కార్డుతో తిప్పలు (గుంటూరు) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కార్డుతో తిప్పలు (గుంటూరు)

గుంటూరు, అక్టోబర్ 15 (way2newstv.com): 
ప్రభుత్వం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలకు రేషన్‌కార్డు ఆధారంగా కుటుంబం యూనిట్‌గా గుర్తిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారి వివరాలు తొలగించి కొత్తకార్డు తీసుకోవడానికి కొన్నాళ్లుగా అవకాశం లేకపోవడంతో లబ్ధిదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వ పథకాలకు అర్హత ఉన్నా సాంకేతికంగా కార్డు నుంచి విడిపోయి కొత్త కార్డు తీసుకోకపోవడంతో అనర్హులవుతున్నారు. గత 40 రోజుల నుంచి కార్డుల్లో మార్పులు, చేర్పులు, బదిలీలకు అవకాశం లేకపోవడంతో లబ్ధిదారులు సంక్షేమ పథకాలకు దూరమవుతున్నారు. ఇందుకు సంబంధించిన సేవలు మీసేవ కేంద్రంలో అందుబాటులో లేకపోవడంతో ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. 
కార్డుతో తిప్పలు (గుంటూరు)

పౌరసరఫరాల సంస్థ అధికారులు కూడా ఎప్పుడు సేవలు అందుబాటులోకి వస్తాయో చెప్పలేకపోవడంతో లబ్ధిదారులు అష్టకష్టాలు పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సేవలు ఆగినందున ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుని అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంది. ఇప్పటి వరకు పిల్లలను పాఠశాలలో చేర్చుకోవడానికి ఆధార్‌ కార్డు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తుండటంతో చాలామంది పిల్లల పేర్లు రేషన్‌కార్డులో నమోదు చేయించలేదు. ప్రస్తుతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న పిల్లల పేర్లు రేషన్‌కార్డులో నమోదైతేనే అమ్మఒడి పథకానికి అర్హులవుతారు. వివిధ కారణాలతో ఇప్పటి వరకు కార్డులో పిల్లల పేర్లు నమోదు చేయించుకోని వారు ఇప్పుడు మీసేవ కేంద్రాలకు వెళ్తున్నారు. మీసేవ కేంద్రాల నిర్వాహకులు సేవలు నిలిపివేశారని చెప్పడంతో రెవెన్యూ కార్యాలయాలకు వెళ్తున్నారు. రేషన్‌ కార్డులు పౌరసరఫరాల సంస్థ జారీచేసినందున అక్కడికి వెళ్లాలని సూచిస్తున్నారు. కార్డుదారులకు ఎక్కడా సరైన సమాధానం లభించకపోవడం, సేవలు ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో తెలియక అష్టకష్టాలు పడుతున్నారు.అమ్మఒడి పథకం జనవరి నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించినందున పిల్లల పేర్లు చేర్చుకోవడానికి లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సేవలు పునరుద్ధరించని పక్షంలో రేషన్‌కార్డు యూనిట్‌గా పథకం అమలు చేస్తున్నందున అర్హత కోల్పోయే ప్రమాదం ఉంది. రేషన్‌కార్డులో పిల్లల పేర్లు నమోదు చేయనందున ఆరోగ్యశ్రీకి అర్హత కోల్పోతున్నారు. పిల్లల పేర్లు లేనందున నెల వారీగా ఆ మేరకు సరకులను కార్డుదారులు కోల్పోతున్నారు. ప్రభుత్వం వివిధ పథకాల కింద అందిస్తున్న పోషకాహారం పొందడంలోనూ కొన్ని ఇబ్బందులున్నాయి. రేషన్‌కార్డు బదిలీలు అనుమతించనందున ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు బదిలీ అయినవారు ఇబ్బందులు పడుతున్నారు. రేషన్‌కార్డు ఎక్కడుంటే అక్కడే ఇంటి స్థలానికి దరఖాస్తు చేసుకోవాల్సి రావడంతో ఇబ్బంది పడుతున్నారు. కార్డులో పేర్లు తొలగించే సేవలు లేనందు వల్ల అప్పటికే ఉన్న కార్డు నుంచి విడిపోయి కొత్తకార్డు పొందడానికి వెసులుబాటు లేకుండా పోయింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలకు రేషన్‌కార్డు ప్రామాణికంగా తీసుకోవడంతో అర్హత ఉన్నా కార్డులో నమోదుకాని వారు పథకాలకు అనర్హులవుతున్నారు.