విశాఖపట్టణం, అక్టోబరు 11, (way2newstv.com)
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయ చాణక్యం ఆయనకు తప్ప ఎవరికీ అర్ధం కాదు. అన్నీ సర్దుకుని కండువా మార్చేంతవరకూ పార్టీ మారినట్లు కాదని స్వయంగా ఆయనే చెప్పుకున్నారు. వైసీపీ, బీజేపీ అంటూ ఇన్నాళ్ళు ప్రచారం జోరుగా సాగినా మౌనం వహించిన గంటాశ్రీనివాసరావు ఇపుడు తాను టీడీపీలోనే ఉన్నానంటూ ఒక్కసారిగా ప్లేట్ ఫిరాయించారు. గంటా ఇలా అడ్డం తిరగడంతో టీడీపీలో సంతోషం కంటే షాకింగే ఎక్కువగా కనిపిస్తోంది. గంటా శ్రీనివాసరావు పార్టీ మార్పు ఖాయమనుకున్నా తమ్ముళ్లకు ఇపుడు గంటా ఇచ్చిన బిగ్ ట్విస్ట్ తో మతిపోయినంత పనైంది. గంటా నిజంగా టీడీపీలోనే ఉన్నారా, ఇకపై కూడా ఉంటారా అన్నది ఇపుడు పెద్ద చర్చగా ఉంది.
గంటాకు డోర్లు క్లోజ్ అయ్యాయా...
గంటా శ్రీనివాసరావు ఇపుడు ఒక్కసారిగా గొంతు కూడా మార్చేశారు. వైసీపీది నియంత పాలన అంటూ ఆయన విరుచుకుపడుతున్నారు. అయిదు నెలల వైసీపీ పాలనలో ప్రజా వ్యతిరేకత వెల్లువలా ఉందని ఆయన అంటున్నారు. ప్రజలు ఇసుక కొరతతో నానా అవస్థలు పడుతున్నారని, టీడీపీ అమలు చేసిన అనేక విధానాలను రద్దు చేయడమే తప్ప అభివ్రుధ్ధి ఎక్కడిది అంటూ గంటా శ్రీనివాసరావు నిలదీస్తున్నారు. ఇక అంతటిలో వూరుకోకుండా జగన్ గాలి ఎక్కడ వీచినా విశాఖలో వీచకుండా తాము అడ్డుకున్నామని ఘనంగా చెప్పుకున్నారు. వరసగా నలుగురు సిటీ ఎమ్మెల్యేలు గెలవడం టీడీపీ ఘనవిజయం అని ఆయన అన్నారు. రానున్న జీవీఎంసీ ఎన్నికల్లోనూ, అలాగే జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ టీడీపీ గొప్ప విజయం ఖాయమని గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. మొత్తానికి వైసీపీకి వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు గొంతు సవరించుకోవడం ఒకింత ఆశ్చర్యంగా ఉన్నా దీని వెనెకాల కూడా ఏదైనా వ్యూహం ఉందా అన్న చర్చ సాగుతోంది.ఇదిలా ఉండగా గంటా శ్రీనివాసరావు టీడీపీలోనే ఉండిపోవడం వెనక అసలు గుట్టు వేరే ఉందని సొంత పార్టీలో ఆయన వైరి వర్గం ప్రచారం చేస్తోంది. వైసీపీలో గంటా శ్రీనివాసరావును తీసుకోలేదని, ఆయన షరతులకు జగన్ ఒప్పుకోలేదని కూడా చెప్పుకుంటున్నారు. గంటా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే ఉన్న ఆ సీటు కూడా కోల్పోతారు తప్ప జగన్ ఏమీ ఇవ్వరని కూడా అంటున్నారు. దాంతోనే జగన్ అక్కడ డోర్స్ క్లోజ్ చేయడంతోనే మళ్లీ టీడీపీయే గతి అయిందంటున్నారు. మొత్తానికి గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉంటానని సంకేతాలు ఇచ్చినా కూడా ఈ ముచ్చట ఎన్నాళ్ళు అన్న మాట కూడా టీడీపీ నుంచే వినిపిస్తోంది. చూడాలి మరి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అసలైన రాజకీయం.