కాసులు మిగిల్చిన వర్షాలు (కడప) - Way2News TV - Breaking News, Latest News, Politics News, Business News

Hot

కాసులు మిగిల్చిన వర్షాలు (కడప)

కడప, అక్టోబర్ 21 (way2newstv.com): 
భారీ వర్షాలు జిల్లాకు ప్రజాధనాన్ని ఆదా చేశాయి. తీవ్ర వర్షాభావంతో గ్రామాలకు ట్యాంకర్లతో తాగునీటిని రవాణా చేసే భారం తగ్గిందని గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. కాలమేదైనా జిల్లాలోని పలు మండలాల్లో ప్రజలు తాగునీటి ట్యాంకరు కోసం ఎదురుచూసేవారు. పశువులు, జీవాలున్న వారైతే సుదూర ప్రాంతాలకు వెళ్లి ట్రాక్టర్లు, ఆటోలు, ఎడ్లబండ్లపై డ్రమ్ములను పెట్టుకుని నీటిని తెచ్చుకునేవారు. ప్రభుత్వం ఈ ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేసేది. ఆ జలం చాలక కొందరు ప్రైవేటుగా కొనుగోళ్లు చేసేవారు. వ్యవసాయ బావుల వద్దకెళ్లి తెచ్చుకునేవారు. ప్రభుత్వం ట్యాంకరు, వ్యవసాయ బావుల యజమానికి డబ్బులు గ్రామీణులకు తాగునీటిని సరఫరా చేస్తోంది. రెండు నెలలుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో భూగర్భజల మట్టం పెరిగి బోర్లలో నీరు పుష్కలంగా లభ్యమవుతోంది. తాగునీటి రవాణా భారం తగ్గింది. 
కాసులు మిగిల్చిన వర్షాలు (కడప)

జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా 2018 ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు జిల్లా గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేస్తోంది. వర్షాలు రాకముందు జిల్లాలో ప్రతిరోజూ 3,094 ట్యాంకర్ల నీటిని వ్యవసాయ బోర్ల నుంచి గ్రామాలకు సరఫరా చేసేది. ప్రభుత్వంపై నెలకు రూ.5.06 కోట్ల భారం పడేది. ప్రస్తుతం వర్షాల రాకతో తాగునీటి సరఫరా అవసరం తగ్గింది. ఇప్పుడున్న ట్యాంకర్లకు రూ.2.07 కోట్ల వ్యయమవుతోంది. గతంతో పోల్చితే ప్రతినెలా ప్రభుత్వానికి రూ.2.67 కోట్లు ఆదా అవుతోంది. వ్యవసాయ బావుల ద్వారా నీరు అందించేవారు. రోజుకు అద్దె రూపంలో రైతుకు రూ.250 చెల్లిస్తున్నారు. ఇలా గతంలో నెలకు రూ.15 లక్షలు వరకు అద్దె చెల్లించేవారు. ప్రస్తుతం ఆ మొత్తం నెలకు రూ.5 లక్షలకు తగ్గిపోయింది. కొన్ని మండలాల్లో వర్షాలు కురిసినా నీరు భూమిలోకి ఇంకక పోవడంతో తాగునీటి సరఫరా కొనసాగిస్తున్నారు. వర్షాలు మరింతగా కురిస్తే తాగునీటి సరఫరా చేసే గ్రామాల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని యంత్రాంగం భావిస్తోంది. రెండేళ్లలో తాగునీటి సరఫరా కోసం ప్రభుత్వ ఖజానాపై దాదాపు రూ.40 కోట్ల భారం పడింది. బి.కోడూరు, బి.మఠం, బద్వేలు, చింతకొమ్మదిన్నె, చక్రాయపేట, చిన్నమండెం, చిట్వేలి, గాలివీడు, గోపవరం, జమ్మలమడుగు, కలసపాడు, కోడూరు, లక్కిరెడ్డిపల్లె, మైదుకూరు, మైలవరం, ఓబులవారిపల్లె, పెనగలూరు, పెండ్లిమర్రి, పోరుమామిళ్ల, పులివెందుల, పుల్లంపేట, రాజంపేట, రాజుపాళెం, రామాపురం, రాయచోటి, కాశినాయన, సిద్ధవటం, టి.సుండుపల్లి, ఒంటిమిట్ట, ఎర్రగుంట్ల మండలాల్లో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మరింతగా వర్షాలు కురిస్తే చెరువులు, కుంటల్లోకి నీరు వస్తే భూమిలోకి నీరు ఇంకితే తాగునీటిని సరఫరా చేయాల్సిన అవసరం ఉండదు.