సరస్వతిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

సరస్వతిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ

విజయవాడ, అక్టోబరు 5, (way2newstv.com)
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిలోని కనక దుర్గమ్మ శనివారం సరస్వతిదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. నవరాత్రి ఉత్సవాల్లో మూలా నక్షత్రం రోజున చేసే ఈ అలంకారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. జ్ఞాన ప్రదాత సరస్వతీదేవి జన్మ నక్షత్రం మూల. నవరాత్రి ఉత్సవాల్లో ఏడోరోజున మూలా నక్షత్రం వస్తుంది. వాక్కు, బుద్ధి, విజ్ఞానం, కళలు... సకల విద్యలకు సరస్వతి అధిష్ఠాన దేవత.జగన్మాత చదువుల తల్లి సరస్వతీ రూపంలో దర్శనమిచ్చే రోజు. 
సరస్వతిగా దర్శనమిస్తున్న దుర్గమ్మ

బ్రహ్మ చైతన్య స్వరూపిణిగా సరస్వతీని పురాణాలు అభివర్ణించాయి. శ్వేతపద్మాన్ని ఆసనంగా అధిష్టించి, వీణ, దండ, కమండలం, అక్షమాల ధరించి, అభయముద్రతో భక్తుల అజ్ఞాన తిమిరాలను దూరం చేస్తుంది. త్రిశక్తి రూపాల్లో సరస్వతి మూడో శక్తి రూపం. సంగీత సాహిత్యాలకు అధిష్టాన దేవత. ఈ తల్లిని ఆరాధించడం వల్ల బుద్ధి వికాసం, విద్యాలాభం కలుగుతాయి.బుద్ధిని ప్రకాశించే మాతగా, విజ్ఞానదేవతగా శాస్త్రాలు పేర్కొన్నాయి. విద్య, వాక్కు, సంగీతం, నృత్యం వంటి కళలూ ఈ అమ్మ అనుగ్రహం వల్లే కలుగుతాయి. వ్యాసుడు, యాజ్ఞవల్క్యుడు, వాల్మీకి లాంటి ఎందరో మహర్షులు ఈ తల్లిని ప్రసన్నం చేసుకుని మహోన్నతమైన కావ్యాలను రచించారు.విద్య ఏదైనా సరస్వతీదేవి జ్ఞానానికి ప్రతీక. ప్రతి మనిషికీ ఈ అమ్మే జ్ఞానదేవత అనే సందేశాన్ని ఈ అవతారం అందిస్తుంది. ఈ రోజున నైవేద్యంగా పరమాన్నం, అల్లం గారెలు సమర్పిస్తారు.