అటకెక్కిన కొత్త జిల్లాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

అటకెక్కిన కొత్త జిల్లాలు

విజయవాడ, అక్టోబరు 15, (way2newstv.com)
రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం దాదాపు పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి లేదా గణతంత్ర దినోత్సవం నాటికి కొత్త జిల్లాల గురించి ప్రకటన చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ వివిధ కారణాల వల్ల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల హామీ మేరకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. దీంతో రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను 25 జిల్లాలుగా మారతాయి. 
అటకెక్కిన కొత్త జిల్లాలు

గిరిజన జిల్లాను కూడా ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి దృష్టి సారించడంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26కు చేరుతుంది. జిల్లాలోని వివిధ అసెంబ్లీ నియోజకవర్గాలను విభజిస్తూ కొత్త జిల్లాల పరిధిలోకి తీసుకురావడం వల్ల చిత్తూరు, కడప, నెల్లూరు, గుంటూరు తదితర జిల్లాల్లో కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జిల్లా కేంద్రాలు కొన్ని చోట్ల దూరంగా ఉండాల్సి రావడం తదితర సమస్యలు తెరమీదకు వచ్చాయి. రాజకీయంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉండటంతో స్థానిక సంస్థల ఎన్నికల తరువాత దీనిపై దృష్టి సారించేందుకు రెవెన్యూ శాఖ నిర్ణయించింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో కొత్త జిల్లాల ఏర్పాటుతో వివిధ శాఖ జిల్లా కార్యాలయాల ఏర్పాటు, అదనపు సిబ్బంది నియామకం, ఇతర నిర్వహణ ఖర్చులు రాష్ట్ర ఖజనాపై భారం మోపుతాయని భావించి కూడా తాత్కాలికంగా ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. రాష్ట్రంలో భూముల సర్వే చేసేందుకు నిర్ణయించిన నేపథ్యంలో కూడా కొత్త జిల్లాల ఏర్పాటు అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసుకుందని తెలుస్తోంది.