నెల్లూరు, సెప్టెంబర్ 6, (way2newstv.com)
నెల్లూరు జిల్లాలో క్లీన్ స్వీప్ చేసిన వైసీపీ.. ఆ ఆనందం ఆస్వాదించలేక పోతోంది. నాయకులు లెక్కకు మిక్కిలి ఉన్నప్పటికీ.. ఎవరిని కదిపినా.. కూడా అసంతృప్తి కనిపిస్తోంది. ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం ఇక్కడ విజయం సాధించింది. జిల్లా వ్యాప్తంగా కూడా రెడ్డి సామాజిక వర్గం హవా కూడా ఎక్కువగానే ఉంది. అయితే, తాజా ఎన్నికల్లో టీడీపీని చిత్తు చేసిన వీరంతా కూడా తమకు పదవులు వస్తాయని ఆశించారు. కానీ, ఆ పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. కేవలం మేకపాటి గౌతం రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లకు మాత్రమే జగన్ మంత్రి పదవులు ఇచ్చారు. దీంతో మిగిలిన వారిలో చాలా మంది అసంతృప్తితో రగిలిపోతున్నారు.
నల్లపురెడ్డికి నామినేటెడ్ పదవైనా దక్కేనా
నెల్లూరు రూరల్ నుంచి రెండుసార్లు వరుసగా గెలిచిన కోటంరెడ్డి శ్రీథర్‌రెడ్డి, సర్వేపల్లిలో రెండుసార్లు గెలిచిన కాకాణి గోవర్థన్ రెడ్డి, వెంకటగిరిలో సీనియర్ ఆనం రామనారాయణరెడ్డి, ఉదయగిరిలో మరో సీనియర్ మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ఇలా చాలా మంది సీనియర్ నేతలు ఉన్నారు. ఇక జగన్ కోసం జిల్లాలో ముందుగా త్యాగం చేసిన ఎమ్మెల్యే ఇప్పుడు వీళ్లందరిని మించిన తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. ఆయన ఎవరో కాదు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి. వైఎస్ హయాంలో ఆయన వైఎస్ కుటుంబానికి అండగా నిలిచారు. టీడీపీతో ప్రారంభమైన నల్లపురెడ్డి రాజకీయం ఆ తర్వాత వైఎస్ నుంచి వైసీపీకి చేరింది.నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి 2004లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2009 ఎన్నికల్లో వైఎస్ ప్రభంజనంలోనూ గెలిచారు. ఎన్నికల తర్వాత బాబును తీవ్రంగా విబేధించి వైఎస్‌కు దగ్గరై కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇక, 2012 నాటికి వైఎస్ మరణం.. తర్వాత జగన్ పార్టీ పెట్టడంతో.. జిల్లా నుంచి మొట్టమొదట జగన్‌కు జై కొట్టిన నాయకుడిగా నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి రికార్డు సృష్టించారు. ఈ క్రమంలోనే 2012లో వచ్చిన ఉప ఎన్నికల్లోవిజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయన తన సొంత బావ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపైనే ఘనవిజయం సాధించారు. 2014 ఎన్నికల్లో జిల్లా అంతటా వైసీపీ గాలి వీచినా కోవూరులో మాత్రం నల్లపురెడ్డి 2300 ఓట్ల స్వల్ప తేడాతో ఓడిపోయి జిల్లా రాజకీయాల్లో కాస్త వెనకపడ్డారు.ఇక, తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి విజయం సాధించారు. ఈ నేపథ్యంలోనే తనకు జగన్ ప్రాధాన్యం ఇస్తారని ఆయన అంచనాలు వేసుకున్నారు. పార్టీలో యాక్టివ్‌గా ఉండడమే కాకుండా.. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా గతంలో పనిచేసి ఉండడం తనకు కలిసి వస్తుందని అనుకున్నారు. అన్నింటికీ మించి మేకపాటి కన్నాముందుగానే జగన్‌కు మద్దతు ఇచ్చిన ఉదంతం ఆయన అనుచరులు మరిచిపోలేక పోతున్నారు. ఈ క్రమంలోనే మంత్రి పదవి వస్తుందని అనుకున్నారు. కానీ, జగన్ అనూహ్యంగా మేకపాటి గౌతంరెడ్డికి మంత్రి పదవిని కట్టబెట్టారు. దీంతో నల్లపురెడ్డి స్తబ్దుగా ఉన్నారు. పోనీ.. రోజా, చెవిరెడ్డి భాస్కరరెడ్డి మాదిరిగా తనకు కూడా నామినేటెడ్‌పదవులు దక్కుతాయేమోనని ఆయన భావిస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ఆయన పార్టీ అధినేతపై అసంతృప్తితోనే ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.