సిద్ధప్పకు...తప్పని తిప్పలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సిద్ధప్పకు...తప్పని తిప్పలు

బెంగళూర్, సెప్టెంబర్ 21, (way2newstv.com)
కర్ణాటకలో కాంగ్రెస్ కు వరస దెబ్బలు తగులుతున్నా ఆపార్టీలో సఖ్యత ఎక్కడా కన్పించడం లేదు. ఒకవైపు డీకే శివకుమార్ ను మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ అరెస్ట్ చేసింది. అలాగే బెళగావి ఎమ్మెల్యే లక్ష్మీ హెబ్బాళ్కర్ కు కూడా తమ ఎదుట విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఆదేశాలు జారీ చేసింది. వరసగా కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఈడీ ఉచ్చులో చిక్కుకుంటున్నారు. మరోవైపు ఉప ఎన్నికలు వచ్చే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి.ఈ పరిస్థితుల్లో ఐక్యంగా ఉండాల్సిన కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఏమాత్రం తగ్గలేదు. ఆధిపత్యం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. కర్ణాటక కాంగ్రెస్ లో గ్రూపులు కొత్తేమీ కాదు. సిద్ధరామయ్య ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పార్టీలో అసంతృప్తులు తలెత్తకుండా జాగ్రత్త పడ్డారు. 
సిద్ధప్పకు...తప్పని తిప్పలు

సీనియర్ నేతలు వీరప్ప మొయిలీ, మల్లికార్జున ఖర్గేలు హైకమాండ్ వద్ద మంచి పట్టు ఉన్నా తన జోలికి రాకుండా సిద్ధరామయ్య జాగ్రత్తలు తీసుకున్నారు. అందుకే ఆయన ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగగలిగారు.అయితే ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం కోల్పోవడంతో పరిస్థితి తలకిందులైంది. మిత్రపక్షమైన జేడీఎస్ తో సంబంధాలు తెగిపోయాయి. ప్రభుత్వం కుప్పకూలిపోవడానికి కారణం సిద్ధరామయ్యే అంటూ కాంగ్రెస్ పార్టీలో నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సిద్ధరామయ్యను శాసనసభ పక్ష నేతగా తొలగించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారే పార్టీని వీడి వెళ్లిపోవడంతో ఆయనను టార్గెట్ చేసుకున్నారు.మాజీ ఉప ముఖ్యమంత్రి జి. పరమేశ్వర్ సిద్ధరామయ్యను లక్ష్యంగా చేసుకుని హస్తినలో పావులు కదుపుతున్నారు. సిద్ధరామయ్య పై పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి పరమేశ్వర్ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. సిద్ధరామయ్య నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీకి మనుగడ లేదని ఆయన సోనియాతో చెప్పినట్లు సమాచారం. సిద్ధరామయ్య పార్టీ కోసం కాకుండా తన వ్యక్తిగత ప్రాపకం కోసం పాకులాడుతున్నారని సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు. మొత్తం మీద ఉప ఎన్నికలు వస్తున్న వేళ కాంగ్రెస్ లో ముఠా రాజకీయాలు ఆ పార్టీని ముంచేస్తాయని చెప్పక తప్పదు.