సూపర్ ఎమెర్జెన్సీ అంటున్న దీదీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సూపర్ ఎమెర్జెన్సీ అంటున్న దీదీ

బెంగాల్, సెప్టెంబర్ 19, (way2newstv.com)
దేశమంతా నరేంద్ర మోడీకి సరెండర్ అంటోంది. లోపల ఎలాగున్నా బయటకు మాత్రం నరేంద్ర మోడీ అంటే వ్యతిరేకించని రాజకీయం మరో వైపు సాగుతోంది. దేశంలో అనేక పార్టీలు, నాయకులు ఉన్నారు. ఎవరూ కూడా నరేంద్ర మోడీని పరుషంగా నిందించాలంటే ఇపుడు ముందుకు రాని పరిస్థితి. కానీ ఒకే ఒక్కరుగా ఉన్నారు బెంగాల్ లేడీ టైగర్ మమతా బెనర్జీ. ఆమె మాత్రం నరేంద్ర మోడీ రెండు సార్లు ప్రధానిగా బంపర్ మెజారిటీతో గెలిస్తే నాకేంటి నేను ఆయన్ని తిడుతూనే ఉంటానంటూ తన రూటే సెపరేట్ అనేస్తున్నారు. నరేంద్ర మోడీ పార్టీ బెంగాల్లో సగానికి సగం ఎంపీ సీట్లు లాగేసింది. రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కుర్చీ కూడా ఎగరేసుకుపోయేందుకు రెడీ అవుతోంది. 
సూపర్ ఎమెర్జెన్సీ  అంటున్న దీదీ

అయినా సరే మమత వెనకంజ వేయడంలేదు. నరేంద్ర మోడీ విధానాల మీద నా పోరాటం ఎప్పటికీ ఆగదని క్లారిటీగా చెప్పేస్తున్నారు.దేశంలో ఇపుడు సూపర్ ఎమర్జెన్సీ నడుస్తోందని ఘాటైన మాటలే వాడారు మమతాబెనర్జీ. నిజానికి ఎమర్జెన్సీ గురించి అందరూ విన్నారు కానీ సూపర్ ఎమర్జెన్సీ ఏంటో ఎవరికీ అర్ధం కావడంలేదు. కానీ మమత నరేంద్ర మోడీ పాలనని నియంత్రుత్వానికే అసలు రూపమని అంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని దారుణంగా అవమానిస్తూ దెబ్బతీస్తున్న నరేంద్ర మోడీ దేశానికి ఇస్తున్న సందేశం ఏంటి అని కూడా మమత ప్రశ్నిస్తున్నారు. నరేంద్ర మోడీ మార్క్ పాలనను ఆమె ఎండగడుతున్నారు. దేశంలో మోడీయిజమే ఉండాలా, మరేమీ అక్కరలేదా అంటూ మమత సంధిస్తున్న ప్రశ్నలు బీజేపీ పెద్దాయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.నరేంద్ర మోడీపై మమత చేస్తున్న భారీ ప్రకటనలు మరో వైపు ఆ పార్టీ నేతలకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి. బెంగాల్ పీఠానికి మరో రెండేళ్ళలో మమత నుంచి విముక్తి వస్తుందని బీజేపీ నాయకులు గట్టిగా చెబుతున్నారు. నరేంద్ర మోడీని అనడానికి మమత ఎవరు అంటూ గర్జిస్తున్నారు. ఇవన్నీ ఎలాగున్నా మమత మాత్రం తన స్టాండ్ మార్చుకోకపోవడం దేశంలోని అన్ని రాజకీయ పార్టీలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎందుకొచ్చిన తంటా అని జబ్బలు చరచిన వీరులు సైతం నరేంద్ర మోడీ మాట కూడా పలకడానికి జంకుతున్న పరిస్థితుల్లో మమత కలకత్తా కాళీలా వీర విహారం చేయడం బీజేపీకి మింగుడుపడడంలేదు. ఏం చూసుకుని దీదీకి ఇంత ధైర్యమని కాషాయధారులే షాక్ తింటున్నారు. అయితే మమత ధీమా మరేమీ కాదు, నరేంద్ర మోడీ చరిష్మా ఎల్లకాలం ఉండదు, ఓడలు బళ్ళు అయిన రోజున నరేంద్ర మోడీ, బీజేపీ రెండూ కూడా తిరోగమిస్తాయని ఆమె అంచనా వేస్తున్నారు. అదే జరిగితే దేశానికి మమత అతి పెద్ద నాయకురాలు అవుతారనడంలో సందేహమే లేదు.