సంక్షేమానికి అద్దెల తిప్పలు (నెల్లూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సంక్షేమానికి అద్దెల తిప్పలు (నెల్లూరు)

నెల్లూరు, సెప్టెంబర్ 13 (way2newstv.com): 
జిల్లాలోని సంక్షేమ వసతిగృహాల్లో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. నెలలు గడుస్తున్నా సమస్య పరిష్కారం కాకపోవడం, నిత్యం నరక యాతన పడాల్సివస్తుండటం.. వెరసి ఇబ్బందికరంగా తయారైంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రభుత్వ వసతి గృహాల పరంగా  ఈ స్థితి నెలకొంది. రాష్ట్రప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో అట్టడుగు వర్గాల పిల్లలకు సైతం ఉచిత నిర్బంధ విద్య అందాలని భావించింది. అలా విద్యాలయాల్లో ప్రవేశాలపై రాయితీలు ప్రకటించడంతో పాటు.. వారికి ఉచిత వసతి కల్పించే ఉద్దేశంతో సంక్షేమ వసతిగృహాలను ఏర్పాటు చేసింది. ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి వేర్వేరుగా వసతిగృహాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లా పరిధిలో 206 గృహాల్లో ప్రి మెట్రిక్యులేషన్‌, పోస్ట్‌ మెట్రిక్యులేషన్‌ విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు.
సంక్షేమానికి అద్దెల తిప్పలు (నెల్లూరు)

అయితే ఇక్కడే అనేక సమస్యలు దర్శనమిస్తుండటం గమనార్హం. అనేకచోట్ల సదరు గృహాలకు సొంత భవనాలు లేకపోవడంతో అద్దె నిర్మాణాల్లోనే ఏళ్ల తరబడి కాలం వెళ్లదీస్తున్నారు. వచ్చే అరకొరనిధులు ఆ అద్దెలకు చాలక ఇబ్బంది పడుతున్నారు. ఫలితంగా అసౌకర్యాలతో కూడిన ఇళ్లే వసతి గృహాలుగా కొనసాగుతున్నాయన్నది బహిరంగ రహస్యం. మరుగుదొడ్లు కరవై, వెంటిలేషన్‌ లేనిరీతుల్లో దర్శనమిస్తున్నాయి. అయినా విద్యార్థులు వాటిలోనే కాలం వెళ్లదీస్తున్నారు. కొన్ని నెలలుగా ఆ భవనాలూ దక్కకుండాపోతున్నాయని క్షేత్రస్థాయిలో చూస్తే అర్థమవుతోంది. ప్రభుత్వం నుంచిమంజూరు కావాల్సిన అద్దె మొత్తం ఎంతకూ రాకపోవడంతో అష్టకష్టాలు తప్పడం లేదు.జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతిగృహాలకు అద్దెల బకాయిల భారం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధానంగా బీసీ సంక్షేమశాఖ పరంగా ఈ సమస్య తీవ్రంగా దర్శనమిస్తోంది. బీసీ ప్రిమెట్రిక్‌ వసతిగృహాలు జిల్లాలో 79 ఉన్నాయి. ఇవి 21 చోట్ల అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. పోస్ట్‌ మెట్రిక్‌ వసతిగృహాలు 20 ఉండగా.. 