అఖిలకు సెగ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అఖిలకు సెగ

కర్నూలు, సెప్టెంబర్ 24, (way2newstv.com)
వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్యాక్షన్ నియోజకవర్గాల్లో తమకు ఇబ్బంది తప్పడం లేదని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గురజాల వంటి నియోజకవర్గాలు ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు. పల్నాడులోనే ఇలా ఉంటే ఇక రాయలసీమలో ఎలా ఉంటుందన్న అనుమానాలు అందరికీ కలుగుతాయి. ప్రధానంగా రాయలసీమలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనూ రాజకీయ దాడులు జరుగుతున్నాయన్నది ఇప్పుడు మాజీ మంత్రి అఖిలప్రియ ఆరోపణ. గత కొంతకాలంగా తమ అనుచరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అంటున్నారు.అఖిలప్రియ ఇటీవల ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో ఆళ్లగడ్డలో గంగుల కుటుంబం విజయం సాధించింది. గంగుల బిజేంద్ర నాధ్ రెడ్డి ఆళ్లగడ్డ ఎమ్మెల్యేగా ఉన్నారు. 
అఖిలకు సెగ

ఎన్నికల సమయంలోనూ ఆళ్లగడ్డలో అనేక దాడులు జరిగాయి. పోలింగ్ సమయంలోనూ రెండు వర్గాలూ ఒకరిపై ఒకరు దాడికి దిగాయి. పోలింగ్ కు ముందు , తర్వాత జరిగిన ఘర్షణలను దృష్టిలో పెట్టుకుని ఆళ్లగడ్డను సమస్యాత్మక నియోజకవర్గంగానే గుర్తించాల్సి ఉంటుంది.అయితే ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర నాధ్ రెడ్డి మాత్రం ఎవరిపై ఎలాంటి కేసులు పెట్టి వేధించడం లేదని చెబుతున్నారు. గతంలో ఉన్న పాత కేసుల్లో కొందరిని పోలీసులు విచారించి ఉండవచ్చని ఆయన చెబుతున్నారు. ఆళ్లగడ్డలో ప్రస్తుతం ప్రశాంత పరిస్థితులు నెలకొన్నాయని అంటున్నారు. కానీ ఇప్పటికే కొందరు టీడీపీ నేతలు బీజేపీలోకి జంప్ చేస్తున్నారు. భూమా అఖిలప్రియ సోదరుడు భూమా కిషోర్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈయన కూడా తన అనుచరులపై కేసులు నమోదు కాకుండా ఉండేందుకే సేఫ్ ప్లేస్ గా బీజేపీని ఎంచుకున్నారని చెబుతున్నారు.ఇక అఖిలప్రియ కూడా టీడీపీని వీడతారని ప్రచారం జరుగుతోంది. ఆళ్లగడ్డలో చోటు చేసుకుంటున్న పరిణామాలతో భూమా అనుచరులు కూడా బెంబేలెత్తుతుండటంతో అఖిలప్రియకు ఏం చేయాలో పాలుపోవడం లేదంటున్నారు. అందుకే అఖిలప్రియ ఇటీవల కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని కలసి తమ నియోజకవర్గంలో పరిస్థితులను వివరించారంటున్నారు. కిషన్ రెడ్డితో భేటీ అయిన తర్వాత అఖిలప్రియ బీజేపీలో చేరతారని సోషల్ మీడియాలో పెద్దయెత్తున పోస్టింగ్ లు కన్పించాయి. కానీ కేవలం కిషన్ రెడ్డి హోంశాఖ సహాయమంత్రి కాబట్టి ఆళ్లగడ్డలో తనకు, తన అనుచరులకు పోలీసుల పరంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేదుకే అఖిలప్రియ ఆయనను కలిశారంటున్నారు.