ఏలూరు, అక్టోబరు 16, (way2newstv.com)
ఉచిత ఇసుక పేరుతో గత ప్రభుత్వంలో దోపిడీ జరిగిన సంగతి అందరికి తెలిసిందే. 2014 ఎన్నికలు ముగిశాక ఏడాది పాటు వినియోగదారులు ఇసుక కోసం నిలువు దోపిడీకి గురయ్యారు. ఆ తరువాత ఉచిత ఇసుక పేరుతో చంద్రబాబు నేతల బినామీలకు ఇసుక ర్యాంప్ లు కట్టబెట్టేశారు. దాంతో టిడిపి శ్రేణులు ఫుల్ జోష్ తో ఎలాంటి కొరత లేకుండా సర్కార్ కి రూపాయి కట్టక్కర్లేకుండా హాయిగా వ్యాపారం సాగించారు. ఇలా దోచేస్తే ఏమైంది డిమాండ్ కి తగ్గ ఇసుక అందుబాటులో ఉండేది. ఇదే ప్రధాన అస్త్రంగా వైసిపి అధినేత జగన్ ఎక్కడికక్కడ ఇసుక అవినీతిని ప్రశ్నిస్తూ ఈ అంశాన్ని బాగా తీసుకువెళ్ళి చర్చ పెట్టగలిగారు. వైసిపి అఖండ విజయంలో ఇసుకే కీలకమైంది.తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇసుక విధానం సమూల ప్రక్షాళన చేస్తామని చెప్పిన వైసిపి అనుకున్నట్లే పగ్గాలు చేపట్టింది.
ఇంకా తీరని ఇసుక కష్టాలు
వరద పూర్తిగా తగ్గుముఖ పట్టాక నూతన విధానం అధ్యయనం చేసి అమల్లో పెడతామని ప్రకటించి మూడున్నర నెలలు కాలయాపన చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈలోగా భవన నిర్మాణ రంగం కుదేలు అయ్యింది. ఘోర ఓటమిని ఎన్నికల్లో చవిచూసిన విపక్షాలకు ఇసుక బ్రహ్మాస్త్రం గా దొరికింది. ఉచిత ఇసుక పాలసీ ని రద్దు చేసి మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అప్పగించినా ఆన్ లైన్ విధానం తెచ్చినా ఆశించిన ప్రయోజనం దక్కడం లేదు. ఫలితంగా ఇసుక ధరలు చుక్కలు అంటుతున్నాయి. దీనికి తోడు భారీ వర్షాలు, వరదలతో ఇసుక లభ్యత డిమాండ్ కి తగిన విధంగా లేకపోవడం తో ప్రజల్లో వైసీపీ సర్కార్ పై అసంతృప్తి పెల్లుబికుతుంది.పాలనలో అనుక్షణం తమ విలువైన సమయం వెచ్చించవలిసిన అధికార యంత్రాంగం కలెక్టర్ నుంచి తహసీల్దార్ వరకు ఇసుక అమ్ముకోవడమే తమ జీవితం అన్నట్లు వ్యవహారం సాగడం విమర్శలకు దారి తీస్తుంది. ఎవరు చేయాలిసిన పని వారు చేయకుండా ఇలా ఇసుక, మద్యం వంటి వాటిపై దృష్టి పెట్టడం విపక్షాలకు అధికారపక్షమైన వైసీపీ పై దుమ్మెత్తి పొసే ఛాన్స్ ఇచ్చింది. కొన్ని సందర్భాల్లో సిఎంఓ ఆఫీస్ నుంచి రికమండేషన్ చేయిస్తే కానీ ఇసుక లభించడం లేదని అక్కడి నుంచి చెప్పించుకున్నా లభించడం లేదని కొందరు వినియోగదారులు వాపోతున్నారంటే ఎలాంటి పరిస్థితి ఉందొ తెలుస్తుంది. ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలు అయినా టిడిపి, బిజేపి, జనసేన లకు ఇసుకే ప్రధాన అజెండా అయ్యింది అంటే వైసీపీ సర్కార్ కళ్ళు తెరవాలిసిన సమయం ఆసన్నమైందని గుర్తించాలి.