ఏపీలో వామపక్షాలకు దారేదీ - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

ఏపీలో వామపక్షాలకు దారేదీ

విజయవాడ, అక్టోబరు 2, (way2newstv.com)
ఉనికి చాటుకోవడానికి నిత్యం ఏదో ఒక హడావుడి చేసే వామపక్ష నేతలు తమ పోరాటాలను సరైన పంథాలో సాగించలేక చతికిలపడుతున్నారు. జాతీయ స్థాయిలో వామపక్షలు కేంద్రంతో ఏమాత్రం ఢీకొట్టలేకపోతున్నప్పటికీ ఏపీలోని వామపక్ష నేతలు మాత్రం కేంద్రం ఆర్థిక వైఫల్యాలపై పోరాటమంటూ సిద్ధమవుతున్నారు. రాష్ట్రంలో ఉన్న అనేక సమస్యలను పక్కనపెట్టి వారు ఎక్కడో ఉన్న మోదీ ప్రభుత్వంపై దండయాత్రకు రెడీ అంటున్నారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలపై ఇప్పటికే టీడీపీ, జనసేనలు నిత్యం గళమెత్తుతుంటే.. వారితో కలిసి పోరాడడం మానేసి కేంద్రంలోని సమస్యల గోల వీరికెందుకంటూ సెటైర్లు పడుతున్నాయి.
ఏపీలో వామపక్షాలకు దారేదీ

కేంద్ర ప్రభుత్వ ఆర్థిక వైఫల్యాలను ఎండగడుతూ ఈనెల 10-16 తేదీల మధ్య రాష్ట్ర వ్యాప్త ప్రచార ఆందోళనలు చేపట్టాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. నిజానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చ అని చెబుతున్నా సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి గట్టిగా 5 నిమిషాలు కూడా చర్చించి లేదని సమాచారం. పూర్తిగా మోదీ ప్రభుత్వ విధానాలపైనే చర్చించారని తెలుస్తోంది.దేశంలో ఏర్పడిన ఆర్థిక మాంద్యం తీవ్రత ప్రజల జీవన స్థితిగతులను తీవ్రంగా దెబ్బతీస్తోందని.. వేతనాలు పడిపోతున్నాయని, నిరుద్యోగం పెరిగిపోతోందని, జాతీయ ఉత్పాదక రేటు దారుణంగా పడిపోతోందని, సామాన్య ప్రజల జీవన పరిస్థితులు ఛిద్రం అవుతున్నాయని, అయినప్పటికీ పాలకుల్లో కనీస స్పందన లేదని వామపక్ష నేతలు ఈ సమావేశంలో విమర్శలు కురిపించారు.ఈ నేపథ్యంలోనే తీవ్రమవుతున్న ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి సామాన్య, మధ్య తరగతి, కార్మిక, రైతు, నిరుద్యోగ యువకుల రక్షణకు సత్వర చర్యలు చేపట్టాలని కోరుతూ అక్టోబర్‌ 10 నుంచి16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార ఆందోళనా కార్యక్రమాలను చేపట్టాలని సమావేశం నిర్ణయించింది. అక్టోబర్‌ 13న విజయవాడలో రాష్ట్రస్థాయి సదస్సు జరపాలని, అక్టోబర్‌ 16న రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 నుంచి 12 గంటల వరకు ‘కూడలి’ ప్రాంతాలలో ‘రాస్తారోకో’లు నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి నిరసన తెలపాలని తీర్మానించింది.రాష్ట్రంలో తీవ్రస్థాయిలో ఉన్న విద్యుత్ కోతల అంశం కానీ, ఇసుక సమస్య కానీ, నియామకాల్లో అవకతవకలు, ఆశ కార్యకర్తల జీతాలు ఆగిపోవడం వంటి ఏ సమస్యనూ ఈ సమావేశంలో చర్చించలేదని వినిపిస్తోంది. ఏపీలో ఇన్ని సమస్యలు ఉండగా అవేమీ పట్టించుకోకుండా జాతీయ సమస్యల పేరుతో వామపక్ష నేతలు వైసీపీ ప్రభుత్వం పట్ల ఉదాసీనంగా ఉండడం వెనుక కారణమేంటన్న ప్రశ్న వినిపిస్తోంది.