నిమజ్జనానికి నీళ్లేవి - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నిమజ్జనానికి నీళ్లేవి

అనంతపురం, సెప్టెంబర్ 6, (way2newstv.com)
అనంతపురం జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు ఇటు రైతులనే కాకుండా వినాయక విగ్రహాలకు కరువు దెబ్బ తప్పడం లేదు. ఎంతో వైభంగా జరుపుకున్న అనంతరం వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలంటే నీళ్లు కరువయ్యారు. వరుసగా రెండో ఏటా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని చెరువులు దాదాపు 90 శాతానికిపైగా నీళ్లు లేకుండా వెలవెలబోతున్నాయి. దీంతో వినాయక చవితి పండుగ తరువాత జరిపే వినాయక నిమజ్జనానికి నీళ్లు లేకపోవడంతో ఎండిపోయిన చెరువుల్లోనే విగ్రహాలనే వదిలేసి వస్తున్నారు. జిల్లా కేంద్రమైన అనంతపురం నగరంలోనూ ఈసారి ప్రత్యేక కష్టాలొచ్చాయి. గతంలో అనంతపురం నగరంలోనున్న మిడ్‌పెన్నార్‌ దక్షిణ కాలువలో విగ్రహాలను నిమజ్జనం చేసేవారు. 
నిమజ్జనానికి నీళ్లేవి

కాని మూడేళ్లుగా ఆ పరిస్థితి లేక ఇబ్బందులు పడుతున్నారు. మిడ్‌పెన్నార్‌కు తుంగభద్ర నుంచి నీళ్లు రావడం ఆలస్యమవడంతో దక్షిణ కాలువకు నీరు విడుదల చేయలేదు. దీంతో 20 కిలోమీటర్ల దూరంలోనున్న శింగనమల చెరువులో ఒకసారి, పండమేరు వంకలో మరోమారు విగ్రహాలను నిమజ్జనం చేయాల్సి వచ్చింది. ఈసారి చూస్తే ఆ శింగనమల చెరువులో కూడా విగ్రహాల నిమజ్జనానికి సరిపడ నీరు లేదు. దీంతో ఎక్కడ నిమజ్జన ఏర్పాట్లు చేయాలన్న దానిపై అధికారులు తలలు పట్టుకున్నారు. చివరకు ఆత్మకూరు సమీపంలోనున్న హంద్రీనీవా కాలువలో చేయాలని నిర్ణయించారు. ఈ కాలువ కూడా గత నెల 28వ తేదీన నీరు విడుదల చేశారు. ప్రధాన రహదారిపై నిమజ్జన ఏర్పాట్లు చేయడం వల్ల వాహనాల రాకపోకలకు ఇబ్బందులున్నా విధిలేని పరిస్థితుల్లో అక్కడే నిర్ణయించారు. అనంతపురం నగరంలో సుమారు 700 విగ్రహాల వరకు ఏర్పాటు చేశారు. ఇందులో 200 వరకు చిన్న,చిన్న విగ్రహాల నిమజ్జనం మూడవ రోజే పూర్తయింది. తక్కిన 500 విగ్రహాలు శుక్రవారం నిమజ్జనం చేయనున్నారు. వీటికి ఆత్మకూరు వద్దనున్న హంద్రీనీవా కాలువ వద్దనే అని నిర్ణయించడంతో అక్కడ ఏర్పాట్లు పూర్తి చేశారు.జిల్లాలో అన్ని మండలాల్లోనూ చెరువులున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1472 చెరువులు ఉన్నాయి. వీటిల్లో కేవలం రెండు చెరువుల్లోనే పూర్తి స్థాయిలో నీరున్నాయి. యాడికి, పెద్దవడుగూరు మండలాల్లోని ఒక్కో చెరువులోనే పూర్తిస్థాయి సామర్థ్యంతో నీళ్లున్నాయి. తక్కిన వాటిల్లో చూసినప్పుడు ఐదు చెరువుల్లో 75 శాతం, 47 చెరువుల్లో 25 శాతం మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఇక మిగిలిన 1406 చెరువుల్లో నీటి చుక్కలేదు. మండలాల వారీగా చూసినప్పుడు అమడగూరులో 41 చెరువులుంటే అన్నింటిలోనూ నీరు లేవు. ఆగలిలో 24 ఉంటే అన్నీఖాళీనే. గోరంట్లలో అత్యధికంగా 89 చెరువులుంటే 89 చెరువుల్లోనూ చుక్కనీరు లేదు. అక్కడ భూగర్బ జలాలు సైతం అత్యల్ప స్థాయిలో ఉండటం గమనార్హం. కదిరి, ముదిగుబ్బ, నల్లమాడ ఇలా అనేక మండలాల్లో చెరువులు అత్యధికంగానున్నా నీళ్లు లేవు. దీంతో చేసేది లేక ఎండిపోయిన చెరువుల్లోనే మూడు రోజుల పాటు పూజించిన వినాయక విగ్రహాలను వదిలేసి రావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.