16 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. రెండేళ్లకుగాను ఇక్కడరూ.55,94,823 అద్దె బకాయి ఉన్నట్లు అధికారవర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఎస్సీ వసతిగృహాల పరంగా చూస్తే.. జిల్లాలో ప్రిమెట్రిక్‌ ఎస్సీ వసతి గృహాలు 73 ఉన్నాయి. ఇందులోఅన్నీ సొంత భవనాలు కలిగి ఉండటం గమనార్హం. ఎస్సీ పోస్ట్‌మెట్రిక్‌ వసతిగృహాలు 14 ఉండగా.. ఆరు చోట్ల అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. మిగిలిన 8 చోట్ల సొంత భవనాలు కలిగి ఉండటంగమనార్హం. ఇక్కడ రెండేళ్లకు సంబంధించి అద్దెల సొమ్ము రాకపోగా.. రూ.20 లక్షలు బకాయి ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్టీ ప్రిమెట్రిక్‌ పరంగా 15 వసతిగృహాలు ఉండగా.. అన్నీ సొంత భవనాల్లోనే నిర్వహిస్తున్నారు. పోస్ట్‌మెట్రిక్‌లో 5 వసతిగృహాలు ఉండగా.. అందులో 4 అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఈ ఏడాది మార్చి నుంచి ఇక్కడా బకాయి ఉన్నట్లు చెబుతున్నారు. జిల్లాపరంగామూడుశాఖలకు రూ.70 లక్షల పైనే బకాయిలు ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం సంక్షేమశాఖల్లో వసతిగృహాలకు అద్దెల భారం శాపంగా పరిణమిస్తోంది. ప్రభుత్వం నుంచి ఎంతకూ నిధులు రాకపోవడంతో అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అష్టకష్టాలు పడుతున్నారు.దీంతో నిర్వహణకు అవస్థలు తప్పడం లేదు. నెలల తరబడి బకాయిలు పేరుకుపోవడంతో కొన్నిచోట్ల భవన యజమానుల నుంచి ఒత్తిళ్లు ఎదురవుతున్నాయి. దీంతో చేసేది లేక తరచూ భవనాలనుమార్చాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మరికొన్ని చోట్ల అక్కడే కొనసాగుతున్నా కాసుల కష్టం వెంటాడుతోంది. వాస్తవానికి, వచ్చే అరకొర సొమ్ములు ప్రస్తుతం పెరిగిన అద్దెలకు ఎంతమాత్రం సరిపోవడం లేదన్నది సుస్పష్టం. అయినా ఎలాగోలా నెట్టుకొస్తున్న సిబ్బందిని బకాయిల భారం మరింత అగాధంలోకి నెట్టేస్తోంది. వసతులూ అంతంతమాత్రంగా ఉంటుండటం ఇక్కడ మరో ప్రధాన సమస్యగాచెప్పొచ్ఛు దీనికితోడు వసతిగృహాలకు నిర్వహణ నిధులూ రాకపోవడంతో సమస్య జటిలమవుతోంది. కరెంటు ఛార్జీలకూ కష్టాలు తలెత్తడంతో సిబ్బంది మధనపడుతున్నారు. అప్పులు చేసి కట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. చివరకు విద్యార్థులకు కాస్మొటిక్‌ ఛార్జీలూ రాకపోవడం పరిస్థితికి పరాకాష్ఠగా మారింది. ఇలా అనేక స్థాయుల్లో కాసుల కష్టాలు ఎదుర్కొనాల్సి రావడం సంక్షేమంలో సంక్షోభాన్నిస్పష్టం చేస్తోంది. జిల్లాలో పరిస్థితిపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు ఉన్నతస్థాయిలో పలుమార్లు అభ్యర్థించినట్లు తెలుస్తోంది. నెలల వారీగా బకాయిల సొమ్ము మంజూరు చేయాలని కోరుతూ ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. అయినా ఉన్నతస్థాయిలో స్పందన కరవవడంతో సమస్య ఏర్పడింది. దీంతో కిందిస్థాయికి సర్ది చెప్పలేక, పై స్థాయిలో ప్రశ్నించలేక మధనపడుతున్నట్లు చెబుతున్నారు. బడ్జెట్‌ కేటాయింపులు జరగాల్సి ఉన్నా ఆ దిశగా అడుగులు లేకపోవడంతో ప్రస్తుతం సమస్య ఏర్పడింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి బకాయిల మొత్తం విడుదల చేయాల్సిన అవసరం కనిపిస్తోంది.