కోటం రెడ్డి ఎపిసోడ్... - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కోటం రెడ్డి ఎపిసోడ్...

జగన్ కు ప్లస్.. కేడర్ కు లాస్
నెల్లూరు, అక్టోబరు 10, (way2newstv.com)
ఎంత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమారుడు అయినా వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో తండ్రి కంటే భిన్నంగా ఉంటారు. ఆ విషయం ఎపుడో రుజువు అయింది. వైఎస్సార్ ఆవేశం పెదవి దాటినా గడప దాటదు, వైఎస్ జగన్ అలా కాదు అమీ తుమీ తేల్చేస్తారని పదేళ్ల ఆయన రాజకీయం పరిశీలిస్తే అర్ధమవుతుంది. ఇక పార్టీ వారి విషయంలో వైఎస్ జగన్ అందరినీ గుర్తు పెట్టుకుని న్యాయం చేయడాన్ని చూసిన వారు వైఎస్సార్ కి తగిన తనయుడు అనుకున్నారు. ఆయన మంత్రివర్గ కూర్పులో ఆ విషయం స్పష్టంగా కనిపించింది. ఇక పార్టీలో మొదటి నుంచి ఉన్న నాయకులను గుర్తించి ప్రోత్సహించడంలో కూడా వైఎస్ జగన్ తండ్రి బాటలోనే ప్రయాణిస్తున్నారు. 
 కోటం రెడ్డి ఎపిసోడ్...

అయితే కొన్ని కీలకమైన విషయాల్లో మాత్రం వైఎస్ జగన్ నా రూటే సెపరేట్ అంటున్నారు. అదే ఇపుడు వైసీపీలో చర్చకు దారితీస్తోంది.వైఎస్సార్ తన వారు అనుకుంటే ఎంతకైనా వెళ్తారని పేరు తెచ్చుకున్నారు. దానికి ఒక ఉదాహరణగా చెబుతారు. అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు నేరం చేసి జైలు పాలు అయితే ప్రతిపక్ష నాయకునిగా ఉంటూ జైల్లోకి వెళ్ళి పరామర్శించిన ఘనత వైఎస్సార్ ది అంటారు. ఆయన నాడు తనపై విమర్శలు ఎన్ని వచ్చినా కూడా చలించలేదు. కార్యకర్తలను నేను కాకుంటే ఎవరు కాపాడుకుంటారని వైఎస్సార్ ఎదురు ప్రశ్నించేవారు. వైఎస్సార్ లో ఆ గుణం బాబులో లేదని టీడీపీ వారు పదే పదే అనేవారు కూడా. దాంతో బాబు 2014 తరువాత పూర్తిగా మారిపోయి వైఎస్సార్ బాటలో నడిచారు. తన పార్టీ వారు అనుకుంటే చూడకుండా వదిలేశారు. చింతమనేని వంటి వారు ఆ విధంగా లాభపడ్డారు. ఇపుడు వైఎస్ జగన్ ఒకప్పటి చంద్రబాబు రూట్లో ప్రయాణం చేస్తున్నారని అంటున్నారు.నెల్లూరు రూరల్ జిల్లా వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైఎస్ జగన్ భక్తుడు. ఆయనే చెప్పుకున్నట్లుగా తనలాంటి పేద వారిని కూడా వైఎస్ జగన్ ఎమ్మెల్యేగా గెలిపించారని అంటారు. వైఎస్ జగన్ కోసం ఏమైనా చేస్తానని కూడా చెబుతారు. ఇక ఆయనలో ఆవేశం పాలు చాలా ఎక్కువ. కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. అయితే నెల్లూరు వైసీపీ రాజకీయాల్లో వర్గాలు ఉన్నాయి. వాటిని సరిదిద్దే ప్రయత్నం వైసీపీ హైకమాండ్ ఎపుడూ చేయలేదు. మరో వైపు కోటంరెడ్డి తప్పు చేసి వుంటే ముందే మందలించి వైఎస్ జగన్ దారికి తెస్తే బాగుండేదేని కూడా వినిపిస్తోంది. వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయంతో కోటంరెడ్డి అరెస్ట్ అయ్యారు. ప్రభుత్వానికి వైఎస్ జగన్ కి పేరు వచ్చినా రాజకీయంగా ఆయనకు నష్టమేనని అభిప్రాయం ఉంది. వైసీపీ క్యాడర్ కి వైఎస్ జగన్ ఎంతవరకూ అండగా ఉంటారు అన్నది ఇపుడు చర్చనీయాంశమైంది. అధికార పార్టీ నాయకులపైన సహజంగానే ఆరోపణలు వస్తూంటాయి. వాటిని పట్టించుకుని అరెస్టుల దాకా తీసుకువెళ్తే క్యాడర్ ఆత్మ స్థైర్యం దెబ్బతింటుందని అన్న వారూ ఉన్నారు. మొత్తానికి వైఎస్ జగన్ బ్యాలన్స్ గా ఉంటే బాగుండేదన్న మాట వినిపిస్తోంది.