నెంబర్ ప్లేట్ బదులు జగన్ పేరు... అరెస్ట్ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

నెంబర్ ప్లేట్ బదులు జగన్ పేరు... అరెస్ట్

హైద్రాబాద్, అక్టోబరు 23, (way2newstv.com)
ఏపీ సీఎం జగన్ పట్ల యూత్‌లో ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. జగన్ మీద అభిమానంతో.. బైక్‌ల మీద జై జగన్ లాంటి స్లోగన్లు రాసుకోవడం చూశాం. కానీ ఓ యువకుడు ఏకంగా కారు నంబర్ ప్లేట్ మీద ఏపీ సీఎం జగన్ అని రాసుకొని మరీ తిరుగుతున్నాడు. టోల్‌గేట్ల దగ్గర డబ్బులు కట్టకుండా ఉండటానికి కూడా ఈ ప్లాన్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో తూర్పుగోదావరి నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు నంబర్ ప్లేట్‌పై ఏపీ సీఎం జగన్ అనే రాసుకొచ్చాడు. కానీ జీడిమెట్ల ట్రాఫిక్ పోలీసులకు చిక్కడంతో ఆ యువకుడితోపాటు కారు ఇచ్చిన వ్యక్తిపై కూడా కేసు నమోదైంది. 
నెంబర్ ప్లేట్ బదులు జగన్ పేరు... అరెస్ట్

వివరాల్లోకి వెళ్తే..పిఠాపురానికి చెందిన ముప్పిడి హరి రాకేశ్ (27) కూకట్ పల్లిలోని బాలాజీనగర్‌లో నివాసం ఉంటూ.. జీడిమెట్లలో వ్యాపారం చేస్తున్నాడు. పిఠాపురం ప్రాంతానికి చెందిన తమ బంధువు కారును రాకేశ్ నగరానికి తీసుకొచ్చి వాడుకుంటున్నాడు. కారు నంబర్ ఏపీ 10బీడీ7299 కాగా.. నంబర్ ప్లేట్ మీద ‘ఏపీ సీఎం జగన్’ అని ముందు, వెనకాల రాయించాడు.అక్టోబర్ 19న సాయంత్రం జీడిమెట్ల పైపులైను రోడ్డులో వాహనాలను తనిఖీ చేస్తున్న జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ సత్యనారాయణ ఈ కారును ఆపారు. వివరాలు సేకరించగా.. కారు తమ బంధువుదని.. పిఠాపురం నుంచి హైదరాబాద్ వచ్చేటప్పుడు టోల్ గేట్ ఫీజు, ఇతర చెకింగ్ల నుంచి తప్పించుకోవడానికి అలా రాశానని రాకేశ్ చెప్పాడు.ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ట్రాఫిక్ పోలీసులు.. ఈ కేసును జీడిమెట్ల లా అండ్ ఆర్డర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు కారు స్వాధీనం చేసుకుని రాకేశ్ అరెస్ట్ చేశారు. అతడితో పాటు కారు ఓనర్ యేసురెడ్డిపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.