ప్రాణాలను బలిగొన్న సిండికేట్లు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ప్రాణాలను బలిగొన్న సిండికేట్లు

రాజమండ్రి, సెప్టెంబర్ 17, (way2newstv.com)
అధికారుల నిర్లక్ష్యం, బోటు యజమానుల కాసుల కక్కుర్తి, డ్రైవర్ల అనుభవరాహిత్యం వెరసి సుమారు 50 మందికి పైగా పర్యాటకులను నిలువునా గోదావరిలో ముంచేశాయి. అనుభవం లేని డ్రైవర్లతోనే బోటును నడిపించడం ప్రమాదానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. కొద్ది రోజుల క్రితమే గోదావరికి ప్రమాదకర స్థాయిలో వరద సంభవించింది. ప్రస్తుతం కాస్త తగ్గినప్పటికీ, ఇంకా వరద ప్రవాహం ఉద్ధృతంగానేవుంది. వరదల నేపథ్యంలో గోదావరిలో అన్నిరకాల లాంచీలు, బోట్ల రాకపోకలకపై అధికారులు నిషేధం విధించారు. అయినా కాసుల కక్కుర్తితో వరద ప్రవాహంలోనే పర్యాటక బోట్ల రాకపోకలు జరిగిపోతున్నాయి.ఫిట్‌నెస్‌ను బట్టి, పర్యాటక శాఖ సిఫార్సులను బట్టి పోర్టుల శాఖ బోట్లకు, లాంచీలకు అనుమతి మంజూరుచేస్తుంది.ప్రమాదానికి గురైన రాయల్ వశిష్టా-1 లాంచీకి వాస్తవానికి ఏడాది కాలానికి లైసెన్స్ ఉండాల్సివుంది. కానీ లైసెన్స్ అనుమతి లేదని తెలిసింది. 
ప్రాణాలను బలిగొన్న సిండికేట్లు

ఈ విషయాన్ని పర్యవేక్షించే యంత్రాంగం కూడా లేదు. రాయల్ వశిష్ఠ-1 బోటుకు కాకినాడలోని పోర్టుల శాఖ బోట్ కన్జర్వేజర్ అనుమతి ఇవ్వాల్సివుంది. కేవీఆర్, అమరావతి ట్రావెల్స్ సంస్థలకు రాయల్ వసిష్ఠా-1, రాయల్ వసిష్ఠా-2, శ్రీవశిష్ఠా అనే మూడు పర్యాటక బోట్లున్నాయి. ఇందులో రాయల్ వసిష్ఠా-1 ప్రమాదానికి గురైంది. ఇక్కడ సిండికేట్ విధానంలో లాంచీలను, బోట్లను నడుపుతున్నారు. మూడు యూనియన్లుగా ఏర్పడి పర్యాటకులను లాంచీలకు ఆకర్షించేందుకు పోటీ పడుతున్నట్టుంది. ప్రమాదానికి గురైన లాంచీలో రాజమహేంద్రవరంలోని అమరావతి లాంచీ ట్రావెల్స్ నుంచి 34 మంది, కేవీ ఆర్ ట్రావెల్స్ నుంచి 16 మందిని, ఇలా ఒక్కొక్క ట్రావెల్స్ నుంచీ ఇద్దరూ, నలుగురూ చొప్పున సమీకరించుకుని సీరియల్ పద్ధతిని రాయల్ వసిష్ఠా-1 బోటులో ఎక్కించి తీసుకెళ్ళినట్టు తెలుస్తోంది. ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ఠ బోటును కోడిగుడ్ల వెంకటరమణ అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు గుర్తించారు. శనివారం కూడా ఒక పర్యాటక బోటు విహారయాత్రకు వెళ్లివచ్చింది. ఈ విషయం ఆదివారం రాయల్ వసిష్ఠ బోటు ప్రమాదం అనంతరం వెలుగుచూసింది. నిషేధం సమయంలో బోట్ల రాకపోకలు సాగిపోవడానికి అధికారుల నిర్లక్ష్యం ప్రధాన కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా ఆదివారం ప్రమాదానికి గురైన రాయల్ వసిష్ఠ బోటుకు అనుమతులు లేవని అధికారులు చెబుతున్నారు. అలాగే బోటులో ఉన్న ఇద్దరు డ్రైవర్లు నూకరాజు, తామరాజుకు గోదావరి నదిలో నడిపిన అనుభవం తక్కువ అని చెబుతున్నారు. వారి అనుభవరాహిత్యం కారణంగానే బోటు ప్రమాదానికి గురయ్యిందని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతం తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరుమందం వద్ద భారీ రాళ్ల కారణంగా గోదావరిలో మామూరు సమయంలోనే సుడిగుండాలు ఉద్ధృతంగా ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. ఇక వరద సమయంలో ఆ ఉద్ధృతి మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల బోట్లను పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలంలోని తూటిగుంట వైపునుండి నడుపుతారని, ఘటనలో అనుభవంలేని డ్రైవర్లు ఈ పద్ధతిని పాటించకపోవడంతో బోటు నేరుగా సుడిగుండాల్లో చిక్కుకుందని సమాచారం. సుడిగుండాల తీవ్రతకు బోటు స్టీరింగ్ అదుపుతప్పి, సాంకేతిక లోపం ఏర్పడి, ఒకపక్కకు ఒరిగిపోయి, ప్రమాదానికి గురయ్యిందని చెబుతున్నారు. ఈ ప్రమాదంలో డ్రైవర్లు ఇద్దరూ కూడా గల్లంతయ్యారు. ఇదే ప్రాంతంలో గతంలో కూడా రెండు ప్రమాదాలు జరిగినట్టు చెబుతున్నారు. 1964లో జరిగిన ప్రమాదంలో 60 మంది మృతిచెందారని, మరో ప్రమాదంలో ఎనిమిది మంది మృతిచెందారని చెబుతున్నారు.పర్యాటక బోటు ప్రమాదం నేపథ్యంలో అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పాపికొండలు పర్యాటకానికి బోటుకు ఎవరు అనుతిచ్చారనే విషయమై ఆరా తీయడం ప్రారంభించారు. గతంలో విజయవాడ వద్ద కృష్ణా నదిలో పడవ బోల్తా పడిన సంఘటన నేపధ్యంలో అప్పటి వరకు ఇరిగేషన్ శాఖ అనుమతిలో వుండే అనుమతి అధికారాలను పోర్టుల శాఖకు బదలాయించారు.