ఏలూరు, అక్టోబరు 15, (way2newstv.com)
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖలో ప్రక్షాళన దిశగా ప్రభుత్వం వినూత్న విధానానికి శ్రీకారం చుట్టింది. దళారుల ప్రమేయాన్ని నియంత్రిస్తూ ఎవరి డాక్యుమెంట్ వారే రూపొందించుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవటం ద్వారా సులభతరంగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ విధానాన్ని కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో అమల్లోకి తెచ్చారు. రిజిస్ట్రేషన్ల శాఖలో అవినీతి, ఆరోపణలు, తరచు ఏసీబీ దాడులు, ముడుపుల వ్యవహారంతో ముదిరిపోయిన ఈ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కొద్ది నెలల క్రితమే అధికారులను ఆదేశించారు.
స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ లో మార్పులు.....
ఈ మేరకు నూతన విధానానికి రూపకల్పన జరిగింది. ఇకపై క్రయ, విక్రయదారులు తమ డాక్యుమెంట్లను వారే తయారు చేసుకుని ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించారు. తొలిసారిగా ప్రవేశపెడుతున్న నూతన విధానం వల్ల మరింత పారదర్శకత తీసుకురావాలనేది ప్రభుత్వ యోచన. ఇప్పటి వరకు కొనుగోలు, విక్రయదారులు రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పడిగాపులు పడే పరిస్థితితో పాటు దళారులు దందా నిర్వహిస్తున్నారు. ఈ విధానాలకు ఇకపై స్వస్తి పలకటంతో పాటు డాక్యుమెంట్లను స్వయంగా ఆన్‌లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ల శాఖకు అప్‌లోడ్ చేయటం ద్వారా టైం స్లాట్‌ను కూడా పొందే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్లు, భవనాలు, భూములు, నివేశన స్థలాలకు సంబంధించి సేల్‌డీడ్, అగ్రిమెంట్ , తనఖా రిజిస్ట్రేషన్, బహుమతి రిజిస్ట్రేషన్,స జీపీఏ తదితర కార్యకలాపాలకు అనుగుణంగా డాక్యుమెంట్లను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. వివిధ అవసరాలకు అనుగుణంగా 16 రకాల నమూనా డాక్యుమెంట్లను అందుబాటులోకి తెచ్చారు. క్రయ, విక్రయదారులు తమ వివరాలను అందులో నిక్షిప్తంచేసి వాటిని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ రైటర్లతో నిమిత్తం లేకుండా నేరుగా స్థిర, చరాస్తుల కొనుగోలు, విక్రయదారులకే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిర్వహించుకునే విధంగా నూతన విధానం అమల్లోకి రానుంది. ప్రభుత్వం నిర్దేశించిన నమూనా డాక్యుమెంట్‌ను పూర్తిచేసి ప్రింట్లు రిజిస్ట్రేషన్కార్యాలయానికి సమర్పిస్తే డాక్యుమెంట్‌ను స్కాన్ చేయటంతో పాటు అధికారులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేపడతారు. ఇప్పటికే ఈ విధానం కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చారు. ఇందులో లోపాలను గుర్తించి సవరించిన అనంతరం నవంబర్ ఒకటి నుంచి పూర్తి స్తాయిలో అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈలోపు రాష్టవ్య్రాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.న్యాయవాదులు, వైద్యులు, రియల్టర్లు, బిల్డర్లు, ప్రముఖులతో పాటు సాధారణ ప్రజలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. నూతన విధానం ద్వారా సమర్పించిన డాక్యుమెంట్లను అనివార్య కారణాల వల్ల రిజిస్ట్రేషన్ కార్యాలయంలో తిరస్కరిస్తే దానిపై అప్పీల్‌కు వెళ్లేందుకు కూడా అవకాశం ఉంటుంది. రిజిస్ట్రేషన్ల చట్టం 73, 74 కింద సంబంధిత రిజిస్ట్రార్లకు దరఖాస్తు చేసుకుంటే ఏ కారణాల వల్ల డాక్యుమెంట్‌ను తిరస్కరించారనే దానిపై వివరణ ఇస్తారు.