నెల్లూరు, అక్టోబరు 11. (way2newstv.com)
ఏపీ అధికార పార్టీ వైసీపీలో అన్ని కులాలకు, మతాలకు కూడా సమానంగా ప్రాతినిధ్యం కల్పించారు. జగన్ కేబినెట్‌లో సైతం ఎవ్వరూ ఊహించని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపులకు పెద్ద పీట వేశారు. బడుగు, బలహీన వర్గాలకు చెందిన కులాల నాయకులకు ఎక్కువ మంత్రి పదవులు ఇవ్వడంతో జగన్ ఒక్కసారిగా దేశ రాజకీయాల్లోనే హైలెట్ అయ్యారు. ఇలా పార్టీ అధినేత జగన్ సంచలన నిర్ణయం తీసుకుని ముందుకు సాగుతున్నారు. అయితే, నెల్లూరులో మాత్రం పార్టీ రాజకీయాలు కుల రాజకీయాలను తలపిస్తున్నాయి. ఇక్కడ జగన్ సామాజిక వర్గానికి చెందిన నాయకులు.. ఓ మంత్రిని పూర్తిగా పక్కన పెడుతున్నారు. ఆయన మా కన్నా జూనియర్,.. పైగా మావాడు కాదు.. అనే ధోరణిని ప్రదర్శిస్తున్నారట. ఈ విషయం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో ఇంకా చెప్పాలంటే వైసీపీ వర్గాల్లోనే బాగా అల్లరి అల్లరి అవుతోంది.
నెల్లూరులో ఏమౌతోంది...
విషయంలోకి వెళ్తే.. వైసీపీలో కీలక నాయకుడిగా ఎదిగి, వరుసగా విజయాలు కైవసం చేసుకున్న యువనే త పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్. బీసీ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో జగన్ ఆయనకు ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు. పైగా వైఎస్ ఫ్యామిలీకి అంత్యంత ముఖ్యుడిగా మారిపోయారు. దీంతో జగన్ తన మంత్రి వర్గంలో తొలి దశలోనే అనిల్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, ఈయనకన్నా ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నవారు.. వైఎస్ ఫ్యామిలీకి దగ్గరైన వారు కొందరు అనిల్‌కు మంత్రి పదవి ఇవ్వడాన్ని సహించలేక పోతున్నారు.జిల్లాలో గత కొన్నేళ్లుగా పార్టీ ఏదైనప్పటకి రెడ్డి సామాజికవర్గ ఆధిపత్యమే నడుస్తూ ఉంటుంది. గతంలో టీడీపీ నుంచి ఇద్దరు, ముగ్గురు కమ్మ ఎమ్మెల్యేలు ఉన్నా వారంతా నామ్‌కే వాస్తేగానే ఉండేవారు. టీడీపీ అధికారంలో ఉన్నా.. కాంగ్రెస్ అయినా.. ఇప్పుడు వైసీపీ అయినా జిల్లా పెత్తనం మాత్రం రెడ్లదే. టీడీపీలో సోమిరెడ్డి సుదీర్ఘకాలం హవా చెలాయిస్తే… కాంగ్రెస్ అధికారంలో ఉన్న పదేళ్లలో ఆనం సోదరుల హవానే నడిచింది. ఇక టీడీపీ గెలిచాక కాపు వర్గానికి చెందిన నారాయణకు మంత్రి పదవి ఇస్తేనే అప్పట్లో చాలా మంది సహించలేకపోయారు. చివరకు సోమిరెడ్డి మంత్రి అయ్యాక మళ్లీ రెడ్ల హవా స్టార్ట్ అయ్యింది.ఇక ఇప్పుడు తమ కోటలో అనిల్‌కు మంత్రి పదవి ఇవ్వడం.. యువకుడు అయిన అనిల్ జగన్‌కు అత్యంత ఇష్టుడు కావడంతో అనిల్ దూసుకుపోతుండడంలో ఆ వర్గంలో చాలా మందికి నచ్చడం లేదు. అంతేకాదు, అనిల్ కుమార్‌పై వాళ్లు పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తమకు ఏమైనా పనులు అవసరమైతే.. నేరుగా మంత్రిని కలవడం కూడా మానేశారు. మంత్రిని వదిలేసి.. తమకు కావాల్సిన వారితో పనులు చేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇదే జిల్లాకు చెందిన మరో మంత్రి మేకపాటి గౌతంరెడ్డిని లేదా పక్క జిల్లాలోని రెడ్డి వర్గానికి చెందిన జగన్ బంధువును కలిసి తమ పనులు చేయించుకుంటున్నారని నెల్లూరు సిటీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్‌ను వ్యతిరేకిస్తున్న వారు ఓ కూటమి కట్టారని.. అంటున్నారు., మరి ఈ విషయంలో అనిల్ ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:
political news