తిరుపతి, సెప్టెంబర్ 30, (way2newstv.com)
ఉపాధి కోసం కన్న ఊరిని వదలి వెళుతున్న యువత విదేశాల్లో నరకయాతన అనుభవిస్తోంది. అత్యధిక జీతం, ఉచిత వసతి, ఇతర ఆదాయం పేరిట ఏజెంట్ల వలలో చిక్కి అప్పుల ఊబిలో చిక్కుకుపోతోంది. స్థానికంగా రోజువారీ కూలి పనులు చేసుకుని సంతోషంగా జీవించే అవకాశం ఉన్నా.. ఆశలవలలో చిక్కుకుని అల్లాడుతోంది. రెండు మూడేళ్లు పనిచేస్తే రూ.లక్షలు సంపాదించవచ్చనే ఏజెంట్ల మాటలు నమ్మి అప్పు చేసి అరబ్ దేశాలకు వెళ్లి చిత్ర హింసలకు గురవుతోంది. నిరుద్యోగులకు ఆశచూపి మోసం చేసే నకిలీ ఏజెంట్లపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. మహిళలనైతే ఉచితంగానే తీసుకెళుతు న్నారు. వారికి ఏపనిలో తర్ఫీదులేకున్నా పంపిస్తున్నారు.
తీవ్ర ఇబ్బందులు పడుతున్న వలస ఉద్యోగులు
బ్యూటీపార్లర్‌లో ఉద్యోగమని, జిమ్‌లో ఉద్యోగమని కువైట్‌కు తీసుకెళ్లి అక్కడ ఇంటి పనులకు వారిని వేలంలో విక్రయిస్తున్నారు. ఇంటిపనుల్లో వారికి యజమానులు నరకయాతన చూపుతున్నారు. కొందరు ధైర్యం చేసి బయటపడి మరో ప్రాంతంలో ఉద్యోగం వెతుక్కొని పోతుంటే, కొందరు తమ విధి అంటూ కష్టాలు అనుభవిస్తున్నారు. ఇటీవల కొందరు కువైట్ నుంచి ఎలాగో వచ్చేశారు.జిల్లా యువత ఎదుర్కొంటున్న ఇబ్బందులు తరచూ వెలుగులోకి వస్తున్నా అవగాహన కల్పించేందుకు జిల్లా యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడం లేదు. నగరి, పుత్తూరు ఏజెంట్ల వలలో చిక్కి కువైట్, దుబాయ్‌కి వెళ్లి నానా తిప్పలుపడి, జైలు శిక్షలు అనుభవించి ఉత్త చేతులతో ఇటీవల స్వదేశానికి చేరుకుని పలువురు బోరున విలపిస్తున్నారు. తాజాగా కలకడ మండలం తూర్పువడ్డిపల్లెకు చెందిన నాగేంద్ర కువైట్‌లో గుండెపోటుతో మృతిచెందాడు. ఆయన మృతదేహం బుధవారం రాత్రి స్వగ్రామానికి చేరుకుంది. ఇతను అక్కడ డ్రైవర్‌గా పనిచేసేవాడు.ఉద్యోగాల కోసం ఆరాటపడేవారు.. కుటుంబ పరిస్థితి దృష్ట్యా ఆదాయ మార్గాలు అన్వేషించే వారు.. పేదరికాన్ని జయించి అభివృద్ధి పథంలో నడవాలని ఆరాటపడేవారు కువైట్, దుబాయ్‌లో ఉద్యోగాల పేరిట నగరి, పుత్తూరులోని ఏజెంట్లు విసిరే వలలో చిక్కుకుంటున్నారు. కొండనాలుకకు మందేస్తే ఉన్ననాలిక ఊడిం దన్న చందాన కువైట్ ఉద్యోగాలకు వెళ్లేవారి పరిస్థితి మారింది. ఆదాయం ఎక్కువగా సంపాదించవచ్చని చేతిలో ఉన్న డబ్బుల్ని ఏజెంట్లకు అప్పజెప్పి కువైట్‌కు వెళ్లి నానా తిప్పలు పడి, జైలు శిక్షలు అనుభవించి ఉత్తచేతులతో స్వదేశాలకు చేరుకొని బోరున విలపిస్తున్నారు. తమలా ఎవ్వరూ మోసపోకూడదంటూ మొరపెట్టుకుంటున్నారు. ఏం చెయ్యాలో తెలియక పలువురు కువైట్‌లోనే ఇబ్బందిపడుతున్నారని, మహిళల పరిస్థితి మరింత దారుణంగా ఉందని వాపోయారు.