కిలో టమాటా 3 రూపాయిలే - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కిలో టమాటా 3 రూపాయిలే

కర్నూలు, అక్టోబరు 22, (way2newstv.com)
కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో టమోటా ధర  అమాంతం తగ్గిపోవడంతో రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు. ఉదయం వరకు జత గంపలు రూ.500 పలికిన ధర మధ్యాహ్నానికి రూ.70కి పడిపోయింది. అంతకుమించి కొనుగోలు చేసేది లేదని వ్యాపారులు ఖరాకండిగా చెప్పడంతో రైతన్నలు ఆగ్రహంతో రోడ్డెక్కారు. దళారులు, వ్యాపారులు కుమ్మకై తమ పొట్టకొడుతున్నారని ఆరోపిస్తూ రహదారిపై మూడు గంటల పాటు ఆందోళన చేశారు. అధికారులు దిగొచ్చి శుక్రవారం ధర పెంచి కొంటామని చెప్పడంతో ఆందోళన విరమించారు. వివరాలు ఇలా ఉన్నాయి. క్నూలు జిల్లా పత్తికొండ టమోటా మార్కెట్‌లో వ్యాపారులు, దళారుల మాయాజాలంలో రైతులు చిక్కుకున్నారు. 
కిలో టమాటా 3 రూపాయిలే

పత్తికొండ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి టమోట పండించిన రైతులు గురువారం మార్కెట్‌కు 15 లారీల సరుకు తీసుకొచ్చారు. ఉదయం 8 గంటల నుంచి టమోటా కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. జత గంపలురూ.500 చొప్పున కొనుగోలు చేశారు. అయితే 11 గంటల ప్రాంతంలో ధర పడిపోయిందని జత గంపలు రూ.70కి కొనుగోలు చేయడంతో చక్రాలకు చెందిన వ్యాపారులతో రైతులు వాగ్వివాదానికి దిగారు. వ్యాపారులు, దళారులు కలిసి ధర తగ్గించి తమ కడుపు కొట్టడం సరైన పద్దతి కాదంటూ రైతులంతా కలిసి ఆందోళన చేపట్టారు. వ్యాపారులతో వాగ్వివాదానికి దిగారు. పై మార్కెట్లో ధరలు తగ్గినందున కింది మార్కెట్‌లో ధరలు తగ్గించామని వ్యాపారులు వివరించారు. అయినా రైతులు ఆగ్రహంతో రోడ్డుపై బైఠాయించి తమకు న్యాయం చేయాలని కోరారు. సమాచారం తెలుసుకున్న రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రయ్య టమోటా మార్కెట్‌కు చేరుకుని రైతులు, వ్యాపారులు, దళారులతో మాట్లాడారు. టమోటాలు కొనుగోలు చేయాలని చెప్పినా వ్యాపారులు కొనుగోలు చేయలేదు. దీంతో మార్కెట్‌లో టమోటా విక్రయాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. రైతులు రోడ్డుపై బైఠాయించటంతో బెంగళూరు, మంత్రాలయం రోడ్డుపై మూడు గంటల ట్రాఫిక్ నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.