నూజివీడులో దిక్కు మొక్కు లేకుండా టీడీపీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నూజివీడులో దిక్కు మొక్కు లేకుండా టీడీపీ

విజయవాడ, అక్టోబరు 12, (way2newstv.com)
నూజివీడు. కృష్ణాజిల్లాలోని కీల‌క నియోజ‌క‌వ‌ర్గం. ఏలూరు పార్ల‌మెంటు ప‌రిధిలోకి వ‌చ్చే ఈ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక‌ప్పుడు టీడీపీ జెండా బాగానే ఎగిరింది. అయితే, కాంగ్రెస్ నేత‌, మాజీ సీఎం వైఎస్ ఇక్క‌డ దృష్టి పెట్ట‌డంతో కాంగ్రెస్ పుంజుకుంది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న టీడీపీ హ‌వా త‌గ్గుతూ వ‌చ్చింది. ఇక్క‌డ నుంచి 1994, 1999 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌పున దివంగ‌త నేత కోట‌గిరి హ‌నుమంత‌రావు విజ‌యం సాధించారు. ఆయ‌న హ‌యాంలో బాగానే ఉన్న పార్టీ త‌ర్వాత 2004లో ఓట‌మి పాలైంది. అప్ప‌టి వైఎస్ దూకుడుతో ఇక్క‌డ నుంచి మేకా ప్ర‌తాప్ అప్పారావు విజ‌యం సాధించారు. నూజివీడు చ‌రిత్ర‌లోనే ఏ ఎమ్మెల్యేకు రాన‌ట్టుగా ఇక్క‌డ ఆ ఎన్నిక‌ల్లో ప్ర‌తాప్‌కు ఏకంగా 24 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చింది.
నూజివీడులో  దిక్కు మొక్కు లేకుండా టీడీపీ

ఇక‌, 2009లో మ‌రోసారి ఇక్క‌డ టీడీపీ విజ‌యం సాధించింది. 2009 ఎన్నిక‌ల్లో చిన్న రామ‌కోట‌య్య ఇక్క‌డ వైఎస్ హ‌వాను త‌ట్టుకుని మ‌రీ టీడీపీ జెండా ఎగిరేలా చేశారు. అయితే, పార్టీలో అంత‌ర్గ‌త కుమ్ములాటల కార‌ణంగా చిన్నం త‌ప్పుకొన్నారు. ఈ క్ర‌మంలోనే 2014 కు వ‌చ్చేస‌రికి ఇక్క‌డ నుంచి టీడీపీ త‌ర‌ఫున ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌రావు టికెట్ ద‌క్కించుకున్నారు. అయితే, ఆ ఎన్నిక‌ల్లో రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ గాలులు వీచినా.. ముద్ద‌ర‌బోయిన గెలుపు గుర్రం ఎక్క‌లేక పోయారు. దీంతో ఇక్క‌డ వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసిన మేకా విజ‌యం సాధించారు. ఈ క్ర‌మంలో ఇక్క‌డ వైసీపీకి ప‌ట్టు సాధించారు. కేడ‌ర్‌ను బ‌లోపేతం చేశారు.ఐదేళ్ల పాటు రాష్ట్రంలో అధికారంలో ఉండి.. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీ ఏ మాత్రం ప‌రిస్థితి మెరుగు ప‌ర‌చుకోలేదు. ఎప్పుడో కోట‌గిరి హ‌నుమంత‌రావు త‌ర్వాత రెండు ద‌శాబ్దాలుగా నూజివీడు టీడీపీకి ఇక్క‌డ స‌రైన నాయ‌కుడు దొర‌క‌డం లేదు. అరువు నాయ‌కులో లేదా పార్ట్ టైం పొలిటిషీయన్ల‌తోనే కాలం గ‌డుపుతోంది. ఐదేళ్ల పాటు పార్టీ అధికారంలో ఉన్నా ఏలూరు ఎంపీ మాగంటి బాబు వ‌ర్సెస్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్‌చార్జ్ ముద్ద‌ర‌బోయిన వెంక‌టేశ్వ‌ర‌రావు వ‌ర్గాల మ‌ధ్య ఉప్పు నిప్పుగా ఉంది. వీరి అంత‌ర్గ‌త పోరు ఈ ఎన్నిక‌ల్లో అధికార పార్టీకి ప్ల‌స్‌గా మారింది.ఈ నేప‌థ్యంలో తాజాగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్క‌డ మ‌రోసారి వైసీపీ విజ‌యం సాధించింది. ఇక‌, టీడీపీని బ‌లోపేతం చేసే నాయ‌కుడు కానీ, బ‌లోపేతం చేయాల‌న్న ఆలోచ‌న కానీ ఎవ‌రూ చేయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. కేడ‌ర్ కూడా దాదాపు ఒంట‌రైపోయింది. ఏలూరు ఎంపీగా ఉన్న స‌మ‌యంలో మాగంటి బాబు, ముద్ద‌ర‌బోయిన‌ ఇక్క‌డ ఆధిప‌త్య రాజ‌కీయం చేశారు. త‌మ‌ వ‌ర్గాన్ని పెంచి పోషించారు. అయితే, బాబుతో పాటు ముద్ద‌ర‌బోయిన‌ కూడా ఈ ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం, వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వీరు మ‌ళ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేస్తార‌నే ఆశ‌లు కూడా హ‌రించుకు పోవ‌డంతో ఇప్పుడు టీడీపీ జెండా మోసే నాయ‌కుడు కూడా లేక పోవ‌డం గ‌మ‌నార్హం.ఇప్ప‌టికే ముద్ద‌ర‌బోయిన వ‌రుస‌గా మూడు ఎన్నిక‌ల్లో ఓడిపోతూ వ‌స్తున్నారు. 2009లో గ‌న్న‌వ‌రంలో కాంగ్రెస్ నుంచి ఓడిన ఆయ‌న గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ నూజివీడులో టీడీపీ త‌ర‌పున ఓడిపోయారు. ఇక మ‌ళ్లీ ఐదేళ్ల పాటు టీడీపీని బ‌తికించే దిశ‌గా ఆలోచ‌న చేయ‌డం లేదు. మంచి ఛాన్స్ వ‌స్తే పార్టీ మారేందుకు కూడా రెడీగానే ఉన్నారు. ఇక మాగంటి బాబుది దాదాపుగా రాజ‌కీయ స‌న్యాసమే. మ‌రి ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు నూజివీడులో టీడీపీని బ‌తికించుకునేందుకు ఎలాంటి వ్యూహాన్ని ఇక్క‌డ అమ‌లు చేస్తారో ?చూడాలి.