డబ్బులు ఊరికే పోవు - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

డబ్బులు ఊరికే పోవు

తిరుచ్చి, అక్టోబరు 3 (way2newstv.com)
లలితా జ్యూయలరీ షోరూమ్‌లో దొంగలు పడ్డారు. షోరూమ్‌ వెనుక వైపు గోడకు కన్నం వేసి.. ముఖాలకు జంతువుల మాస్క్‌లు పెట్టుకొని త్రినేత్రాల కన్ను కప్పి లోపల బాక్సుల్లో ఉంచిన బంగారం, వజ్రాలు మూటగట్టుకొన్నారు. ఇంతా చేసి వీళ్లు ఇద్దరు.. ఈ ఇద్దరూ మొత్తం రెండు గంటల్లో రూ. 13 కోట్ల విలువైన ఆభరణాలు సర్దుకుని ఉడాయించారు.తమిళనాడులోని తిరుచ్చిలోని లలిత జ్యూయలరీ షోరూమ్‌లో ఈ దొంగతనం జరిగింది. తమిళనాడులో ఈ మధ్యకాలంలో జరిగిన అతి పెద్ద చోరీ ఇదేనని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. తిరుచ్చి సత్రం బస్టాండు సమీపంలో ఉన్న ఈ లలిత జువెలరీ షోరూమ్‌ని రోజూలాగానే బుధవారం ఉదయం తెరిచారు. షోరూమ్‌ లోపల ఖాళీగా ఆభరణ బాక్సులు కనిపించేసరికి సిబ్బంది నిర్ఘాంతపోయారు. 
డబ్బులు ఊరికే పోవు

తన షోరూమ్‌లో దొంగలు పడ్డారని తెలిసిన వెంటనే లలితా జ్యూయలరీ అధినేత కిరణ్‌కుమార్‌ తిరుచ్చి వచ్చి షోరూమ్‌ను మొత్తం పరిశీలించారు. బంగారు నగలతోపాటు వజ్రాలు, ప్లాటినంతో తయారుచేసిన ఆభరణాలు చోరీకి గురయినట్టు గుర్తించి పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. తిరుచ్చి సిటీ జాయింట్‌ పోలీసు కమిషనర్‌ మయిల్‌వాహనన్‌ సారథ్యంలో పోలీసుల బృందం విచారణ చేపట్టింది. ఆధారాల కోసం ఫోర్సెన్సిక్‌ నిపుణులు చోరీ జరిగిన ప్రాంతంలో క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. పరిసర ప్రాంతాల్లో జాగిలాలతో తనిఖీ చేశారు. షోరూమ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తే తెల్లవారుజామున ఈ దొంగతనం జరిగిన్టటు, అందులో ఇద్దరు పాల్గొన్నట్టు గుర్తించారు. దొంగలు చాలా తెలివిగా వ్యవహరించారని, ఎక్కడా చేతి వేలిముద్రలు దొరకకుండా జాగ్రత్తపడ్డారని పోలీసులు చెబుతున్నారు.స్టేట్ మొత్తాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఈ ఘటనలో దొంగల్ని పట్టుకునేందుకు ఏడు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటయ్యాయి. దోచుకున్న నగలను ఏ మార్గంలో తరలించారన్న విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. షోరూమ్‌లో పనిచేస్తున్న 160 మందికిపైగా సిబ్బందిని పిలిపించి విచారణ జరుపుతున్నారు. లోగడ కూడా తిరుచ్చిలో పంజాబ్ నేషనల్ బ్యాంక్‌ను ఇదే పద్దతిలో దోచుకున్నారు. లాకర్‌లో వున్న ఐదు కోట్ల రూపాయిల్ని దొంగలు దోచుకెళ్లారు.