నెల్లూరు, సెప్టెంబర్ 7, (way2newstv.com)
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన వాలంటీర్ల వ్యవస్థపై హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠం అధిపతి స్వామి కమలానంద భారతి సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్ల ద్వారా క్రైస్తవ మత ప్రచారం చేసే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. పాస్టర్లను గుర్తించే బాధ్యతలు వాలంటీర్లకు ఇవ్వడం సరికాదన్నారు. వాలంటీర్లు, పాస్టర్ల ద్వారా హిందువుల మతం మార్చే అవకాశాలున్నాయన్నారు. వాలంటీర్లు, పాస్టర్ల ద్వారా ఓ నెట్‌వర్క్ సృష్టిస్తున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఆ రెండు మతాలకు కొమ్ముకాస్తున్నట్లుందని కమలానంద ఆక్షేపించారు. కేవలం రెండు మతాలను మాత్రమే సంతృప్తి పరిచేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
జగన్ పై కమలానంద భారతి ఫైర్
అన్ని మతాలను సమానంగా చూడాలని సూచించారు. పాస్టర్లకు, మౌజమ్‌లకు జీతాలు ఇవ్వాలనుకుంటే చర్చిలు, మసీదుల ఆదాయం నుంచి ఇవ్వాలన్నారు. దేవదాయ శాఖ లాంటి ఓ విభాగాన్ని ఏర్పాటు చేసి, దాని ద్వారా జీతాలు చెల్లించాలన్నారు. పేదలకు నివాస స్థలాలు పంచడం కోసం దేవాలయ భూములు తీసుకోవాలనుకోవడం తగదన్నారు. మిషనరీ భూములు, వక్ఫ్ భూములు తీసుకోనప్పుడు దేవాలయ భూములు ఎలా తీసుకుంటారని కమలానంద ప్రశ్నించారు.టీటీడీ పాలక మండలి సభ్యుల వివాదంపై కమలానంద స్పందించారు. సభ్యుల సంఖ్య పెంపుతో పెద్దగా ఉపయోగం లేదన్నారు. టీటీడీకి ఖర్చులు పెరగడం మినహా మరేమీ ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు. రాజకీయ నిరుద్యోగుల కోసమే పాలకమండలి సభ్యుల సంఖ్యను పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల సహా ఏ హిందూ దేవాలయంలోనూ అన్యమతస్తులకు ఉద్యోగాలు ఇవ్వరాదన్నారు. హిందూ దేవాలయాల్లో ఉద్యోగాలు చేస్తున్న అన్యమతస్తులను వెంటనే గుర్తించి విధుల తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.