అనంతపురం, అక్టోబరు 22, (way2newstv.com)
రాయలసీమ అంటేనే జేసీ బ్రదర్స్ గుర్తుకొస్తారు. జేసీ బ్రదర్స్ నిన్న మొన్నటి వరకూ అధికారంలోనే ఉన్నారు. వారు ఏ పార్టీలో ఉన్నా అధికారంలోకి వస్తుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు ఇప్పటి వరకూ కలగలేదు. కానీ తొలిసారి వారు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వస్తుంది. ఎలాంటి పదవులు లేకుండా కేవలం జెండా మోయడానికే జేసీ బ్రదర్స్ పరిమితమవ్వాల్సి వచ్చింది. జేసీ దివాకర్ రెడ్డి అనంతపురం ఎంపీగా, ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి ఎమ్మెల్యేగా పెత్తనం చేసిన సంగతి తెలిసిందే.కాంగ్రెస్ నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జేసీ బ్రదర్స్ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఇద్దరూ విజయం సాధించారు.
జేసీ బ్రదర్స్ రూట్ మారుతుందా
తమ పార్టీ అధికారంలో ఉండటంతో వారి ఆధిపత్యానికి ఎదురులేకుండా పోయింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను కూడా వారు లెక్క చేయలేదు. అప్పటి అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, కాల్వ శ్రీనివాసులు వంటి వారితో నిత్యం గొడవపడే వారు. జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే జగన్ ను అసభ్య పదజాలంతో దూషించారు.అయితే ఎన్నికల ఫలితాల వైసీపీ ప్రభుత్వం రావడంతో జేసీ బ్రదర్స్ సైలెంట్ గానే ఉన్నారు. జేసీ దివాకర్ రెడ్డి అప్పుడప్పుడు మాట్లాడుతున్నా జగన్ కు వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. మూడు నెలల పాలనలో జగన్ కు వంద మార్కులు వేశారు జేసీ. ఇలా జేసీ కొంత సంయమనం పాటిస్తుంది జగన్ సర్కార్ తనను టార్గెట్ చేయకుండా ఉండేందుకే. అయితే తాజాగా జేసీ బ్రదర్స్ కు పెద్ద దెబ్బే తగిలింది. వారి ఆదాయమార్గాలను వైసీపీ సర్కార్ గండికొట్టింది. జేసీ బ్రదర్స్ కు చెందిన దివాకర్ ట్రావెల్స్ కు సంబంధించి 31బస్సులను సీజ్ చేసింది. సీజ్ చేయడమే కాదు వాటి పర్మిట్లను కూడా రద్దు చేసింది.దీంతో జేసీ బ్రదర్స్ వైసీపీ సర్కార్ కు సరెండర్ అవుతారని అనంతపురం జిల్లాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవైపు బస్సులు సీజ్ చేయడంతో పాటు గతంలో ప్రభోదానంద ఆశ్రమంపై జేసీ బ్రదర్స్ అనుచరులు దాడులకు దిగారు. వీటిపై కూడా వరసగా కేసులు నమోదవుతుండటంతో జేసీ బ్రదర్స్ బెంబేలెత్తుతున్నారని తెలుస్తోంది. జేసీ బ్రదర్స్ ముందున్న ఆప్షన్ ఒక్కటే. వెంటనే వైసీపీలో చేరిపోవడం అక్కడ దారి లేకుంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరిపోవడం అంటున్నారు వారి అనుచరులు. మొత్తం మీద జేసీ బ్రదర్స్ మాత్రం పీకల్లోతు కష్టాల్లో ఉన్నారన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది.