న్యూఢిల్లీ, సెప్టెంబర్ 21, (way2newstv.com)
చంద్రుడిపై అధ్యయనానికి ప్రయోగించిన చంద్రయాన్-2 98శాతం విజయవంతమైందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ కె.శివన్ అన్నారు. భువనేశ్వర్ ఐఐటీలో ఓ కార్యక్రమానికి శనివారం హాజరైన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రయాన్-2లోని ఆర్బిటర్ పనితీరు బాగుందని తెలిపారు. ఆర్బిటర్‌లోని 8 సైన్స్ పరికరాల తమ విధులను సక్రమంగా నెరవేరుస్తున్నాయని చెప్పారు. విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు పునరుద్ధరించడానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని, శనివారం ఉదయంతో 14 రోజుల కాలపరిమితి పూర్తయిందని శివన్ పేర్కొన్నారు.భూకేంద్రంతో విక్రమ్‌కు సంబంధాలు తెగిపోడానికి గల కారణాలను ఇస్రో నిపుణులు శోధిస్తున్నారని, ఈ నివేదిక అనంతరం తదుపరి కార్యాచరణ చేపడతాని వివరించారు. ఇస్రో తదుపరి లక్ష్యం ‘గగన్‌యాన్ మిషన్’ అని శివన్ ఈ సందర్భంగా వెల్లడించారు.
టార్గెట్ గగన్ యాన్
ఇస్రో చేపట్టబోయే మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు ‘గగన్‌యాన్’. దీని ద్వారా 2022 నాటికి వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపాలని ఇస్రో లక్ష్యంగా నిర్దేశించుకుంది.సాయుధ బలగాల్లోని టెస్ట్ పైలట్లను వ్యోమగాములుగా పంపాలని ఇస్రో భావిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే ఎంపిక ప్రక్రియ కూడా చేపట్టింది. ముగ్గురిని ఎంపిక చేసి తొలుత భారత్‌లో, తర్వాత రష్యాలో వీరికి ప్రత్యేక శిక్షణ ఇప్పించనున్నారు. గగన్‌యాన్ ద్వారా వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపితే.. స్వయంగా మానవులను అంతరిక్షంలోకి పంపిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది. వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపి వారి సురక్షితంగా భూమిపైకి తీసుకురావడం చాలా ముఖ్యం.విక్రమ్ ల్యాండర్ పక్కకి ఒరిగడం వల్ల సిగ్నళ్లు పోయినట్లు ఇస్రోకి సమాచారం అందింది. మరోవైపు నాసా (NASA) ప్రయోగించిన లూనార్ రీకానిసెన్స్ ఆర్బిటర్ సైతం విక్రమ్ ల్యాండర్ దిగిన దక్షిణ దృవం మీదగానే ప్రయాణించింది. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో కొన్ని ఫొటోలను తీసింది. అయితే, ఆ ఫొటోల్లో విక్రమ్ ల్యాండర్ జాడ కనిపించలేదు.ఆ ప్రాంతంలో సూర్య రశ్మి తక్కువగా ఉండటంతో ఫొటోలు మసక మసకగా కనిపించాయి. చంద్రుడిపై ఒక రోజు అంటే భూమిపై 14 రోజులతో సమానం. చంద్రయాన్-2 ఆర్బిటార్ నుంచి విడిపోయిన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగి సుమారు 11 రోజులు తర్వాత నాసా ఎల్ఆర్వో ప్రయాణించింది. అప్పటికే ఆ ప్రాంతంలో క్రమేనా చీకటి ఆవరించడం, వెలుతురు సరిగా లేకపోవడంతో విక్రమ్ ల్యాండర్ కనిపించలేదు.