వృక్షాల అరణ్య రోదన.. (నల్గొండ) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

వృక్షాల అరణ్య రోదన.. (నల్గొండ)

నల్గొండ, సెప్టెంబర్ 19 (way2newstv.com): 
అభయారణ్యంలో చెట్లు బిక్కుబిక్కుమంటు న్నాయి. హైవే విస్తరణకు అవి బలికానున్నాయి. వనం గుండా జనం వెళ్లేందుకుగాను వృక్షాలపై వేటు వేయనున్నారు. నాగర్‌కర్నూల్, నల్లగొండ జిల్లాల్లో 83 చ.కి.మీ. పరిధిలో (దాదాపు 20 వేల ఎకరాల్లో) యురేనియం తవ్వకాలకు రంగం సిద్ధం అవుతున్న తరుణంలోనే ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ జోన్‌ పరిధిలో మరో ఉపద్రవం ఎదురుకానుంది. రోడ్డు విస్తరణపేరిట పులుల అభయారణ్యంలోని నేష నల్‌ హైవే 765 మీదుగా దాదాపు 60 కి.మీ. పరిధిలో 20 వేల చెట్ల వరకు నేలకూలనున్నాయి.  నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆధ్వర్యంలో తోకపల్లి నుంచి హైదరాబాద్‌ వరకు చేపడుతున్న రోడ్డుప్రాజెక్టులో భాగంగా రోడ్డుకు ఇరువైపులా వేలాది చెట్లు కొట్టేందుకు రాష్ట్ర అటవీశాఖ నేతృత్వంలో మార్కింగ్‌లు కూడా పూర్తయ్యాయి. 
వృక్షాల అరణ్య రోదన.. (నల్గొండ)

ఆమ్రాబాద్‌ పులుల అభయార ణ్యం మీదుగా శ్రీశైలంకు వెళ్లే మార్గం ఇరుకుగా ఉన్న నేపథ్యంలో రోడ్డు విస్తరణ చేపట్టాలని నేషనల్‌ హైవే అథారిటీ నుంచి రాష్ట్ర అటవీశాఖకు అయిదారు నెలల కిందటే ప్రతిపాదనలు అందాయి. వీటిని నాగర్‌కర్నూల్‌ జిల్లా అటవీ అధి కారులకు అటవీశాఖ పంపించింది. ఈ ప్రతి పాదనలకు అనుగుణంగా ఫారెస్ట్‌ డివిజన్‌ ఆఫీసర్‌ నివేదికను సిద్ధం చేసింది. మరో వారం, పదిరోజుల్లోనే ఈ నివేదికపై మళ్లీ జిల్లా అటవీ అధికారి, డీఎఫ్‌వో, ఫీల్డ్‌ ఆఫీసర్లు వాల్యువేషన్‌ రిపోర్ట్‌ను సిద్ధం చేసి రాష్ట్ర అటవీ శాఖకు పంపిస్తారు. ఇక్కడి నుంచి రాష్ట్ర వన్యప్రాణి బోర్డుకు, కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు, కేంద్ర వన్యప్రాణిబోర్డుకు ఈ నివేదికలు పంపించాక, ఈ ప్రాజెక్టు ఎప్పుడు ‘ప్రారంభించాలనే దానిపై నేషనల్‌ హైవేస్‌ అథారిటీ నిర్ణయం తీసుకుంటుంది. ఈ రోడ్డు విస్తరణలో భాగంగా ఎన్ని వేల చెట్లు పోతాయి, వాట విలువ ఏమిటీ, అడవి ఏ మేరకు నష్టపోతుంది, దెబ్బతినే అటవీ భూమి విస్తీర్ణం ఎంత తదితర వివరాలను ఈ నివేదికలో జిల్లా అటవీ అధికారులు పొందుపరుస్తారు. తదనుగుణంగా డబ్బు రూపంలో ఎంత పరిహారమివ్వాలి, కోల్పోయిన అటవీభూమికి ఇతర భూములు ఎక్కడ ఎన్ని ఎకరాల మళ్లించాలి.. తదితర అంశాలపై నేషనల్‌ హైవే నిర్ణయం తీసుకుంటుంది.శ్రీశైలంకు వెళ్లే వాహనాల రద్దీ శని, ఆదివారాల్లోనే ఎక్కువగా ఉంటుందనేది అటవీ శాఖ అధికారుల అంచనా. మామూలు రోజుల్లో ఈ దారిలో వెళ్లే వాహనాల సంఖ్య వెయ్యిలోపే ఉంటుందని, వీకెండ్స్, సెలవురోజుల్లో రెండున్నర వేల వరకు వీటి సంఖ్య ఉంటుందని చెబుతున్నారు. అందువల్ల రోడ్డు విస్తరణతో అడవికి నష్టం చేయడం సరికాదని పర్యవరణవేత్తలు కూడా సూచిస్తున్నారు.  ఇరుకైన సింగిల్‌ రోడ్డు వల్ల శ్రీశైలం దేవస్థానానికి వెళ్లే భక్తులకు ఇబ్బందులు కలుగుతున్నాయని నేషనల్‌ హైవేస్‌ అథారిటీ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. ఈ రోడ్డులో మూలమలుపులు ఉన్నందున ప్రమాదాలు జరుగుతున్నాయని, వాటిని విస్తరణ ద్వారా సరిచేయాలని తెలిపింది. మన్ననూరు గ్రామం నుంచి శ్రీశైలం దేవాలయానికి వెళ్లేందుకు ఉన్న శ్రీశైలం బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణ చేపడతారు. దోమలపెంట గ్రామం వద్ద ఈ రోడ్డు ముగుస్తుంది. ఈ 60 కి.మీ. పరిధి అంతా కూడా ఆమ్రాబాద్‌ టైగర్‌ రిజర్వ్‌ కోర్‌ ఏరియాలోనే ఉంది. రోడ్డు వెడల్పు వల్ల అడవికి, వేలాది చెట్లకు, జంతువులకు, పులుల అభయాణ్యానికి నష్టం జరుగుతుందని పర్యావరణవేత్తలు ఆందోళన చెందుతున్నారు. వాహనాలు పెరిగి కాలుష్య ప్రభావం కూడా ఈ టైగర్‌ రిజర్వ్‌పై పడుతుంది.వాహనాల వేగం పెరిగి జంతువులు ప్రమాదాల బారిన పడే అవకాశం పెరుగుతుంది.