అనంతపురం, అక్టోబర్ 28 (way2newstv.com):
యాడికి మండలంలోని యాడికి, రాయలచెరువు గ్రామాల్లోని గుట్టల్లో అక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఇక్కడ ఎన్నో ఏళ్లుగా గ్రామాలకు గుర్తుగా పెద్దరాళ్లతో కూడిన గుట్టలు కబ్జాకు గురవుతున్నాయి. క్రయ విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. బడాబాబులు కొందరు గుట్టల్లోని మట్టిని అక్రమంగా తరలించడం, అక్కడే పాగా వేయడం పరిపాటిగా మారింది. దాదాపు 100 ఎకరాలున్న భైరవకొండ చుట్టూ రక్షణ లేక క్రమంగా ఆక్రమణలకు గురవుతోంది. కొండ చుట్టూ స్థిరాస్తి వ్యాపారులు, రహదారి నిర్మాణ గుత్తేదారులు గ్రావెల్ కోసమని తవ్వేశారు. ఇదే అదునుగా చేసుకొని కొందరు ఆక్రమిస్తుండటం గమనార్హం.
అక్రమాల గుట్టలు(అనంతపురం)
వంద ఎకరాల భైరవకొండలో ఇప్పటికే 20 నుంచి 30 ఎకరాలు ఆక్రమణల చెరలో చిక్కిన దయనీయమిది. ఇక్కడ ఎకరం రూ.7 లక్షలకుపైగా పలుకుతుండటంగమనార్హం.రాయలచెరువు సమీప గుట్టల్లో ఖనిజ నిక్షేపాలు ఉన్నాయని నిరభ్యంతర ధ్రువపత్రానికి (ఎన్‌వోసీ) దరఖాస్తు చేసుకున్న తక్షణమే, అనుమతులు రాక ముందే యథేచ్ఛగా దారులు ఏర్పాటు చేసుకొని దర్జాగా తవ్వేస్తున్నారు. జాతీయ రహదారికి, ఈ చెరువు గుట్టకు మధ్యన పెద్దవంక ఉన్నప్పటికీ గుట్టల్లో పట్టాలు కూడా ఇచ్చేశారు. యంత్రాలు పెట్టి చెరువు చుట్టూ గుట్టలను తోడేస్తున్న వారి పట్ల అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. 520 ఎకరాల విశాలమైన చెరువుకు రక్షణగా ఉండాల్సిన గుట్టల్లో అక్రమ తవ్వకాలను చూసి స్థానికులు, రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరువ పారేచోట భూములు సాగు చేసుకోవడంపై చోద్యం చూస్తున్న అధికారులు.. కొన్ని చోట్ల రక్షణ కట్టలకు పట్టా ఇవ్వడం గమనార్హం. యాడికి, రాయలచెరువు గ్రామాల సమీపంలో ప్రకృతి విపత్తుల నుంచి రక్షణగా, పచ్చదనానికి ప్రతీకగా ఉండాల్సిన గుట్టలు, కొండలను తవ్వేస్తుండటంతో పర్యావరణానికి పెనుముప్పు వాటిల్లుతోంది. రాయలచెరువు చుట్టూ ఖనిజాల అన్వేషణలో భాగంగా జరుపుతున్న పేలుళ్లకు చెరువు కట్ట ప్రమాదంలో పడే పరిస్థితి ఉందని గ్రామస్థులు వాపోతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. ఓ గుత్తేదారు చెరువు దడికి సమీపంలోని గుట్టల్లో అక్రమంగా మట్టిని తరలిస్తూ రహదారి నిర్మాణాలకు విచ్చలవిడిగా వినియోగిస్తున్నారు. ఈ గుట్టలో ఎవరికీ ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని ఓ పక్క అధికారులు చెబుతున్నా.. అక్రమ మట్టి తరలింపునకు మాత్రం అడ్డుకట్ట పడటం లేదు.