పంట పండింది.. (నిజామబాద్) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

పంట పండింది.. (నిజామబాద్)

నిజామాబాద్, అక్టోబర్ 26 (way2newstv.com): 
సీజన్‌లో దొడ్డు రకం వరి సాగు చేసిన రైతులకు లాభాల పంట పండింది. ప్రభుత్వం ప్రకటించిన ధర కంటే ప్రైవేటు మిల్లర్లు అధికంగా చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. పక్షం రోజుల నుంచి మిర్యాలగూడకు చెందిన మిల్లర్ల మధ్యవర్తులు ధాన్యాన్ని సేకరిస్తున్నారు. నిత్యం వందలాది లారీల్లో తరలిస్తున్నారు. ధర లాభసాటిగా ఉండడంతో కర్షకులు పచ్చి ధాన్యాన్ని కోయించి అమ్మకాలు ముగిస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల్లో ఇదే సందడి కనిపిస్తోంది. వరి సాగులో 40 శాతం దొడ్డు రకం ఉంది. ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ధ్యానంలో తేమ 17 శాతమే అనుమతిస్తారు. ఇందుకోసం రైతులు రోజుల తరబడి ఆరబెట్టాలి. వర్షం పడితే నష్టం కలుగుతుంది. మిర్యాలగూడ మిల్లర్లు ఆరబెట్టని పచ్చిధాన్యాన్ని మూడు కిలోల తరుగుతో క్వింటా ధర రూ.1,750 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. 
 పంట పండింది.. (నిజామబాద్)

ఇందులో 33 శాతం తేమ ఉంటుంది. 17 శాతానికి తేవడానికి క్వింటాకు గరిష్ఠంగా 15 కిలోల తూకం తేడా వస్తుంది. ఈ లెక్కన సర్కారు ధరతో పోలిస్తే ప్రైవేటు ధర క్వింటాకు సుమారు రూ.2,097 వస్తోంది. ఆరబెట్టే పనిలేకుండా కోతలు ముగియగానే కొనుగోలు చేస్తుండటంతో రైతులు మొగ్గు చూపుతున్నారు. కాగా ఇప్పటి వరకు ప్రారంభించిన సర్కారు కేంద్రాల్లో దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లు జరగకపోవడం గమనార్హం.ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌ వాతావరణం రైతులకు మేలు చేసింది. వర్షాకాలం ఆరంభంలో పరిస్థితులు ప్రతిబంధకంగా కనిపించాయి. ఒక దశలో సీజన్‌పై నమ్మకం కోల్పోయారు. జులై ఆఖరు నుంచి మొదలైన వర్షాలు వరి సాగు విస్తీర్ణాన్ని పెంచేలా చేశాయి. క్రిమిసంహారక మందులు, యూరియా ఖర్చులు తగ్గేలా సీజన్‌ సహకరించింది. దిగుబడి కూడా ఎకరాకు 45 బస్తాల చొప్పున నమోదవుతోంది. ఉమ్మడి జిల్లాలో 3.10 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. నిజామాబాద్‌ జిల్లాలో 2.08 లక్షల ఎకరాల్లో వేశారు. 14 లక్షల మెట్రిక్‌ టన్నుల దిగుబడి అంచనాలు ఉన్నాయి. అందులో ఇందూరు వాటా సుమారు 9.38 లక్షల మెట్రిక్‌ టన్నులు ఉండనుంది.