బీఎస్పీకి చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

బీఎస్పీకి చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19, (way2newstv.com)
రాజకీయాల్లో డక్కామొక్కీలు తిన్న నేత మాయావతి. అటువంటి మాయావతికే కాంగ్రెస్ పార్టీ ఝలక్ ఇచ్చింది. మోదీ, అమిత్ షాలకు భయపడే కాంగ్రెస్ పార్టీ ముందస్తు చర్యలు తీసుకుంది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ లు బీఎస్పీకి చెందిన ఆరుగురు శాసనసభ్యులు తమవైపునకు వచ్చేలా చక్రం తిప్పారు. రాజస్థాన్ లో గత అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన ఆరుగురి శాసనసభ్యులను పార్టీలోకి చేర్చుకోవడంతో ఇక అక్కడ బీఎస్పీ లేకుండా పోయింది. కాంగ్రెస్ లో బీఎస్పీ రాజస్థాన్ లో విలీనమయిపోయినట్లే.గోవా, కర్ణాటక తర్వాత మోదీ,అమిత్ షాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్ లపై దృష్టి పెట్టారన్న ప్రచారం ఉంది. 
 బీఎస్పీకి చుక్కలు చూపిస్తున్న కాంగ్రెస్

ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ కు అతి తక్కువ దూరంలో ఉండటంతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్నది వారిద్దరి వ్యూహంగా కన్పిస్తుంది. ఇప్పటికే రాజస్థాన్ లో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపిందన్న అనుమానాలు రావడంతో కాంగ్రెస్ నేతలు అప్రమత్తమయ్యారు.మోదీ, షాల వ్యూహాలకు ప్రతి వ్యూహాలను రచించారు. రాజస్థాన్ లో పార్టీని కాపాడుకోవడానికి బీఎస్పీ శాసనసభ్యులకు కాంగ్రెస్ వల వేసింది. అనుకున్నట్లే కాంగ్రెస్ సక్సెస్ అయింది.రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. మ్యాజిక్ ఫిగర్ 101. అయితే కాంగ్రెస్, బీఎస్పీలు కలసి గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశాయి. రెండు పార్టీలకూ కలిపి వందసీట్లు మాత్రమే వచ్చాయి. ఇందులో ఆరుగురు బీఎస్పీ శాసనసభ్యులు. మరో 12 మంది స్వతంత్ర అభ్యర్థులు గెలవడంతో వారి మద్దతు కూడా కాంగ్రెస్ పార్టీ కూడ గట్టగలిగింది. పన్నెండు మంది కాంగ్రెస్ లో చేరడటంతో ఆ పార్టీకి ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే బీజేపీ స్వతంత్ర అభ్యర్థులను తమకు దూరం చేస్తుందేమోనన్న ఆందోళనకూడా కాంగ్రెస్ లో ఉంది.అందుకే బీఎస్పీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకున్నారు. దీంతో రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం మరింత బలపడింది. కర్ణాటక, గోవా తరహా పరిణామాలు రాజస్థాన్ లో జరగకుండా కాంగ్రెస్ ముందస్తు చర్యలకు దిగినట్లు కన్పిస్తుంది. అయితే ఈ పరిణామాలతో బీఎస్పీ అధినేత్రి మాయావతి ఫైర్ అవుతున్నారు. కాంగ్రెస్ తనను నమ్మిన వారినే నట్టేట ముంచుతుందని మాయావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక మోదీ, అమిత్ షాల భయం తమకు ఉండదని కాంగ్రస్ నేతలు ధీమాగా ఉన్నారు.