హైద్రాబాద్ లో 10 లక్షలకు పైగా పావురాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

హైద్రాబాద్ లో 10 లక్షలకు పైగా పావురాలు

హైద్రాబాద్, అక్టోబరు 10 (way2newstv.com)
పావురాలు చూడటానికి చాలా ముద్దుగా ఉంటాయి. కానీ, చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే.. అనేక రకాల వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తికి ఈ పావురాలే కారణం. వాటి రెక్కలు, ఈకల నుంచి మొదలుకొని రెట్ట వరకూ ప్రతిదీ ప్రమాదకరమే. చారిత్రక భాగ్యనగరంలో ఈ శాంతి కపోతాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తాజాగా వాటి సంఖ్య 6 లక్షలకు చేరువైంది. అతి త్వరలోనే ఈ సంఖ్య 10 లక్షలకు చేరుకోనుంది. హైదరాబాద్ వాసులు ఇప్పటికైనా అప్రమత్తం కాకుంటే కేరళను వణికించిన నిఫా తరహా ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.పావురాలతో ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయో గుర్తించడానికి ప్రాఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం పక్షి విభాగ అధిపతి డాక్టర్‌ వాసుదేవరావు బృందం హైదరాబాద్‌లో తొలిసారిగా అధ్యయనం జరుపుతోంది. 
హైద్రాబాద్ లో 10 లక్షలకు పైగా పావురాలు

నగరంలో పావురాల సంఖ్య కచ్చితంగా ఎంత ఉందో ప్రభుత్వం వద్ద ఎలాంటి సమాచారం లేనప్పటికీ.. సుమారు 6 లక్షల పావురాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.పావురాలతో ప్రజలు ఎక్కువగా ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు. వాటి విసర్జితాలు మరింత ప్రమాదకరం. పావురాలతో ప్రధానంగా శ్వాసకోశ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంది. వీటి వల్ల చర్మం, నోరు, ఊపిరితిత్తుల సంబంధిత వ్యాధులు, ఉదరకోశం దెబ్బతినే ప్రమాదం తదితరాలు ఉన్నాయి. భాగ్యనగర వాసులకు పావురాలు ఇప్పటికే భారీ నష్టాన్ని మిగిల్చాయి.శ్వాస సంబంధ వ్యాధులతో ఆస్పత్రుల పాలైన రోగుల్లో సగం మందికి ఆ సమస్యలు రావడానికి పావురాలే కారణం అవుతున్నట్లు గతంలో ఢిల్లీలో గుర్తించారు. ఏసీ యూనిట్లు రిపేరు చేసే వాళ్లు ఎక్కువగా ఈ ఇన్‌ఫెక్షన్ల బారిన పడుతున్నారు. చాలా అపార్ట్‌మెంట్లలో పావురాలు వీటినే ఆవాసాలుగా మార్చుకోవడం ఇందుక్కారణం.హైదరాబాద్‌లో శరవేగంగా పెరుగుతున్న పావురాలను కట్టడి చేసేందుకు వెంటనే చర్యలు ప్రారంభించకుంటే సమీప భవిష్యత్తులో ప్రజలు తీవ్రమైన శ్వాస సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని వాసుదేవ రావు హెచ్చరిస్తున్నారు. ఆయన నేతృత్వంలోని బృందం సుమారు మూడేళ్ల నుంచి అధ్యయనం చేస్తోంది.పావురాల విసర్జితాలతో తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థతో పాటు అమెరికా విడుదల చేసిన అధ్యయన నివేదిక కూడా హెచ్చరించింది. పావురాల విసర్జితాల నుంచి ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు వ్యాప్తి చెందుతున్నాయని.. వాటి వల్ల 15 రకాల అనారోగ్య సమస్యలు రావొచ్చని పేర్కొంది.పావురాలతో నష్టాన్ని గుర్తించి పలు దేశాల్లో వాటికి దాణా వేయడాన్ని నిషేధించారు. సెంట్రల్‌ లండన్‌లో పావురాలకు బహిరంగ ప్రదేశాల్లో దాణా వేయడం నిషిద్ధం. 2003లోనే అక్కడి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా పావురాలకు దాణా వేస్తే 500 పౌండ్ల జరిమానా విధిస్తారు.సింగపూర్‌ లాంటి నగరాలు కూడా పావురాలకు దాణా వేయకుండా జరిమానాలతో ప్రజలను కట్టడి చేస్తున్నాయి. దాణా వేస్తుండటం వల్లే పావురాల సంఖ్య భారీగా పెరిగి, ప్రజారోగ్యంపై ప్రభావం పడుతున్నట్లు గుర్తించిన పలు దేశాలు ప్రధాన నగరాల్లో బహిరంగ ప్రదేశాల్లో వాటికి దాణా వేయడంపై నిషేధం విధించాయి.పావురాల విసర్జితాలు ఎండిపోయి పొడిలా మారి గాలిలో కలుస్తున్నాయి. వాటి ద్వారా వైరస్‌లు వ్యాపిస్తున్నాయి. పావురాల రెక్కల ద్వారా కూడా వైరస్‌లు, ఇన్‌ఫెక్షన్లు వేగంగా వ్యాపిస్తున్నాయి. వీటి బారిన పడే వారు ఎక్కువగా శ్వాస సంబంధ వ్యాధులకు గురవుతున్నారు. దీన్ని సాధారణ సమస్యగా నిర్లక్ష్యం చేస్తే క్రమంగా మగతగా అనిపించడం, తలనొప్పి ఉండటం, అనతి కాలంలోనే అది పక్షవాతానికి కూడా దారితీస్తోంది. వ్యాధి ముదిరి మరణాలు కూడా సంభవిస్తున్నాయి.హైదరాబాద్‌లోని ఆసుపత్రుల్లో ఈ తరహా కేసులు ఎక్కువగా నమోదు అవుతున్నాయని వాసుదేవరావు వెల్లడించారు. అయితే.. ఈ ఇన్‌ఫెక్షన్లకు కారణం పావురాలే అనే విషయాన్ని ప్రజలు ఇంకా గుర్తించకపోవడం గమనార్హం. పావురాలతో ఉన్న నష్టం చాలా మందికి తెలియదు. అందుకే హైదరాబాద్‌లో పావురాలకు విచ్చలవిడిగా దాణా వేస్తున్నారు.నగరంలో రెండేళ్ల కిందట పావురాలకు బహిరంగంగా దాణా వేసే ప్రాంతాలు 490 ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 560కి చేరుకుంది. భారీ అపార్ట్‌మెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలలో కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు ప్రత్యేకంగా పావురాలకు దాణా వేసే ప్రదేశాలను ఏర్పాటు చేస్తున్నారు. అలా చేస్తే పుణ్యం వస్తుందని ప్రజలు భావించడాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.