అమరావతి సెప్టెంబర్ 19 (way2newstv.com)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామ వార్డు, సచివాలయం పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. దాదాపు 1.26 లక్షల ఉద్యోగాల భర్తీకి ఏపీ ప్రభుత్వం ఈ నెల 1 నుంచి 8 వరకూ పరీక్షలను నిర్వహించింది. ఈ సందర్భంగా 19 రకాల ఉద్యోగాల భర్తీకి 14 పరీక్షలు చేపట్టింది. కేటగిరి-1లో జి.అనితమ్మ (అనంతపురం), జి.లోవరాజు (తూ.గో.), వెంకటరామిరెడ్డి (ప్రకాశం), డి.సంపతిరావు (శ్రీకాకుళం)లు టాపర్లుగా నిలిచారు.
గ్రామ సచివాలయ పరీక్షా ఫలితాలు వెల్లడి
కేటగిరి-2లో ఎం.దుర్గారావు (తూ.గో.), ఎ.సాయిదినేష్ (కృష్ణా)లు ముందంజలో వున్నారు. పరీక్షలు పూర్తిచేసిన 10 రోజుల్లోనే ఏపీ ప్రభుత్వం ఫలితాలు విడుదల చేయడం విశేషం. మొత్తం 1, 26, 728 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. 21.5లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. 19.74 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు రెండేళ్ల పాటు నెలకు రూ.15వేల చొప్పున జీతం ఇవ్వనున్నారు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 30, వచ్చే నెల 1న రెండ్రోజుల పాటు శిక్షణ ఇస్తారు. అనంతరం గాంధీజయంతి(అక్టోబర్ 2) రోజున వీరంతా ఉద్యోగాల్లో చేరాల్సి ఉంటుంది.ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రికార్డు సమయంలో ఈ యజ్ఞాన్ని పూర్తిచేశారు, అధికారులందరికీ అభినందనలని అన్నారు. ఏకకాలంలో ఇంతమందికి ఒకేసారి ఉద్యోగాలు ఇవ్వడం రికార్డు. ఎన్నికల హామీలో చెప్పినట్టుగా ఇంత పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఇచ్చాం. ఒకే నోటిషికేషన్ ద్వారా 1,26,728 శాశ్వత ఉద్యోగాలను కల్పించడం చరిత్రలో తొలిసారని అన్నారు. పరీక్షల్లో విజయం సాధించిన వారందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. వీరికి మంచి శిక్షణ ఇస్తాం, వీరంతా ప్రజా సేవలో మమేకం కావాలని అన్నారు. అవినీతికి దూరంగా, నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించిన అధికారులకు అభినందనలు. అంకితభావంతో పరీక్షలు నిర్వహించడంలో మంచి పనితీరు కనపరిచారని ప్రశంసించారు. అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయాలు అందుబాటులోకి వస్తాయి. పరిపాలనలో విప్లవాత్మక మార్పులు సచివాలయాలు ద్వారా వస్తాయి. వర్గాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు ప్రజల ముంగిటకే సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అందుతాయని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.