టి మోదీపై చిందులు తొక్కారు. పోలింగ్ అనంతరం కూడా ఆయన ఢిల్లీ వెళ్లి ఈవీఎంలపై ఫిర్యాదు చేసి వచ్చారు.అయితే మూడు నెలల నుంచి చంద్రబాబు ఢిల్లీ వైపు కన్నెత్తి చూడలేదు. 
జాతీయ రాజకీయాలపై చంద్రబాబు...

ముందు మోదీపై విరుచుకుపడటం, బీజేపీయేతర పక్షాలను ఏకం చేయడానికి ప్రయత్నించిన చంద్రబాబుకు ఢిల్లీలో ఇప్పుడు పనిలేదు. ఎందుకంటే ఏపీలో తెలుగుదేశం పార్టీ దారుణంగా ఓటమి పాలయింది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీకి తన పరిస్థితే ఏర్పడింది. అందుకే ఆయన మూడు నెలలుగా హస్తిన ప్రయాణాన్ని పెట్టుకోలేదు. జాతీయ మీడియా ఎడిటర్లతో కూడా చంద్రబాబు ఫోన్ లో మాట్లాడటం తప్ప జాతీయ పార్టీ నేతలకు ఎవరికి అందుబాటులోకి వెళ్లలేదు.ఇప్పుడు హస్తిన అవసరం చంద్రబాబుకు ఏర్పడిందంటున్నారు. రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని పదే పదే చంద్రబాబు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇటీవల అక్రమ కేసులను తట్టుకోలేక మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జాతీయ మీడియాతో సమావేశమై ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పరిణామాలను వివరించాని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ బాధితుల కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా తాము పునరావాస కేంద్రం ఏర్పాటు చేసిన విషయాన్ని జాతీయ స్థాయిలో చర్చకు తేవాలని భావిస్తున్నారు.చంద్రబాబు హస్తిన పర్యటన త్వరలోనే ఉండవచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కోడెల పై పెట్టిన కేసులు, ఇతర ముఖ్యనేతలపై బనాయించిన అక్రమ కేసులను మీడియాకు వివరించడమే కాకుండా హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసేందుకు సిద్ధమవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మోదీ అపాయింట్ మెంట్ దొరికితే ఆయనను కూడా కలిసే అవకాశాలున్నాయంటున్నారు. టీడీపీ నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులను తమలో విలీనం చేసుకున్నా చంద్రబాబు బీజేపీని ఒక్క మాట కూడా అనలేదు. పైగా బీజేపీకి లోపాయికారిగా సహకరిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ పెద్దలను కలిసే ఆలోచన చంద్రబాబు సీరియస్ గానే చేస్తున్నట్లు తెలుస్తోంది. లేకుంటే ఇక్కడ తమ పార్టీని జగన్ ఇబ్బందుల పాలు చేస్తారని ఆయన భావించారు. మరి బీజేపీ పెద్దలు చంద్రబాబును కలుస్తారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.