జగన్ కు బీ టెన్షన్
కడప, అక్టోబరు 16 (way2newstv.com)
ఆంగ్ల భాష నేర్చుకోవడానికి ముందు ఇలాగే చెబుతారు. ఏ అంటే యాపిల్ అని, బి అంటే బాల్ అని. కానీ అంగ్లం పూర్తిగా వచ్చేసినా కూడా ముఖ్యమంత్రి జగన్ మాత్రం బి అన్న అక్షరం దగ్గరే ఆగిపోయారు. దానికి కారణం బి అన్నది జగన్ని అంతలా వేధిస్తోంది. సాధిస్తోంది. జగన్ కి నచ్చని అక్షరం ఏదైనా ఉందంటే అది ఒక్క బీ మాత్రమేనట. ఎందుకిలా బీ ఫీవర్ వచ్చింది. బీ అన్న ఒకే ఒక్క అక్షరం జగన్ వంటి బలమైన ముఖ్యమంత్రిని ఎందుకిలా వణికిస్తోంది అంటే దానికి జవాబు సులువే. ఏపీలో జగన్ సీఎం అవడానికి పదేళ్ళు కష్టపడ్డారు. అయ్యాక మాత్రం ఆయన్ని కుదురుగా కూర్చోనివ్వని విధంగా అనేక ఘటనలు జరిగాయి, జరుగుతున్నాయి. కానీ బి తో ముడిపడిఉన్న రెండు విషయాలు మాత్రం జగన్ కి కొరుకుడు పడడంలేదు అంటున్నారు.వైఎస్ వివేకానందరెడ్డి సౌమ్యుడు అంటారు.
బీ అంటే బాబాయి...బోట్
చీమకు కూడా హాని చేయని అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. అటువంటి వివేకా జీవితంలో ఒకే ఒకసారి జగన్ కి ఎదురు నిలిచారు. ఎవరినీ ఎదిరించని బాబాయి అబ్బాయిని ఎదిరించారు. అది జగన్ రాజకీయ తొలినాళ్ళలో జరిగింది. ఎంతో కీలకమైన సందర్భంలో జగన్ కి వివేకా హ్యాండ్ ఇచ్చేసి తెగ టెన్షన్ పుట్టించారు. పులివెందుల ఉప ఎన్నికల్లో జగన్ తల్లి విజయమ్మ మీద పోటీ చేసి నిద్ర లేకుండా చేశారు. ఆ తరువాత జగన్ పార్టీలోకి వచ్చెశారు. కలసిపోవడమే కాదు, జగన్ సీఎం కావాలని చివరి రోజుల వరకూ పలవరించారు. ఆయన కోరిక తీరి జగన్ సీఎం అయ్యారు. మరి ఆ పదవిని జగన్ ఎంజాయ్ చేస్తున్నారా అంటే నో అన్న మాటే వస్తోంది. దానికి కారణం పరోక్షంగా బాబాయే. సరిగ్గా ఏడు నెలల క్రితం జరిగిన వివేకా దారుణ హత్య ఇప్పటికీ మిస్టరీగా ఉండిపోయింది. జగన్ ని వేధించుకుతింటోంది. బాబు వంటి వారు విమర్శలు చేసేలా చేస్తోంది. ఎంతలా ఈ కేసు నవ్వులపాలు అవుతోందంటే సోషల్ మీడియాలో వివేకా హత్య మీద ఆధారం లేని రాతలు రాసేసి పోలీసులనే ఫూల్స్ చేసేంతగా. వివేకా నిందితులు దొరికారు, కేసు ముగింపునకు వచ్చింది ఇలా వచ్చిన ఫేక్ వార్తలతో జగన్ ఇమేజ్ మరింత బదనాం అవుతోంది.ఇక గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద నెల రోజుల క్రితం జరిగిన బోటు ప్రమాదం కూడా అలాగే వెంటాడుతోంది. ఇంకా పద్నాలుగు మ్రుతదేహాలు బయటకు రాలేదు. బోటు సైతం వెలికి తీయలేకపోయారు. ఇంతటి అసమర్ధ ప్రభుత్వమా అంటూ చంద్రబాబు జగన్ ని ఈ విషయంలో చెడుగుడు ఆడుకుంటున్నారు. అదే బాబు అధికారంలో ఉంటే రెండు గంటల్లో బోటుని బయటకు తీసేవారని తమ్ముళ్లు అంటున్నారు. ఇక అసలు ప్రమాదం కూడా లేకుండా చూసేవారని బడాయి కబుర్లు చెబుతున్నారు. ఓ వైపు జగన్ ఎన్ని కార్యక్రమాలు చేస్తున్నా కూడా ఈ రెండు విషయాల్లో పురోగతి వస్తేనే తప్ప ఆయన ఈ ఘాటు విమర్శల నుంచి తప్పించుకోలేరని అంటున్నారు. ఈ రెండూ సున్నితమైన అంశాలు, అమాయక ప్రాణాలు పోయిన ఘటనలు. అందుకే మరి జగన్ బీ అంటే తలచుకుని కలవరపడుతున్నారు. ఎప్పటికి జగన్ ని ఈ బాధ వదులుతుందో చూడాలి.