టాప్ గేర్ లో రియల్ ఎస్టేట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

టాప్ గేర్ లో రియల్ ఎస్టేట్

హైద్రాబాద్, సెప్టెంబర్ 4, (way2newstv.com)
స్థిరాస్తి రంగంలో పాత రికార్డులు తుడిచిపెట్టుకుపోతున్నాయి. నాలుగునెలల్లో రియల్‌రంగం ద్వారా భారీ రాబడి ప్రభుత్వానికి వస్తోంది. పెట్టుబడికి మించిన భరోసా లేదని ప్రజల్లో బలంగా నమ్మకం కలగడంతో రియల్ వైపు ప్రజలు పరుగెడుతున్నారు. నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా పెరుగుతున్న జనాభా, శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తీరుతో వ్యవసాయ, వ్యవసాయేతర భూముల క్రయ, విక్రయాలు జోరందుకున్నాయి. రాష్ట్ర బడ్జెట్ రూ.1.82 లక్షల కోట్లు కాగా, రిజిస్ట్రేషన్ల రూపంలో రాష్ట్రంలో జరుగుతున్న టర్నోవర్, చేతులు మారుతున్న నగదు అంతకు రెట్టింపుగా ఉంటోంది. ఈ నాలుగు నెలల్లో రూ.2,701 కోట్ల స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ శాఖకు ఫీజుల రూపంలో ఖజానాకు చేరింది. 
టాప్ గేర్ లో రియల్ ఎస్టేట్

ఈ ఫీజులు మొత్తం టర్నోవర్‌లో 6 శాతం అంటే మొత్తం విలువ 100 శాతంగా చూస్తే ప్రభుత్వం మార్కెట్ నిర్ధేశిత విలువ ప్రకారం రూ.2.70 లక్షల కోట్లుగా నమోదయ్యింది. అయితే మార్కెట్ విలువ కాకుండా వాస్తవ ధర ప్రకారం ఇది మరో రూ. 2లక్షల కోట్లుగా ఉంటుందని రియల్ వ్యాపారులు పేర్కొంటున్నారు. గతంలో ఉన్న స్థిరాస్తులు, వ్యవసాయ, వ్యవసాయేతర భూముల్లో క్రయ, విక్రయాల్లో రాష్ట్రంలో గత రికార్డులన్నీ తుడుచుకు పెట్టుకుపోయాయి. 2018,19 ఆర్థిక సంవత్సరానికి గాను రిజిస్ట్రేషన్ల మొత్తం విలువ రూ.85 వేల కోట్లకు మించగా, మార్కెట్ విలువ కంటే ఎక్కువ మొత్తానికి రిజిస్ట్రేషన్ వాటా ఇందులో 40 శాతంగా నమోదయ్యింది. గతే ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లు 3,62,760 కాగా వ్యవసాయేతర భూములు 6,12,919 ఎకరాల చేతులు మారాయి. ఈ ఆస్తుల విలువ వ్యవసాయ రూ.66,184 కోట్లుగా ఉంది. రాష్ట్ర వార్షిక బడ్జెట్ అటుఇటుగా రూ.1.8 లక్షల కోట్లుగా ఉంటుంది. అయితే ఈ ఐదేళ్లలో దీనికి 10 రెట్లు అదనంగా భూములు, స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు సాగాయి. ఈ మేరకు తెలంగాణ ఆవిర్భావం నుంచి రిజిస్ట్రేషన్ రంగంలో రూ.12 లక్షల కోట్లకు పైగా నగదు లావాదేవీలు జరిగాయి. ఇదంతా కేవలం బుక్ వ్యాల్యూనేనని తెలుస్తోంది. అనధికారికంగా అయితే ఇది మరో 5 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా. ఈ ఐదేళ్లలో రూ.60 లక్షల కోట్లు ఈ రంగంలో పెట్టుబడులు జరిగినట్టుగా అధికారుల గణాంకాలు పేర్కొంటున్నాయి.