కర్నూలు, అక్టోబరు 15, (way2newstv.com)
జిల్లాలోని ఏడు గ్రామ పంచాయతీలు అప్‌గ్రేడ్ కానున్నాయి. వీటిని నగర పంచాయతీలుగా చేసేందుకు జిల్లా అధికార యంత్రాంగం,, రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు ప్రతిపాదనలను పంపింది. గ్రామ పంచాయతీల్లోని జనాభా, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని నగర పంచాయతీలు/ మునిసిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలు మున్సిపాలిటీలకు సంబంధించి సమీపంలో ఉన్న గ్రామాలను విలీనం చేసేందుకు వీలుగా ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్/ డైరెక్టర్ సూచించారు.
డిసెంబర్ నాటికి కొత్త పురపాలికలు
ఈ అంశాలకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ సిఫారసుల మేరకు నగర పంచాయతీలుగా అప్‌గ్రేడ్ చేసే గ్రామ పంచాయతీలు, అలాగే కర్నూలు కార్పొరేషన్, ఆదోని మున్సిపాలిటీలో విలీనం చేసేందుకు అవకాశం ఉన్న గ్రామాల జాబితాలను జిల్లా కలెక్టర్ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖకు పంపారు. ఆయా గ్రామ పంచాయతీల్లో 25 వేలకు పైగా జనాభా ఉండడంతో పాటు పలు అంశాలను పరిశీలించి అప్‌గ్రేడ్, విలీనం జాబితాలను పంపారు. కోడుమూరు, పత్తికొండ, కోసిగి, ఆలూరు, కోవెలకుంట్ల, బనగానపల్లె, బేతంచెర్ల గ్రామ పంచాయతీలను అప్‌గ్రేడ్ చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. కర్నూలు నగర పాలక సంస్థ పరిధిలోకి సమీపంలోని పెద్దపాడు, లక్ష్మీపురం, పందిపాడు గ్రామాలను, ఆదోని మున్సిపాలిటీ పరిధిలోకి మండగిరి, సాదాపురం, బసాపురం, మధిరె, ఢణాపురం గ్రామాలను విలీనం చేసేందుకు ప్రతిపాదనలు పంపారు. ఈ ఏడాది డిసెంబర్‌లో పురపాలక ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్న నేపథ్యంలో అప్పటిలోగా నగర పంచాయితీల అప్‌గ్రేడేషన్ ప్రక్రియతో పాటు మున్సిపాలిటీల విస్తరణ కార్యాక్రమం కూడా పూర్తి అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
Tags:
Andrapradeshnews