శ్రీకాకుళం, అక్టోబర్ 31, (way2newstv.com)
తెలుగుదేశం పార్టీని అంతా ప్రాంతీయ పార్టీ అంటారు. కానీ చంద్రబాబు మాత్రం తాను జాతీయ అధ్యక్షుడిని అని చెప్పుకుంటారు. తన పార్టీ జాతీయ పార్టీ, మోడీకి, బీజేపీకి ఏం తక్కువ కాదని ఎన్నికల ముందు వరకూ ఆయన గట్టిగానే వాదించారు. సరే ఇపుడు ఎన్నికలు ముగిసిన తరువాత చూసుకుంటే ఏపీలోనే టీడీపీ కుదేలైపోయింది. ఇక తెలంగాణాలో చూసుకుంటే తాజాగా జరిగిన హుజూర్ నగర్ ఉప ఎన్నిక టీడీపీ ప్లేస్ ఏంటో చెప్పేసింది. మరి ఇంత భాగ్యానికి జాతీయ పార్టీ అనుకుంటే ఎలా అని ఎవరైనా అడగవచ్చు, కానీ అది చంద్రబాబు గారి ఇష్టం. ఎన్నికల సంఘం వద్ద మాత్రం టీడీపీ ప్రాంతీయ పార్టీనే. మరి ఆ పార్టీకి ఏపీ, తెలంగాణాలో ఇద్దరు అధ్యక్షులు కూడా ఉన్నారు.
ఉనికి కోసం కళా తాపత్రయం
ఏపీ ప్రెసిడెంట్ గా ఉన్న కళా వెంకటరావు పేరుకు మాత్రమేనని ఆయనకూ తెలుసు. అందుకే చంద్రబాబు పక్కన నిలబడి ఫోటోలకే పరిమితమవుతున్నారని తమ్ముళ్లే ఎకసెక్కం ఆడతారు.ఆయన ఇంటి పేరు కళా. కానీ ఆయన రాజకీయంలో మాత్రం ఆ కళ ఎక్కడా కనిపించడంలేదని అంటున్నారు. ఆయన అన్న గారి టైం నుంచి టీడీపీలో కొనసాగుతున్నారు. చంద్రబాబుకు కూడా నమ్మినబంటుగా ఉంటూ వచ్చారు. దానికి ప్రతిగానే ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్ళి వచ్చినా కూడా చంద్రబాబు సమాదరించారు. మంత్రిని చేశారు. ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ ని చేశారు. ఏది చేసినా కళా మార్క్ మాత్రం లేదు. ఆయన పట్టు ఎక్కడా కనిపించదు అంటారు. చంద్రబాబు, లోకేష్ లకు విధేయత చూపిస్తే చాలు తన రాజకీయం సజావుగా సాగిపోతుందని భావించే కళా తాజా ఎన్నికల్లో ఓటమిపాలు అయ్యారు. తాను ప్రాతినిధ్యం వహించే సీటునే ఆయన కోల్పోయారు. మరి కనీసం ఏపీ ప్రెసిడెంట్ గానైనా ఆయన పనిచేస్తున్నారా అంటే అది డౌటే. ఆయనకు ఏం చేయాలో కూడా చంద్రబాబు ఎపుడూ చెప్పలేదు కాబోలు. పైగా చంద్రబాబు జిల్లా ప్రెసిడెంట్ నుంచి జాతీయ అధ్యక్షుడి దాకా అన్ని బాధ్యతలు మోసేస్తుంటారు. దాంతో కళా వారికి పనులు లేవంటే లేవు.ఇపుడు కళా తన ఉనికి నిరూపించుకోవాలి. అందుకే ఆయన ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అన్న లెటర్ ప్యాడ్ మీద లేఖలు రాస్తున్నారు. ఆయన ఏపీ సీఎం జగన్ కి బహిరంగ లేఖలు రాస్తూ తాను ఉనికిలో ఉన్నాననిపించుకుంటున్నారు. ఇంట్లో ఈగల మోత అన్నట్లుగా శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ పడకేసింది. పార్టీలో గ్రూపుల పోరు ఒక్కలా లేదు, మరో వైపు పార్టీలో ఉన్న నాయకుల మధ్య ఐకమత్యం లేదు. ఇలా చితికిపోయి చతికిలపడిన పార్టీని వదిలేసి జగన్ మీద బాణాలు వేయడానికి మాత్రం కళా వారు ఉత్సాహం చూపించడమే అసలైన కొస మెరుపు. మరి చంద్రబాబు ఆయన్ని ఏపీ ప్రెసిడెంట్ గా గుర్తించడం లేదు. జగన్ గుర్తిస్తాడా అన్నది లేఖలు రాసిన ఈ సీనియర్ మోస్ట్ నేతకే తెలియాలి. సిక్కోలు రాజకీయాల్లో నాలుగు దశాబ్దాల రాజకీయం పూర్తి చేసుకున్న కళా ఇపుడు పార్టీకి ఏం చేయగలరన్నదే తమ్ముళ్లు అడుగుతున్న ప్రశ్నలు