మోడల్ కాలేజీలగా మార్పులకు శ్రీకారం - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

మోడల్ కాలేజీలగా మార్పులకు శ్రీకారం

కడప, అక్టోబరు 4, (way2newstv.com)
రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ మీడియట్ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక జూనియర్ కాలేజీని ఎంపిక చేసుకుని మోడల్ కాలేజీగా తీర్చిదిద్దడానికి చర్యలు చేపట్టినట్లు కడప ఆర్‌జేడీ కరణం చంద్రశేఖరరావు తెలిపారు. ఇందులో భాగంగా రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాల్లో 52 కాలేజీలను ఎంపిక చేశామన్నారు. వీటిలో వౌలిక సదుపాయాలతో పాటు బోధన, బోధనేత సిబ్బంది నియామకం, ల్యాబ్ సౌకర్యం వంటి అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. బుధవారం ఆయన ఆంధ్రభూమితో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఇంటర్ విద్య విభాగం కమిషనర్ వీ.రామకృష్ణ ఆధ్వర్యంలో జూనియర్ కాలేజీలను బలోపేతం చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. 
మోడల్ కాలేజీలగా మార్పులకు శ్రీకారం

సెప్టెంబర్ 27న రాజధానిలో జరిగిన ఆర్‌జేడీల సమావేశంలో కమిషనర్ జూనియర్ కాలేజీల పురోగతిపై సుదీర్ఘంగా చర్చించారన్నారు. ఈక్రమంలో ఎంపిక చేసిన మోడల్ కాలేజీల్లో 2019-20 విద్యా సంవత్సరాంతానికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య, సెక్షన్ల సంఖ్య ప్రాతిపదికగా మోడల్ కాలేజీలను ఎంపిక చేశామన్నారు. గతంలో, తర్వాత కాలేజీల పరిస్థితిని ప్రతిబింబించేలా ప్రస్తుత పరిస్థితి, సౌకర్యాలు మెరుగుపర్చాక మారిన రూపురేఖలను తెలిపేలా ఫొటోలను కూడా ఎస్‌ఎస్‌ఏ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉందన్నారు. వచ్చే ఏడాది కూడా ఇదేతరహాలో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి మరో కాలేజీని ఎంపిక చేసుకుని దశల వారీగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సంకల్పించామన్నారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యాభివృద్ధికి రూ.33 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయించిందని చంద్రశేఖర్‌రావు తెలిపారు. ఈ నిధుల్లో ప్రధానంగా జూనియర్ కాలేజీల్లో వౌలిక వసతులు మెరుగు పర్చడం, సౌకర్యాలు కల్పిస్తామన్నారు. సర్వశిక్ష అభియాన్ ద్వారా ఎంపికైన మోడల్ కాలేజీకి కావాల్సిన సౌకర్యాలపై నివేదిక తెప్పించుకుని డీపీఆర్ రూపొందించి నాబార్డు ఆమోదం పొందాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 2వేల జూనియర్ కాలేజీ లెక్చరర్ల పోస్టులకు గానూ 750 మంది మాత్రమే రెగ్యులర్ లెక్చరర్లు పని చేస్తున్నారన్నారు. వీరి నియామకానికి సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోనుందన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో 6 జూనియర్ కాలేజీలను మోడల్ కాలేజీలుగా తీర్చిదిద్దడానికి ఎంపిక చేశామన్నారు. వాటిలో లింగాల, వేముల, చక్రాయపేట, తొండూరు, పులివెందుల అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలో రెండు కాలేజీలు ఉన్నాయని, వీటిలో ఒక బాలికల జూనియర్ కాలేజీ ఉందన్నారు. వీటన్నింటిలో వౌలిక సదుపాయాల కల్పనకు రూ.8 కోట్లు ప్రభుత్వం మంజూరు చేసిందని ఆర్‌జేడీ వెల్లడించారు. అలాగే వేంపల్లెలో ఉర్దూ జూనియర్ కాలేజీ మంజూరైందన్నారు. అలాగే బలపనూరుకు జనరల్ జూనియర్ కాలేజీ మంజూరైందన్నారు. ఈ రెండు కాలేజీలు వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం కానున్నాయన్నారు.