కాకినాడ, అక్టోబరు 25, (way2newstv.com)
రాజకీయాల్లో ఆయనకు సామాజికవర్గం బలం లేదు, ఆర్ధికంగా బలవంతుడు కాదు, కానీ మేధావితనంతోనే ఆయన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన మాటకు విలువ పెంచుకున్నాడు. అధికారంలో ఉన్నా లేకపోయినా పదవులు లేకపోయినా కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారంటే వినే వారు ఉన్నారు. ఆయన మాటల వెనక నిజాయతీ ఉంటుందని నమ్మే వారు ఎక్కువ మందే ఉన్నారు. అదే ఆయన అసలైన బలం, అదే శ్రీరామరక్ష కూడా. ఇదిలా ఉండగా ఉండవల్లి అరుణ్ కుమార్ కి వైఎస్సార్ అంటే చాలా ఇష్టం. ఆయన కోటరీలో అతి ముఖ్యుడు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన ఉండవల్లి అరుణ్ కుమార్ చివరకు అడ్డగోలు విభజన కారణంగా తన రాజకీయ జీవితానికే ముగింపు పలికేశారు.
పక్కా ప్లాన్ తో ఉండవల్లి అడుగులు
ఆయన జగన్ కి ఎపుడూ ప్రత్యక్షంగా మద్దతు ఇవ్వలేదు, జగన్ శిబిరంలో చేరలేదు, జగన్ ఏపీలో గెలవాలి, పాలన చేయాలని మాత్రం మనసారా కోరుకున్నారు. అది ఎన్నో సార్లు బాహాటంగా చెప్పారు కూడా.ఇదీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాట. నిజానికి వైఎస్సార్ తో సాన్నిహిత్యం నెరిపిన నాయకులందరి మాట కూడా అదే. వారంతా మరోసారి వైఎస్సార్ పాలనను ఏపీలో చూడాలనుకుంటున్నారు. వైఎస్సార్ కోసం ప్రాణం పెట్టిన వారికి ఇపుడు జగన్ లో వైఎస్ కనిపిస్తున్నారు. జగన్ అద్భుతమైన విజయం వారికి ఎంతో ఉత్సాహం ఇస్తోంది. అలాంటి వారిలో కాంగ్రెస్ లో ఉన్న కేవీపీ రామచంద్రరావుని మొదట చెప్పుకోవాలి. ఆయన వైఎస్సార్ కి ఆత్మగా ఉన్నారు. జగన్ ని సొంత మేనల్లుడిగా చూసుకుంటానని చెప్పిన వ్యక్తి. ఇక కాంగ్రెస్ లో మిగిలిపోయిన మరో నేత రఘువీరారెడ్డి. ఆయనకు కూడా జగన్ సీఎం కావడం ఎంతో సంతోషం ఇచ్చింది. ప్రస్తుతం ఆయన రాజకీయాల నుంచి కొంత విరామం ప్రకటించారు. ఇక మాజీ మంత్రి సాకే శైలజానాధ్ వంటి వారు కూడా జగన్ ని సీఎం గా చూడాలనుకున్న వారే, అదే విధంగా తిరుపతి మాజీ ఎంపీ చింతా మోహన్ సైతం జగన్ ఎదుగుదలను ఆకాంక్షించారు. వీరంతా వైసీపీ బయట నుంచి జగన్ క్షేమాన్ని కోరుతున్న నేతలు. వీరంతా జగన్ జర జాగ్రత్త అంటున్నారు. వీరందరి గొంతుకగా మారిన ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం జగన్ కి డైరెక్ట్ గా హెచ్చరికలు పంపిస్తున్నారు. జగన్ కీలకమైన సమయం ఇది. ఓ విధంగా అగ్ని పరీక్ష అని కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు.జగన్ బంపర్ విక్టరీ మీద ఉండవల్లి అరుణ్ కుమార్ విశ్లేషణ ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. దేశంలో పీవీ నరసింహారావు, రాజీవ్ గాంధీ, ఎన్టీయార్ ల తరువాత జగన్ కి 51 శాతం ఓట్లతో ఇంతటి అధ్బుతమైన విజయాన్ని ప్రజలు కట్టబెట్టారని ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పారు. అలాంటి విజయం కడు భారమని కూడా ఆయనే చెప్పారు. ఎందుకంటే ఇది కొండంతఅ ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం. ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకుని గెలిపించిన తరువాత 99 హామీలను తీర్చి ఆ ఒక్క హామీ తీర్చకపోయినా కూడా పూర్తిగా అసంత్రుప్తి వ్యక్తం చేస్తారు. అది టఫ్ జాబ్. బిగ్ టాస్క్ అని ఈ మధ్య ఓ ఛానల్ ఇంటర్వ్యూలో జగన్ గురించి ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పిన మాటలు అక్షల సత్యాలే. జగన్ ఇపుడు పూలకిరీటంగా ఉన్న ముళ్ళ కిరీటాన్ని ధరించారు. ఏపీ చూస్తే ఆర్ధికంగా లోటులో ఉంది. అందువల్ల సాకులు చెప్పినా జనం వూరుకోరు సరికదా మాట వినరు. దీంతో జగన్ తాను చెప్పిన పనులన్నీ తప్పక చేయాలి. జగన్ ఇప్పటికే అ దిశగా ఆచరణలో ఉన్నారు. అయితే జాగ్రత్తగా అడుగులు వేస్తూ సక్సెస్ కావాలని ఉండవల్లి అరుణ్ కుమార్ మనసారా కోరుకున్నారు. అదే సమయంలో గట్టి హెచ్చరిక కూడా చేశారు. మరి జగన్ వీటిని దృష్టిలో పెట్టుకుంటే వైసీపీతో పాటు, పాత కాంగ్రెస్ నేతలు కూడా సంతోషిస్తారు.