హైద్రాబాద్, అక్టోబరు 12, (way2newstv.com)
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె ఎనిమిదో రోజు కొనసాగుతుండగా, తెలంగాణ వ్యాప్తంగా ప్రజా రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇక, హైదరాబాద్ నగరవాసులు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. సమ్మెను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో రైల్ అదనంగా సర్వీసులను నడుపుతోంది. గతంలో ఎనిమిది నిమిషాలకు ఒకటి చొప్పున నడిపే మెట్రోను ప్రస్తుతం ప్రతి మూడు నుంచి ఐదు నిమిషాలకు నడుపుతున్నారు. దీని వల్ల రాజధాని వాసులకు కాస్త ఉపశమనం కలుగుతోంది. అయితే, శనివారం ఉదయం అమీర్‌పేట్- నాగోల్ మార్గంలో మెట్రో సర్వీసులో సాంకేతికలోపం తలెత్తడంతో ప్యారడైజ్ వద్ద రైలు నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు.
నిలిచిన మెట్రో..ప్రయాణికుల అవస్థలు
స్టేషన్‌లో మెట్రో ఆగిపోవడంతో అటువైపుగా వెళ్లే సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉదయం 10.30 ప్రాంతంలో ప్యారడైజ్ స్టేషన్ వద్ద రైలు నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యాన్ని చేరుకోడానికి ప్రయాణికులు ప్రయత్నించారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మెట్రో మెరాయించడానికి గల కారణాలను వెల్లడించడానికి సిబ్బంది నిరాకరించారు.మరోవైపు, ఆర్టీసీ డిపోల దగ్గర కుటుంబ సభ్యులతో కలిసి కార్మికులు మౌన ప్రదర్శన నిర్వహించారు. బస్‌భవన్ దగ్గర ఆందోళనకు సిద్ధమైన కార్మికులకు పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినా, కార్మికులు ఆందోళనకు సిద్ధమవడంతో బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
Tags:
telangananews