విశాఖపట్టణం, అక్టోబరు 28, (way2newstv.com)
రాజకీయాల్లో తమకు అనుకూలంగా ఉంటేనే ఏ నాయకుడైనా, నాయకురాలైనా ముందుకు సాగుతారనే విషయం తెలిసిందే. ఒక్క ఓటమి అనేక మార్పులకు నాంది పలుకుతుంది. ఇలాంటి పరిణామమే ఇప్పుడు ప్రతిపక్షం టీడీపీలో కనిపిస్తోంది. ఆ పార్టీ లో ఓటమి పాలైన నేతలు ఇప్పుడు మళ్లీ కొత్త మార్గాలు, తమకు అనుకూల పవనాలు ఉన్న ప్రాంతాలను చూసుకుంటున్నా రు. సాధారణంగా ఏ నియోజకవర్గంలో అయితే ఓటమి ఎదురైందో .. దానికి గల కారణాలు తెలుసుకుని, వాటిని అధిగమించి, అక్కడ పావులు కదిపి, తమకు అనుకూలంగా వాతావరణాన్ని సృష్టించుకునేందుకు నాయకులు పక్కా ప్రణాళికలు వేసుకోవడం అనేది గతంలో ఉంది. అయితే, ఇప్పుడు రోజులు మారాయి. వీటితో పాటు నాయకులు కూడా మారారు.
మళ్లీ పాయకారావు పేటలోనే పాగా
తమకు అనుకూలం ఉన్న కేడర్‌ను చూసుకుని తమ అభివృద్ధిని, తమ రాజకీయాలను నిర్దేశించుకుంటున్నారు. తాజాగా టీడీపీలో కీలక మహిళా నేతగా, ఫైర్ బ్రాండ్‌గా గత ఐదేళ్లలో గుర్తింపు తెచ్చుకున్న ఎస్సీ నాయకురాలు వంగలపూడి అనిత తనకు అనుకూలంగా ఉన్న నియోజకవర్గాన్ని విడిచి పెట్టేది లేదని చెబుతున్నారు. గత ఐదేళ్ల చంద్రబాబు హయాంలో వైసీపీ మహిళా ఎమ్మెల్యే రోజాతో ఢీ అంటే ఢీ అని అటు అసెంబ్లీలోను, ఇటు బయట కూడా వంగలపూడి అనిత దూకుడు ప్రదర్శించారు. చంద్రబాబుపై ఎలాంటి ఆరోపణ చేసినా ఆమె కౌంటర్లు ఇచ్చేవారు. 2014లో తొలిసారి రాజకీయాల్లోకి వచ్చిన వంగలపూడి అనిత, విశాఖలోని పాయకరావుపేట నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అదేసమయంలో పార్టీకి అంకిత భావంతో పని చేయడం, అప్పటి విపక్షం వైసీపీపై దూకుడుగా వ్యవహరించడంతో చంద్రబాబు దృష్టిలో పడ్డారు.ఈ క్రమంలోనే వంగలపూడి అనిత తనకు 2017లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో చోటు దక్కుతుందని అనుకున్నారు. అయితే, సమీకరణలు కుదరకపోవడంతో ఆమె ఆశలు తీరలేదు. ఇక, ఎన్నికలు దగ్గర పడే సరికి నియోజవకర్గంలో ఓ వర్గం.. ఆమెకు వ్యతిరేకంగా పావులు కదిపింది. దీంతో చంద్రబాబు ఆమెను రెండు జిల్లాలను దాటించి పశ్చిమగోదావరిలోని కొవ్వూరు నియోజకవర్గం నుంచి పోటీకి దింపారు. ఇక్కడ అప్పటి వరకు ఉన్న అప్పటి మంత్రి జవహర్‌కు కూడా నాన్ లోకల్ సెగ తగలడంతో ఆయనను కృష్ణా జిల్లాకు మార్చారు. ఈ స్థానంలో అనితకు అవకాశం ఇచ్చారు. అయితే, జగన్ సానుకూల పవనాల నేపథ్యంలో వంగలపూడి అనితఓటమి పాలయ్యారు. ఇక్కడ వంగలపూడి అనితపై ప్రస్తుతం మంత్రిగా ఉన్న తానేటి వనిత విజయం సాధించారు. అయితే, ఎన్నికలకు ముందు మాత్రం ఆమె.. నేను ఓడిపోయినా.. నియోజకవర్గంలోనే ఉంటాను. ఇక్కడే ప్రజలకు సేవ చేస్తాను అని చెప్పారు.అయితే, కొవ్వూరులో ఓటమి తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే నియోజకవర్గంలో వంగలపూడి అనిత పర్యటించారు. పైగా కేడర్‌ను కూడా పట్టించుకోలేదు. ఇక్కడ నుంచి వైసీపీ తరఫున విజయం సాధించిన తానేటి వనిత ఇప్పుడు మంత్రి గా ఉన్నారు. ఈ నేపథ్యంలో తనకు అనుకూలంగా ఉన్న విశాఖలోని పాయకరావుపేటకే అనిత తన మకాం మార్చేసినట్టు తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు జల్లాల పర్యటన ప్రారంభించి, ఈ క్రమంలో విశాఖలో పెట్టిన సమావేశానికి వంగలపూడి అనితహాజరయ్యారు. స్థానిక సమస్యలను చంద్రబాబుకు వివరించారు. ఈ పరిణామాలను గమనిస్తే.. ఆమె మళ్లీ పాయకరావుపేటపైనే దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. అంటే వచ్చే ఎన్నికల నాటికి ఇక్కడి పరిస్థితిని, కేడర్‌ను కూడా తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ఆమె ప్రాధాన్యం చూపుతున్నారు. దీంతో కొవ్వూరులో టీడీపీకి కొత్త నేత అవసరమవుతున్నారు.