గొర్రెలెక్కడ..? (ఆదిలాబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

గొర్రెలెక్కడ..? (ఆదిలాబాద్)

ఆదిలాబాద్, అక్టోబర్ 22 (way2newstv.com): 
గొల్ల, కుర్మ సామాజిక వర్గాల వారికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాయితీపై గొర్రెల పథకంతో కొందరికి మేలు జరిగింది. మరికొందరికి ఎదురుచూపులే మిగిలాయి. మొదటి విడత రాయితీ గొర్రెల పంపిణీ పూర్తయి ఏడాది గడిచినా రెండో విడత వారికి ఇంకా అందకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గొర్రెల కోసం డబ్బులు చెల్లించి నెలలు గడిచినా పథకం అమల్లో తీవ్ర జాప్యమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం 2017లో గొల్ల, కుర్మలకు ఉపాధి కల్పించి, ఆర్థికాభివృద్ధి కోసం రాయితీ గొర్రెల పథకాన్ని ప్రవేశపెట్టింది. రెండు విడతల్లో జీవాలు అందజేయాలని నిర్ణయించారు. జిల్లాలో మొదటి విడతలో 4,264 యూనిట్లు (యూనిట్‌లో 20 గొర్రెలు, ఒక పొట్టేలు) మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 2018లో మిగతా సగం మందికి అందజేస్తామని హామీ ఇచ్చారు. 
 గొర్రెలెక్కడ..? (ఆదిలాబాద్)

ఇందుకు చాలా మంది లబ్ధిదారులు భాగస్వామ్యంగా యూనిట్‌కు రూ.31,250 డీడీల రూపంలో డబ్బులు ఇచ్చి ఏడాది గడుస్తున్నా గొర్రెల పంపిణీ జరగడం లేదు. రెండో విడతలో 4,265 యూనిట్లు అందజేయాల్సి ఉండగా ఇప్పటివరకు ఒక్క యూనిట్‌ పంపిణీ చేయలేదు. వారు ఏడాదిగా నిరీక్షిస్తున్నారు.రెండో విడతలో జిల్లాలో ఎంత మందికి యూనిట్లు పంపిణీ చేయాలి? అందుకు అవసరమైన నగదు వివరాలతో సంబంధిత పశుసంవర్థక శాఖ నివేదికలు తయారు చేసి ఏడాది క్రితమే ప్రభుత్వానికి నివేదించింది. కొంతమంది లబ్ధిదారులు అప్పులు చేసి డీడీలు తీసి (216 మంది) అధికారులకు అందజేశారు. మరికొంత మంది లబ్ధిదారులు అధికారులు చెప్పినప్పుడు డీడీలు తీసేందుకని బయట అప్పు చేసి డబ్బులు సిద్ధంగా ఉంచుకున్నారు. అయితే ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవడంతో గొర్రెల పంపిణీ పథకం అర్ధంతరంగా నిలిచిపోయింది. జిల్లాలో చాలా మంది గొల్ల, కుర్మలు గొర్రెల పెంపకంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం రాయితీపై జీవాలను అందజేస్తోందని చెప్పడంతో పలువురు వడ్డీకి తెచ్చి, తమ వాటా చెల్లించారు. వారిపై ఏడాది కాలంగా వడ్డీ భారం పడుతోంది. అనుకున్న సమయానికి గొర్రెలు ఇస్తే ఇప్పటికే వాటి సంతతి పెరిగి, తమకు ఆదాయం వచ్చి, అప్పులు తీర్చేవాళ్లమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పథకం అమలులో జాప్యంతో వడ్డీ కట్టేందుకు మరో అప్పు చేయాల్సి వస్తోందని వాపోతున్నారు