రైతులకు కౌలు కష్టాలు... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతులకు కౌలు కష్టాలు...

ఏలూరు, సెప్టెంబర్ 15, (way2newstv.com)
ఏటా వివిధ రకాల విపత్తులతో వ్యవసాయం నష్టాలను మిగుల్చుతున్నా తన ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాడు రైతు. వ్యవసాయాన్నే నమ్ముకున్న రైతులు భూమి లేకున్నా కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నారు కౌలు రైతులు. పంట వస్తుందో.. రాదో.. వచ్చినా గిట్టుబాటు అవుతుందో.. లేదో అనేది తెలియక పోయినా.. 'ఈసారైనా' పంటలు బాగా పండకపోతాయా అన్న ఆశతో వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులకు రుణాలు ఇవ్వడంలో బ్యాంకర్లకు నమ్మకం కలగడం లేదు. ప్రభుత్వం చెబుతున్నా.. అధికారులు హెచ్చరిస్తున్నా రుణం ఇవ్వడానికి ఇష్టపడడం లేదు. 
రైతులకు కౌలు కష్టాలు...

కౌలు రైతులు అధిక వడ్డీలకు ప్రయివేటు వ్యక్తుల నుంచి అప్పులు తీసుకుని నష్టపోతున్నారు.కౌలురైతులకు కూడా బ్యాంకు రుణాలు ఇస్తామని ప్రభుత్వం పదే పదే చెబుతోంది. జిల్లా కలెక్టర్‌ బ్యాంకర్లతో సమీక్షలు చేసి రుణాలు ఇవ్వాలని చెప్పారు. జిల్లాలో ఏ ఒక్క కౌలు రైతుకు రుణం అందలేదు. 2011లో కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు ఇచ్చేందుకు ప్రత్యేక చట్టం వచ్చింది. జిల్లాలో ఈఏడాది 29,782 మందికే రుణ అర్హత కార్డులను ప్రభుత్వం ఇచ్చింది. అర్హత కార్డులు వచ్చినా కౌలుదారులకు ఎటువంటి మేలు జరగలేదు. ఏటా పంట రుణాల లక్ష్యంలో కౌలు రైతులకు 10 శాతం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈఏడాది ఖరీఫ్‌ పంట రుణాల లక్ష్యం రూ.4,360.41 కోట్లుగా ఉంది. కౌలు రైతులకు అందులో పది శాతం రూ.436 కోట్లు రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. ఖరీఫ్‌ సీజన్‌ ముగుస్తున్నా ఇప్పటికీ కైలు రైతులు రుణం కోసం చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఆలస్యంగానైనా వర్షాలు బాగా కురిసినా చాలామంది రైతులు పెట్టుబడి లేక పొలాలను బీళ్లుగా పెట్టుకున్నారు. కొందరు ప్రయివేటు వ్యక్తుల నుంచి అప్పులు తెచ్చుకుని ఆరుతడి పంటలు వేసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో మొత్తం రైతులు 7.20 లక్షల మంది ఉన్నారు. ఇందులో కౌలుదారులు 2.50 లక్షల మంది ఉన్నారు. ఈఏడాదికి కొత్తవి, రెన్యువల్‌ కలిపి జిల్లా మొత్తం 29,782 మంది కౌలుదారులకు రుణ అర్హత కార్డులు పంపిణీ చేశారు. కౌలుదారులు జెఎల్‌జి గ్రూపులుగా ఏర్పడితే రుణాలు ఇప్పిస్తామని కలెక్టర్‌ సూచించడంతో పలు గ్రామాల్లో కౌలుదారులు జెఎల్‌జి గ్రూపులుగా ఏర్పడ్డారు. అయినప్పటికీ బ్యాంకర్లు పట్టించుకోవడం లేదు. జులై నెలలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో కలెక్టర్‌ సమావేశం ఏర్పాటు చేశారు. కౌలు రైతులందరికీ రుణాలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. ఖరీఫ్‌ సీజన్‌ ముగుస్తున్నా ఒక్కరికీ రుణం అందలేదు.బ్యాంకర్లు భూయజమానులకు ఇచ్చే విలువ కౌలు రైతులకు ఇవ్వడం లేదు. వారు ఆర్థిక అవస్థలు ఎదుర్కొంటున్నారు. 2011 కౌలు రైతు చట్టం ప్రకారం భూమి యజమానుల అనుమతుల్లేకుండానే కౌలు రైతులకు రుణ అర్హత కార్డులివ్వాలి. చాలామంది భూయజమానులు తమ భూములపై కౌలు రైతులు రుణాలు తీసుకునేందుకు అంగీకరించడం లేదు. కౌలు రైతులకు సక్రమంగా రుణాలందించే పరిస్థితి లేకుండా పోయింది. ఇదే సమయంలో 2015లో ల్యాండ్‌ ఓనర్‌ అనుమతి లేకుండా రుణ అర్హత కార్డులివ్వవద్దని రెవెన్యూ ప్రిన్సిపల్‌ సెక్రటరీ కొత్త సర్క్యులర్‌ను జారీ చేశారు. అసలే భూ యజమానుల అనుమతి లేక రుణాలు పొందలేని కౌలు రైతులకు ఈ సర్క్యులర్‌ మరింత అడ్డంకిగా మారింది. ఒక వేళ ఒకరిద్దరు భూయజమానులు అంగీకరించినా కౌలు రైతులకు రెండోసారి రుణాలివ్వడం లేదు. తమ భూమిని చూపి భూ యజమానులు ముందే పంట రుణాలు తెచ్చుకుంటుండడంతో కౌలు రైతులకు రెండోసారి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తున్నాయి.పదేళ్లుగా 10 ఎకరాల భూమిని కౌలుకు తీసకుని పంటలు సాగు చేస్తున్నాను. మూడేళ్ల క్రితం రుణ అర్హత కార్డు ఇచ్చారు. ఒక్కసారి కూడా బ్యాంకులు రుణం ఇవ్వడం లేదు. బయట అధిక వడ్డీకి తెచ్చి పంట సాగు చేస్తున్నాను. ప్రభుత్వం మాటలు మేము వింటున్నా బ్యాంకులు వినడం లేదు. భూమి యజమానులకే రుణం ఇస్తున్నారు. భూ యజమానుల నుంచి తనఖా పత్రం ఉంటేనే వ్యవసాయ రుణాలు ఇస్తామంటున్నారు. పత్రాలు ఇవ్వడానికి భూ యజమానులు ఒప్పుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.