రోజు రోజుకు పెరుగుతున్న ఉల్లి కష్టాలు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

రోజు రోజుకు పెరుగుతున్న ఉల్లి కష్టాలు

కర్నూలు, అక్టోబరు 10, (way2newstv.com)
కర్నూలు జిల్లాలో ఉల్లి రైతుల కష్టాలు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఉల్లి దిగుబడులను మార్కెట్‌కు తీసుకురావద్దని మార్కెట్‌ అధికారులు చెబుతున్నారు. పొలాల్లో కోత కోసిన ఉల్లికి మార్కెట్‌ లేకపోవడంతో రైతులు పంటపొలాల్లోనే గుట్టలుగుట్టలుగా నిల్వ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మార్కెట్‌కు భారీగా ఉల్లి మొత్తాన్ని కొనుగోలు చేయలేమని వ్యాపారులు చేత్తులెత్తేశారు. దీంతో మార్కెటింగ్‌ శాఖ అధికారులు మార్కెట్‌కు వచ్చే ఉల్లిని నియంత్రించడం మొదలుపెట్టారు. మార్కెట్‌లో వ్యాపారులు చెప్పిందే వేదంగా ఉండడంతో ధర కూడా ఇష్టారాజ్యంగా నడుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో కిలో ఉల్లి రూ.15 నుంచి 20 ఉండగా మార్కెట్‌యార్డులో రైతులకు కిలో రూ.3 కూడా దక్కడం లేదు. 
రోజు రోజుకు పెరుగుతున్న ఉల్లి కష్టాలు

గత వారం రోజులుగా ఉల్లి ధర కర్నూలు వ్యవసాయ మార్కెట్‌లో అమాంతంగా పడిపోవడంతో రైతులు దిక్కుతోచని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలోనే కర్నూలు జిల్లాలో ఉల్లిని అత్యధికంగా సాగు చేస్తారు. ఖరీఫ్‌, రబీ కలిపి జిల్లాలో దాదాపు 56 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతుంది. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో 50 వేల ఎకరాల్లో ఉల్లిని సాగు చేశారు. ఎకరాకు రూ.50 నుంచి 60 వేల దాకా పెట్టుబడి అవుతుంది. అదే కౌలు రైతు మరో రూ.20 వేలు అదనంగా పెట్టాలి. వాతావరణం బాగా అనుకూలిస్తే ఎకరాకు 80 నుంచి 100 క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తుంది. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల ఎకరాకు 50 క్వింటాళ్లు కూడా రాలేదు. మార్కెట్‌లో క్వింటా రూ.1500 వస్తేకాని రైతులకు గిట్టుబాటు కాదు. దిగుబడులు తగ్గిపోవడం, మార్కెట్‌లో ధర అమాంతంగా పడిపోవడంతో రైతులు భారీ ఎత్తున నష్టాలను మూటగట్టుకుంటున్నారు. కర్నూలు జిల్లాకంతా కలిపి కేవలం కర్నూలు వ్యవసాయయార్డులోనే ఉల్లి కొనుగోళ్లు చేస్తారు. కేవలం ఒకే మార్కెట్‌లో ఉల్లి క్రయవిక్రాయలు ఉండడంతో వ్యాపారులు ఆడిందే ఆట పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం ఉల్లి ధరలు తగ్గినప్పుడు మార్క్‌ఫెడ్‌, సివిల్‌ సప్లై లాంటి సంస్థలు కొనుగోలు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం తక్షణం మార్క్‌ఫెడ్‌ ద్వారా ఉల్లి కొనుగోళ్లను ప్రారంభింపజేయాలని రైతులు కోరుతున్నారు