రైతులకు అందని రొక్కం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రైతులకు అందని రొక్కం

హైద్రాబాద్, అక్టోబరు 9(way2newstv.com)
రాష్ట్రంలో 57 లక్షల మంది రైతులు ఉన్నారని వ్యవసాయ శాఖ లెక్కలు వెల్లడిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు పంట రుణాలు తీసుకున్న రైతులు మాత్రం 19.22 లక్షల మంది మాత్రమే కావడం గమనార్హం. అంటే ఏకంగా 37.78 లక్షల మంది అన్నదాతలకు బ్యాంకులు మొండిచేయి చూపాయి. ఇక అగ్రి టర్మ్ రుణాలు ఇప్పటి వరకు 14.66 శాతమే ఇచ్చారు. ఈ ఏడాది వ్యవసాయ టర్మ్ రుణాలు రూ.11,445 కోట్లు, అనుబంధ రంగాలకు రూ. 8410 కోట్లు పంపిణీ లక్షంగా ఉండగా, సెప్టెంబర్ చివరి నాటికి రూ.2911 కోట్లు ఇచ్చారుమూడు, నాలుగు బ్యాంకులు మినహా ఏ ఒక్క బ్యాంకు కూడా ఈ ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటి వరకు ఇచ్చిన టార్గెట్‌కు అనుగుణంగా పంట రుణాలు పంపిణీ చేయకపోవడమే ఇందుకు నిదర్శనం. 
రైతులకు అందని రొక్కం

రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్, మంత్రులు ఎస్‌ఎల్‌బిసి సమావేశాల్లో రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా పంట రుణాలు ఇవ్వాలని పదే పదే విజ్ఞప్తి చేసిన బ్యాంకుల అవేమి పట్టడం లేదు. ఖరీఫ్ సీజన్ ముగుస్తున్నా ఇప్పటికీ బ్యాంకులు ఇచ్చిన పంట రుణాలు 60 శాతం కూడా దాటలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పైగా రానున్న రబీలో ఖరీఫ్‌లో తక్కువగా ఇచ్చిన రుణాలను కవర్ చేస్తామని బ్యాంకులు భుజాలు తడుముకుంటున్నాయి.ఈ ఖరీఫ్‌లో పంట రుణాల లక్షం రూ.29,244 కోట్లకు గాను సెప్టెంబర్ 23వ తేదీ వరకు పంపిణీ చేసిన మొత్తం రూ. 17,087 కోట్లు మాత్రమే కావడం గమనార్హం. అంటే లక్షంలో 58.84 శాతం మాత్రమే పంపిణీ చేసినట్లు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి నివేదిక ద్వారా స్పష్టమౌతోంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు 18 ఉంటే వీటిలో రెండు బ్యాంకులు మాత్రమే లక్ష్యాన్ని మించి పంట రుణాలు ఇచ్చాయి. ఇందులో కెనరా బ్యాంకు, ఇండియన్ బ్యాంకు ఉన్నాయి. మిగిలిన 16 బ్యాంకులు 75 శాతం దాటలేదంటే రైతుల పట్ల బ్యాంకులు చిన్నచూపు స్పష్టమౌతోంది. ప్రధాన బ్యాంక్ కావడంతో పాటు ఎస్‌ఎల్‌బిసి లీడ్ బ్యాంక్‌గా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రుణాల పంపిణీ లక్షం రూ.7986 కోట్లు కాగా గత నెల 23 వరకు ఇచ్చినవి కేవలం రూ.4667 కోట్లు. లక్షంలో 58.44 శాతమే ఇచ్చింది.ఇక ప్రైవేట్ సెక్టర్‌కు వస్తే ప్రైవేట్‌లో మొత్తం 16 బ్యాంకులకు గాను ఒకే ఒక బ్యాంకు లక్ష్యాన్ని మించి పంట రుణాలు ఇచ్చింది. ప్రైవేట్ బ్యాంకుల ఖరీఫ్ లక్షం రూ.2433 కోట్లు కాగా ఇచ్చిన పంట రుణాలు సగం కూడా లేవు. కేవలం రూ.1249 కోట్లు మాత్రమే పంపిణీ చేశారు. కోఆపరేటివ్ బ్యాంకుల పరిస్థితి పర్వాలేదు అన్నట్లుగా ఉంది. రుణాల పంపిణీ లక్షం రూ.3335 కోట్లు కాగా, రూ.2092 కోట్లు 62 శాతం ఇచ్చాయి. వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాల చెల్లింపుపై ప్రభుత్వం త్వరలోనే బకాయిలు చెల్లిస్తామని బ్యాంకర్లకు స్పష్టం చేసింది. అయినా చాలాచోట్ల బ్యాంకులు ముక్కుపిండి రైతుల నుంచే వడ్డీలను వసూలు చేస్తున్నాయి. పివి, విఎల్‌ఆర్ కింద ప్రభుత్వం నుంచి బ్యాంకులకు రూ.1043 కోట్లు ఇవ్వాల్సి ఉంది.