విశాఖపట్టణం, అక్టోబరు 25, (way2newstv.com)
జనసేనాని పవన్ కళ్యాణ్ ఇక అసలైన విపక్ష పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నారు. ఆయన గత అయిదేళ్ళలో ప్రశ్నిస్తాను అంటూ చెప్పుకొచ్చారే కానీ నిజంగా నాటి చంద్రబాబు సర్కార్ని గట్టిగా నిలదీయలేదు. పూల బాణాలే వేస్తూ మిత్ర ప్రతిపక్షంగా చివరి ఏడాది వరకూ వ్యవహరించారు.ఇక పవన్ తన రాజకీయ భూమికను గోదావరి జిల్లాల నుంచి పోషిస్తూ వచ్చారు. అదే విధంగా ఉత్తరాంధ్రను కూడా కార్యక్షేత్రంగా చేసుకున్నారు. గతంలో ఆయన ఇక్కడ నుంచే ప్రజా పోరాట యాత్రకు కూడా శ్రీకారం చుట్టారు. అయితే ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓటమిపాలు అయిన తరువాత మళ్ళీ పవన్ ఈ వైపుగా తొంగి చూడలేదని విమర్శలు వినిపించాయి. దానికి తోడు పార్టీకి చెందిన నాయకులు చింతలపూడి వెంకటరామయ్య, చింతల పార్ధసారధి వంటి వారు జనసేనను వీడిపోయారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు.
ఉత్తరాంధ్ర నుంచి జనసేనాని పోరుబాట
దాంతో విశాఖలో పార్టీని పటిష్టం చేసుకోవడానికి కూడా పవన్ ఈ నగరాన్ని వేదికగా చేసుకున్నారని అంటున్నారు. మరి జగన్ మీద పవన్ సాగించే తొలి సమరం ఎలా ఉంటుందో, ఎటువంటి ఫలితం ఇస్తుందో వేచి చూడాల్సివుంది ఎన్నికల సభల్లోనూ ఆయన జగన్ ని మాత్రమే టార్గెట్ చేయడం ద్వారా అధికార పార్టీకి మిత్రుడుగానే మెలిగారని విమర్శలపాలు అయ్యారు. ఇపుడు ఏపీలో కొత్త సర్కార్ ఉంది. తాను మొదటి నుంచి టార్గెట్ చేస్తున్న జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాంతో పవన్ కి ఎలాంటి మొహమాటాలు లేని విధంగా విపక్ష పాత్ర పోషించే అవకాశం వచ్చింది.ఇక జగన్ అయిదు నెలల పాలనను పవన్ నిశితంగా పరిశీలిస్తున్నారు. ఆయనకు రాజకీయ సలహాదారులు కూడా ఉన్నారు. మొత్తానికి జగన్ పాలన విషయంలో అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నాయని భావించకున్నా పెద్ద సమస్య ఈ ప్రభుత్వంలో ఏదైనా ఉందంటే అది ఒక్క ఇసుక కొరత అన్నది పవన్ గుర్తించినట్లుగా ఉంది. దాన్ని పట్టుకుని తొలి పోరాటం సర్కార్ మీద చేస్తే హిట్ అవుతామన్న ఆలోచన కూడా ఆయనకు ఉన్నట్లుంది. అందుకే ఆయన ఇసుక కొరత మీదనే తన సమరభేరీని మోగిస్తున్నారు. విశాఖ వేదికగా పవన్ భవన నిర్మాణ రంగంలోకి కార్మికులతో కలసి నవంబర్ 3న విశాఖ వీధుల్లో నిరసన ర్యాలీని పెద్ద ఎత్తున నిర్వహిస్తారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఈ విధంగా చేయడం వల్ల అటు పేద కార్మికులకు తోడుగా ఉండడంతో పాటు, ఇటు ఇసుక కొరత వల్ల ఇల్లు కూడా కట్టుకోలేని మధ్యతరగతి వర్గాలకు కూడా చేరువ కావచ్చునన్న ఎత్తుగడతో పవన్ ఈ పోరాటానికి రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది.