విశాఖపట్టణం, అక్టోబరు 21, (way2newstv.com)
విశాఖపట్టణం జిల్లాలో సీసీ రోడ్ల నిర్మాణం కోసమే ప్రభుత్వ హయాంలో 2016 ఏప్రిల్ నెల నుంచి ఈ ఏడాది మార్చి వరకూ రూ.459 కోట్లు ఖర్చు చేశారు.ఐదేళ్లలో భారీగా నిధులిచ్చినా గ్రామాల్లో పరిస్థితి మారలేదని కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన శాంపిల్ సర్వే అద్దంపట్టడం గమనార్హం. ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు నిర్మించామని, ఇది తమ ఘనతని పాలకులు ప్రతి వేదికపైనా ఊదరగొట్టేవారు. వాస్తవానికి 30 శాతం వరకూ కమీషను మిగుల్చుకోవడానికి కేవలం సీసీ రోడ్లు మాత్రమే తూతూ మంత్రంగా వేసేశారు. కానీ ఇళ్ల మధ్య నుంచి మురుగునీరు పోవడానికి డ్రైనేజీ ఏర్పాటు చేయలేదు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరు చేసిన నిధుల్లో రూ.459 కోట్లు సీసీ రోడ్ల నిర్మాణానికే వెచ్చించారు. కానీ ఆ స్థాయిలో గ్రామాల్లో పారిశుద్ధ్య వ్యవస్థ మెరుగుపడలేదు.
తూతూ మంత్రంగా సీసీరోడ్ల నిర్మాణం
ఇవిగాక గత ఐదేళ్లలో 13వ ఆర్థిక సంఘం, 14వ ఆర్థిక సంఘం పేరుతోనూ గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులిచ్చింది. అవీ తూతూ మంత్రం గా నిర్మించడమే గాక, ఎక్కడా వాటి వెంబడి డ్రైనేజీ ఏర్పాటు చేయలేదు. దీంతో ఇళ్ల మధ్య మురుగునీరు ఎక్కడికక్కడ స్తంభించిపోతోంది. మురుగునీరు పోవడానికి కాలువలు లేకపోవడమే దీనికి ప్రధాన కారణం. ఫలితంగా అంటువ్యాధులు, రోగాలు ముసురుతున్నాయి. గత ముఖ్యమంత్రి చంద్రబాబు మానసపుత్రికలైన జన్మభూమి కమిటీల నిర్వాకంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు.పేదలైన కూలీలకు సొంత ఊరిలోనే పనులు కల్పిస్తూ మరోవైపు గ్రామంలో అవసరమైన మౌలిక వసతులు కల్పించుకోవాలని నిబంధనలు చెబుతున్నాయి. కానీ జన్మభూమి కమిటీల్లోని టీడీపీ కార్యకర్తలకు మాత్రం కాసుల కక్కుర్తే ప్రధాన ధ్యేయమైంది. చివరకు గ్రామ పంచాయతీల ప్రకారమే అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉన్నా తమకు కాసులు కురిపించే పనులనే చేయించారు. సీసీ రోడ్లలో 30 శాతం వరకూ కమీషన్లు రావడంతో వాటికే మొగ్గు చూపించారు. మురుగు కాలువల నిర్మాణాన్ని పట్టించుకోలేదు. కొన్ని గ్రామాల్లో టీడీపీ కార్యకర్తలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తడంతో ఎక్కడ పనులు చేశారో వారికే తెలియట్లేదు. టీడీపీ పెద్దల ఒత్తిళ్లతో కొంతమంది అధికారులు కూడా బిల్లులను ఆమోదించేశారు. ఫలితం ఇప్పుడు గ్రామాలు చాలా వరకూ పారిశుద్ధ్యలోపంతో సతమతమవుతున్నాయి. ప్రజలు డెంగీ, మలేరియా వంటి విషజ్వరాల బారినపడుతున్నారు.