పరేషన్ బియ్యంతో అడ్డంగా వ్యాపారులు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పరేషన్ బియ్యంతో అడ్డంగా వ్యాపారులు

తిరుపతి, సెప్టెంబర 4, (way2newstv.com)
రూపాయి కోసం వ్యాపారులు అడ్డదారులు తొక్కుతున్నారు. రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి చిత్తూరు జిల్లా మీదుగా కర్ణాటకలోని బంగారుపేటకు తరలించి, అక్కడ పాలిష్‌ చేసి తిరిగి మన రాష్ట్రానికి తెస్తున్నారు. ఇక్కడ సన్నబియ్యం పేరుతోవిక్రయిస్తున్నారు.ఇందులో మూడు స్థాయిల్లో వ్యాపారులు భాగస్వాములవుతున్నారు. తమిళనాడులో బియ్యం సేకరణ వరకు అక్కడి వ్యాపారులు, ఆ రాష్ట్ర సరిహద్దు నుంచి మన రాష్ట్రం దాటించి కర్ణాటకకు తరలించే వరకు ఇక్కడి వ్యాపారులు, పాలిష్‌ చేసిన తర్వాత మరో వర్గం వ్యాపారులు ఇందులో భాగస్వాములవుతున్నారు. ఈ మూడు విభాగాల్లోనూ రాజకీయ నేతలు, పోలీసుల పలుకుబడి పని చేస్తోంది. చివరగా ఇదే బియ్యం మూడు రాష్ట్రాల్లోని ప్రజలకు అందుతోంది. సరిహద్దులోని తమిళనాడు పట్టణం గుడియాత్తంలో, ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు సమీపంలో నిల్వ చేస్తున్నారు. ఈ వ్యవహారంలో మూడు స్థాయిలో అక్రమ వ్యాపారులు లాభ పడుతున్నారు. ప్రతి ఒక్కరికి రూ.లక్షల్లోనే ఆదాయం లభిస్తోంది.
 పరేషన్ బియ్యంతో అడ్డంగా వ్యాపారులు

మన వ్యాపారులు ఒక లారీకి 15 టన్నుల బియ్యాన్ని నింపుతారు. చిత్తూరు నుంచి పలమనేరు, కొలమాసనపల్లె, అరట్ల మీదుగా బంగారుపేటకు ఒక మార్గంలో చేరుస్తారు. చిత్తూరు నుంచి పెద్దపంజాణి, వేపనపల్లె, రాజుపల్లె మీదుగా మరో మార్గంలో గుడియాత్తం నుంచి పేర్నంబట్టు, నాయకనేరి, రామకుప్పం, రాళ్లబూదుగూరు మీదుగా ఇంకొక మార్గంలో కర్ణాటకకు బియ్యం చేరుతుంది. ఈ వ్యవహారంలో బైరెడ్డిపల్లె, వి.కోటలకు చెందిన రాజకీయ పలుకుబడి కలిగిన నేతలు ఉండటం గమనార్హం. స్పెషల్‌ బ్రాంచి పోలీసులు ఇటీవల ఒకటి, రెండు వాహనాలను వి.కోట, పలమనేరు ప్రాంతాల్లో పట్టుకుని కేసులు నమోదు చేశారు. పెద్దయెత్తున లారీల్లో వెళుతున్న బియ్యాన్ని మాత్రం పట్టుకోవడం లేదు. ఈ వ్యాపారంలో ఒక లారీకి రూ.1.6 లక్షల ఆదాయం లభిస్తోంది. అందులోంచి మామూళ్లు, ఖర్చులు పోనూ లారీకి కనీసం రూ.75 వేల వరకు ఆదాయం మిగులుతుంది. ఇలా ప్రతి మార్గంలో రోజుకు రెండేసి లారీల బియ్యం కర్ణాటకకు తరలిపోతున్నట్లు సమాచారం. కొత్తగా బాధ్యతలు తీసుకుంటున్న పోలీసు అధికారులకు దీనిని నియంత్రించడం ఒక సవాలుగా మారింది.తమిళనాడు ప్రభుత్వం పేదలకు ఉచితంగా సరఫరా చేస్తున్న బియ్యాన్ని అక్కడి వ్యాపారులు కిలో రూ.5 చొప్పున సేకరిస్తున్నారు. ఆ బియ్యాన్ని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారులకు కిలో రూ.8 చొప్పున విక్రయిస్తున్నారు. ఇక్కడి వారు రాజకీయ పలుకుబడితో రాష్ట్ర సరిహద్దు దాటించి కర్ణాటకకు చేరుస్తున్నారు. అక్కడ కిలో రూ.16 చొప్పున విక్రయిస్తారు. బంగారుపేటలో పెద్ద మిల్లులో బియ్యాన్ని పాలిష్‌ చేసి తిరిగి ఆంధ్ర, తమిళనాడు రాష్ట్రాలకే పంపుతారు. అప్పుడు ఆ బియ్యం ధర కిలో రూ.22కు చేరుతుంది. పేదల కోసమంటూ తమిళ సర్కారు కిలో రూ.5 అమ్మే రాయితీ బియ్యం.. బహిరంగ మార్కెట్లోకి వచ్చేసరికి రూ.22కు పెరుగుతోంది. రూ.17 కమీషన్‌ రూపంలో పలువురి జేబులు నింపుతోంది.