హైద్రాబాద్, సెప్టెంబర్ 13 (way2newstv.com)
గ్రేటర్ హైదరాబాద్లో వినాయక నిమజ్జనాలు ప్రశాంతంగా ముగిసాయి. ఒక్క చిన్న అవాంఛనీయ ఘటన కూడా జరగకుండా పోలీసులు జాగ్రత్త పడ్డారు. అనుకున్న సమయానికి కంటే ముందే నిమజ్జనాలను క్లోజ్ చేశారు. మొహర్రం, గణేష్ నిమజ్జనం, మోహన్ భగవత్ పర్యటన ఇలా అన్ని కూడా ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. వినాయక నిమజ్జనం కారణంగా హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ భారీగా స్తంభించింది. ట్యాంక్‌బండ్ చుట్టూ కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, లోయర్ ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, రానిగంజ్, సికింద్రాబాద్, సంగీత సర్కిల్, బేగంపేట్, జూబ్లీహిల్స్, మాదాపూర్ ప్రాంతాల్లోవంటి ప్రధాన మార్గాల్లో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. ట్రాఫిక్ డైవర్షన్‌ను ఎత్తివేయడంతో ఈ పరిస్థితి ఏర్పడింది.
ప్రశాంతంగా ముగిసిన నిమజ్జనం
ట్రాఫిక్ సమస్యతో నగరంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. సిటీ నలుమూలల నుంచి వాహనాలు వస్తూనే ఉన్నాయి. ఫలితంగా అక్కడక్కడా ట్రాఫిక్ జామ్స్ తలెత్తాయి. ఖైరతాబాద్ ద్వాదశ ఆదిత్య మహా గణపతిని క్రేన్ నంబర్ 6 దగ్గర పూజలు చేసి గంగమ్మ ఒడికి సాగనంపారు. రాత్రి వేళలో పెద్ద వాహనాలపై ధూంధాం డప్పు చప్పుళ్లు, హోరెత్తే నినాదాల మధ్య గణనాథులు తరలివచ్చారు. నగర వీధులన్నీ వినాయక విగ్రహాలు, ప్రజలతో కిక్కిరిసిపోయాయి. హుస్సేన్ సాగర్ పరిసరాలు జనసంద్రాన్ని తలపించాయి.ఓవైపు విగ్రహాల్ని నిమజ్జనం చేస్తుంటే... మరోవైపు చెరువులు, హుస్సేన్ సాగర్‌లో వ్యర్థాల తొలగింపు జోరుగా కొనసాగింది. నిన్న రాత్రి నుంచే వ్యర్థాల్ని తొలగించే ప్రక్రియ ప్రారంభించారు. ఈసారి హుస్సేన్ సాగర్‌లో ఎక్కువ నీరు ఉండడంతో... లోపల ఎన్ని విగ్రహాలు ఉన్నాయో తెలియట్లేదు. చిన్నా పెద్ద అన్నింటినీ తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఇనుము వ్యర్థాల్ని పట్టుకుపోయేందుకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. ఇలా హుస్సేన్ సాగర్ పరిసరాలు ఇవాళ కూడా హడావుడిగానే ఉన్నాయి.మొత్తానికి ఈ ఏడాది వినాయక నిమజ్జనోత్సవం భారీ బందోబస్తు మధ్య ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి అయ్యాయి.