జగన్ దూకుడుతో ఇబ్బందులే.. - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

జగన్ దూకుడుతో ఇబ్బందులే..

నెల్లూరు, సెప్టెంబర్ 20, (way2newstv.com)
వైసీపీ నేతలు ఇపుడు ఈ పాట పాడుకోవాలేమో. జగన్ దూకుడు యమ జోరు మీద ఉంది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన దగ్గర నుంచి ఆయన వేగం అలా ఇలా కాదుగా. పదేళ్ళుగా బుర్ర నిండా ఉన్న ఆలోచనలు అన్నీ కూడా ఆచరణలో ఒక్కసారిగా పెట్టేయాలన్న ఆరాటంలో యువ ముఖ్యమంత్రి వెనకా ముందు ఆలోచించకుండానే అనేక నిర్ణయాలు తీసేసుకున్నారు. నిజానికి జగన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమమే సంచలన ప్రకటనల‌కు కేంద్రమైంది. వరసగా డేట్లు ఫిక్స్ చేసి మరీ జగన్ పధకాలు ప్రారంభిస్తామని ఆ రోజు చెబుతూ ఉంటే హాజరైన తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం నోరు వెళ్లబెట్టి చూస్తుండిపోవాల్సివచ్చింది. సీఎంగా ప్రమాణం చేస్తూనే జగన్ ఓ మాట చెప్పారు. అదే రివర్స్ టెండరింగ్. 
జగన్ దూకుడుతో ఇబ్బందులే..

అప్పట్లో ఆ పదం చాలా మందికి అర్ధం కాలేదు, కానీ మూడు నెలల కాలంలో అదే ఊతపదంగా మారడంతో దానిపైనే ఇపుడు అంతా చర్చగా ఉంది. ఆ రివర్స్ టెండరింగ్ తో అద్భుతాలు స్రుష్టిస్తామని జగన్ చెప్పారు. కానీ ఆచరణలో రివర్స్ గేర్ వేస్తోందని తాజాగా హైకోర్టు తీర్పులో వెల్లడైంది.జగన్ వెనకా ముందూ ఆలోచించకుండా పోలవరం టెండర్లను రద్దు చేసిపారేశారు. దీని మీద నవయుగ కాంట్రాక్టర్లు కోర్టును ఆశ్రయించారు. కోర్టులో వారి వాదన నెగ్గింది. రద్దు ఉత్తర్వులను ఒక్క తీర్పుతో హైకోర్టు కొట్టేసింది. ఇది నిజంగా జగన్ సర్కార్ కి ఇబ్బందికరమైన పరిణామమే. వంద రోజుల పాలనకు దగ్గర పడుతున్న వేళ మొదటి మొట్టికాయ ఇలా పడడంతో వైసీపీ ప్రభుత్వ దూకుడుకు అడ్డుకట్ట పడినట్లేనా అన్న మాట కూడా వినిపిస్తోంది. పోలవరం, అమరావతి ఈ రెండూ కూడా ఏపీ ప్రజలకు చివరికి మిగిలిన వరాలు. అందులో పోలవరం ఏపీకి జీవనాడి, ప్రాణాధారం. ఉన్న టెండర్లను రద్దు చేయడం అంటే ప్రాజెక్ట్ పనులను మరింత ఆలస్యం చేయడమేనని అంతా అన్నారు. కేంద్రంలోని జలవనరుల శాఖా మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ అయితే ఈ రద్దు మీద పూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ అయితే ఇది తుగ్లక్ చర్య అంటూ నాడూ నేడూ కూడా అంటోంది. అటు కేంద్రం ఇటు ప్రతిపక్షం అంతా వద్దు అంటున్నా ముందుకు వెళ్ళిన జగన్ కి హైకోర్టు రెడ్ సిగ్నల్ చూపించింది. మరి జగన్ తగ్గుతారా అన్నది చూడాలి.వైసీపీకి మూడు నెలల క్రితం ఎన్నికల్లో 151 సీట్లు రావడంతో నోటి మాట రాని టీడీపీకి అతి తక్కువ సమయంలోనే జగన్ ఇలా దొరికేయడం విపక్ష నేతకు పట్టరాని ఆనందాన్ని ఇస్తోంది. జగన్ పైన ఉన్న మోజుతో జనంలోకి అసలు వెళ్ళలేమనుకున్న వారికి యువ సీఎం తానే దారి చూపిస్తున్నారు. ఇపుడు జగన్ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్నదానికి రాజముద్ర వేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు చంద్రబాబుకు వేయి ఏనుగుల బలంగా మారింది. అందుకే ఆయన తన నోటికి బాగానే పని చెబుతున్నారు. ఏపీకి శని పట్టిందా, లేక పిచ్చి పట్టిందా అంటూ తీవ్రమైన భాషనే వాడేస్తున్నారు. . జగన్ చేస్తున్న పనులు పిచ్చివని, ఆయనే ఏపీకి శని అని బాబు అనడం ద్వారా సమరశంఖాన్ని పూరించేశారు. ఈ కధ ఇక్కడితో ఆగేలా లేదు, అమరావతి రాజధాని విషయంలోనూ, విద్యుతు ఒప్పందాల సమీక్షలోనూ, అన్న క్యాంటీన్ల రద్దు లోనూ ఇలా అనేక అంశాలపై జనంలో వెళ్ళి తేల్చుకోవడానికి బాబుకు కొండంత నిబ్బరాన్ని హైకోర్టు తీర్పు ఇచ్చిందనుకోవాలి. మరో వైపు వైసీపీలోనూ వీటిపైన మధనం జరుగుతోంది అన్నప్రాశన నాడే ఆవకాయ పెట్టినట్లుగా అన్నీ ఒకేసారి అంటే జనం కూడా జీర్ణించుకోలేరన్న వాదన అక్కడ కూడా వినిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి రావాలంటూ కావాలి జగన్…రావాలి జగన్ పాట పాడిన వారంతా ఇపుడు తగ్గాలి జగన్, ఆగాలి జగన్ అంటున్నారంటే జగన్ తీరు తప్పక మార్చుకోవాలేమో.